Aug 25 2015 @ 18:41PM

ఎన్టీఆర్‌ ‘కన్యాశుల్కం’ 60 ఏళ్లు

మొదటి రిలీజ్‌లో జనాన్ని అంతగా ఆకట్టుకోలేకపోయిన సినిమా.. తర్వాత పలుమార్లు విడుదలై, మూడుసార్లు వందరోజులు ప్రదర్శితమైతే అది చరిత్ర కాక ఏమవుతుంది? అలాంటి చరిత్ర గల ఏకైక తెలుగు చిత్రం ‘కన్యాశుల్కం’. ఈ సినిమా విడుదలై ఆగస్ట్ 26 బుధవారానికి అరవై ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ‘కన్యాశుల్కం’ విశేషాలను గుర్తు చేసుకుందాం.

 
గురజాడ సృష్టికి పుల్లయ్య తెరరూపం..
ఈ రోజున వరకట్న దురాచారంలాగే ఆ రోజుల్లో ‘కన్యాశుల్కం’ సమాజంలో తాండవించేది. డబ్బుకోసం కన్నవారే ముక్కు పచ్చలారని చిన్నారులను ముసలివాళ్లకిచ్చి కట్టబెట్టేవారు. ఇంట్లో అమ్మాయి ఉందంటే ఎంతకు అమ్మవచ్చునని లెక్కలు వేసుకునే దుష్టసంప్రదాయాన్ని కళ్లార చూసిన గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకంలో ఆ దురాచారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాడుక భాషను సాహిత్యంలో ప్రవేశపెట్టి, తెలుగు భాషను జనానికి మరింత దగ్గర చేసిన ఘనత కూడా ఈ నాటకానికే దక్కుతుంది. ఆ నాటకం తెలుగునేల అంతటా జేజేలు అందుకుంది.
 
ఆ నాటకానికే సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ‘కన్యాశుల్కం’ చిత్రాన్ని నిర్మించారు వినోదా సంస్థ అధినేత డి.ఎల్‌. ఈ చిత్రానికి పి.పులయ్య దర్శకత్వం వహించారు. 1955 ఆగస్ట్‌ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
నాటకాభిమానులను అలరించిన ‘కన్యాశుల్కం’ చిత్రం
 
‘కన్యాశుల్కం’ నాటకం తెలుగువారు ఉన్న చోటల్లా పేరు సంపాదించుకుంది. ఈ నాటకంలో తొలి డైలాగ్‌ ‘సాయంత్రమయింది..’ అన్నది, చివరి డైలాగ్‌ ‘డామిట్‌ కథ అడ్డంగా తిరిగింది’ అనేది. ఈ రెండూ గిరీశం నోట వెలవడతాయి. ఆ డైలాగులు తెలుగువారికి కంఠోపాఠంగా ఉండేవి. నాటకంలో ఒక్కో పాత్ర ప్రవేశిస్తుంటే ఆ పాత్ర డైలాగులు జనాలే వల్లించేవారు. అంతలా పేరొందిన ఆ నాటకాన్ని సినిమా కోసం కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. ఆ విషయాన్ని టైటిల్స్‌కు ముందే నిర్మాత విన్నవించుకున్నారు. అయినప్పటికీ ‘కన్యాశుల్కాన్ని చెడగొట్టారని, బాల్యవివాహం వల్ల వితంతువులైన వారిని మోసం చేసే గిరీశం పాత్రను ఎన్టీఆర్‌ కోసం మార్పు చేసి చివర్లో మంచివాడిగా చూపించారని నాటకాభిమానులు కినుక వహించారు. మొదట్లో ఆ సినిమా విడుదలయినప్పుడు ఆ అభిమానులు పెదవి విరిచారు. నాటకమే బాగుందన్నారు. దాంతో డి.ఎల్‌ ఆశించిన స్థాయిలో ‘కన్యాశుల్కం’ ఆకట్టుకోలేకపోయింది. 
 
హేమాహేమీలు నటించిన చిత్రం 
‘కన్యాశుల్కం’ చిత్రంలో గిరీశంగా ఎన్టీఆర్‌, మధురవాణిగా సావిత్రి, బుచ్చమ్మగా జానకి, రామప్పంతులుగా సీఎస్సార్‌, అగ్నిహోత్రవధనులుగా వి.రామన్న పంతులు, పూటకూళ్లమ్మగా ఛాయాదేవి నటించగా, గుమ్మడి, వంగర, పద్మనాభం, గోవిందరాజులు, సుబ్బారావు, సూర్యకాంతం, హేమలత ఇతర పాత్రధారులు. అందరూ తమ పాత్రల పరిధి మేరకు రక్తి కట్టించారు. సందర్భానుసారంగా గురజాడ రాసిన ‘పూర్ణమ్మకథ’ను ఇందులో చక్కగా ఉపయోగించుకున్నారు. అలాగే బసవరాజు రాసిన నాగులచవితి పాట కూడా ఆకట్టుకుంది. మధురగాయకుడు ఘంటసాల స్వరకల్పన చేశారు.
 
పాటలతో పందిరి వేసిన ‘కన్యాశుల్కం’
ఈ సినిమాకు సదాశివబ్రహ్మం సంభాషణలు రాశారు. ‘సరసుడ దరి చేరరా...’ అనే పాటను కూడా సదాశివబ్రహ్మం పలికించారు. శ్రీశ్రీ రాసిన ‘ఆనందం అర్ణవమయితే’ కవితనే పాటగా మలుచుకున్నారు. అలాగే దేవురపల్లి రాసిన ‘చేదాము రారే కల్యాణం’ పాట కూడా ఆకట్టుకుంది. గిరీశంపై చిత్రీకరించిన ‘చిటారు కొమ్మన మిఠాయి పొట్లం’ పాటను మల్లాది రామకృష్ణ శాస్ర్తి రాశారు. ఇలా అందరూ లబ్ధప్రతిష్ఠులైన కవులు కలాల నుంచి జాలువారిన గీతాలు ‘కన్యాశుల్కం’ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. ‘చేదాము రారే కల్యాణం’ అంటూ సాగే బొమ్మల పెళ్లి పాటలో బాలనటిగా శారద నటించడం విశేషం.
 
1983లో 50 సంయుక్త వారాలు చూసిన ‘కన్యాశుల్కం’
‘కన్యాశుల్కం’ చిత్రంపై ఎన్ని విమర్శలున్నా ఒక్కసారైనా ఈ సినిమాను చూడాలని భావించిన వారు ఈ సినిమా చూశారు. అలా అర్ధశతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రం పర్లేదు బాగానే ఉందని అందరూ అనుకుంటున్న సమయంలో సరిగ్గా ‘కన్యాశుల్కం’ విడుదలైన 56 రోజులకు ఎన్టీఆర్‌ నటించిన జానసద చిత్రం ‘జయసింహ’ విడుదలై అఖండ విజయం సాధించింది. ఆ చిత్రం ఘనవిజయం మాటున ‘కన్యాశుల్కం’ మరుగున పడిపోయింది. అలా మొదటి రిలీజ్‌లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తర్వాత 28 ఏళ్లకు 1983లో ఈ చిత్రం హైదరాబాద్‌లో విడుదలైంది. సంధ్య 70 ఎమ్‌ఎమ్‌ ఉదయం ఆటలతోనూ, వేరే థియేటర్‌లలో మూడు ఆటలతోనూ ప్రదర్శితమైంది. సంధ్యలో ఏకధాటిగా 130 రోజులకు పైగా ఆడింది. అన్ని రోజులు ఇతర థియేటర్‌లలో షిప్టుల మీద మూడు ఆటలతో ఆడుతూనే ఉంది. షిప్టుతోనే 175 రోజులు ప్రదర్శితమైంది. అలా 50 సంయుక్తవారాలు జరుపుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ‘కన్యాశుల్కం’.

గిరీశం పాత్రకు న్యాయం చేసిన ఎన్టీఆర్‌
ఈ చిత్రం 1986లో విడుదలైనప్పుడు విజయవాడ విజయా టాకీస్‌లోనూ, గుంటూరు రాధాకృష్ణలోనూ నూన్‌ షో డైరెక్ట్‌గా వంద రోజులు ప్రదర్శితమయింది. ఆ తర్వాత గురజాడ ‘కన్యాశుల్కం’ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలోనూ ఈ చిత్రం 1993లో మరోమారు విడుదలైంది. అప్పుడు హైదరాబాద్‌లో ఇంకోసారి ఈ చిత్రం శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఇలా రిపీట్‌ రన్స్‌లోనూ మూడుసార్లు శతదినోత్సవం జరుపుకున్న చిత్రం భారతదేశం చలనచిత్ర చరిత్రలోనే మరొకటి కానరాదు. మొదటి రిలీజ్‌లో అంతటి ఆదరణ పొందని ఈ సినిమా రిపీట్‌ రన్స్‌తో విశేషాదరణ పొందడానికి ఇందులో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించడమే కారణమని వేరే చెప్పాలా? స్టార్‌ హీరోగా ఎంతో ఇమేజ్‌ ఉన్న ఎన్టీఆర్‌ గిరీశం వంటి నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రను అంగీకరించడం ఎంతో సాహసం. ఆషాడభూతి వంటి ఆ పాత్రను అనితరసాధ్యంగా పోషించి ఆకట్టుకోవడం విశేషమే. గిరీశం పాత్రకు మొదట ఏఎన్నార్‌ను అనుకున్నారని కథలు వినిపించాయి. కానీ అవన్నీ అవాస్తవం. నిర్మాత డి.ఎల్‌ మొదటినుంచి ఎన్టీఆర్‌ను వైవిధ్యంగా చూపించాలని తపనపడేవారు. ఆయన నిర్మించిన ‘దేవదాసు’లో తొలుత ఎన్టీఆర్‌నే అనుకున్నారు. ఆయన డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడంతో కుదరలేదు. దాంతో ఎన్టీఆర్‌ తో కూడా చరిత్రలో నిలిచిపోయే సినిమా తియ్యాలని డి.ఎల్‌ మొదటినుంచీ అనుకుంటూ ఉన్నారు. అందుకే ‘కన్యాశుల్కం’లో తొలి నుంచి గిరీశంగా ఎంచుకున్నారాయన. డి.ఎల్‌ కోరుకున్నట్టుగానే ‘కన్యాశుల్కం’లో ఎన్టీఆర్‌ గిరీశం పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. అలా ‘కన్యాశుల్కం’ జనాన్ని రంజింపచేసింది. అరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇందులోని కథాంశం ఈ నాటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం.