Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sun, 26 Jul 2015 00:48:55 IST

నేతన్నల జాతీయ నాయకుడు

నేతన్నల జాతీయ నాయకుడు

జాతీయ ఉద్యమంలో పాల్గొంటూనే చేనేత పరిశ్రమ రక్షణ కోసం పోరాటం చేసిన వీరుడు ప్రగడ కోటయ్య. ఎన్‌.జి.రంగా అడుగుజాడలలో నడిచి మహాత్మా గాంధీ ఆశీస్సులతో జాతీయ చేనేత కాంగ్రెస్‌ స్థాపించి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. చేనేత కార్మికులకు ప్రయోజనం కలిగించేందుకు సహకార సంఘాలు ఒక మార్గంగా సూచించిన దూరదృష్టి ఆయనది. చేతి మగ్గంతో బట్టలు నేసే నేతగాళ్ళ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడైన కోటయ్య వర్గ పక్షంగా నిలబడి దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా కొన ఊపిరి వరకు నిరంతరం శ్రమించారు. చేనేతరంగంతో పాటు రైతులు, జిన్నింగ్‌, స్పిన్నింగ్‌, కాంపోజిట్‌ మిల్లులపై ఆమూలాగ్రం అధ్యయనం చేసిన పరిశోధనా విద్యార్థి కోటయ్య గారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలులో చేనేత వృత్తి చేసుకొనే ప్రగడ వీరభద్రుడు, కోటమ్మ దంపతులకు 1915 జూలై 26న రెండవ కుమారుడుగా కోటయ్య జన్మించారు. వీరికి ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీ మణులు. 1931లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ స్కూలు ఫైనల్‌ ప్యాసయ్యారు. కొంతకాలం బాపట్ల తాలూకా బోర్డులో ఉపాధ్యయుడుగా ఉద్యోగం చేసారు. వీరి కుటుంబం చీరాల ఈపురుపాలెంలో కొంతకాలం నివాసం ఉన్నారు. ప్రగడ కోటయ్యగారి వివాహం ఇందిరాదేవితో జరిగింది. ఈ దంపతులకు ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. మద్రాస్‌ టెక్స్‌టైల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చదివి అక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేసారు. ఇదే అనుభవంతో 1935లో ఏర్పడిన మద్రాసు రాష్ట్ర చేనేత పారిశ్రామికుల సహకార సంఘంలో ప్రొడక్షన్‌ ఇన్‌ఛార్జిగా ఉద్యోగంలో చేరి సర్కారు జిల్లాల్లో ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేశారు.1952 నుంచి 1962 వరకు రెండు పర్యాయాలు, తర్వాత 1957 నుంచి 1972 వరకు ఎమ్మెల్యేగా, 1974 నుంచి 1980 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. అనంతరం 1990 నుంచి 1995లో మరణించేంత వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1974 నుంచి 1978 వరకు పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. 1945లో ఏర్పడిన ఆల్‌ ఇండియా హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. నిరంతరం ప్రజాజీవితం గడిపిన కోటయ్య అనారోగ్యం కారణంగా 1995 నవంబర్‌ 26న మరణించారు. 70వ జన్మదినం సందర్భంగా చీరాలలో జరిగిన సభలో ఆనాటి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ బెజవాడ గోపాలరెడ్డి, కోటయ్య గారికి ‘ప్రజాబంధు’బిరుదునిచ్చి సత్కరించారు. కోటయ్య మరణాంతరం రాష్ట్ర ప్రభుత్వం వెంకటగిరిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూం టెక్నాలజీ సంస్థకు ప్రగడ కోటయ్య పేరు పెట్టింది.

 
1937 జూన్‌లో నిడుబ్రోలులో గుంటూరు జిల్లా చేనేత మహాసభ జరిగింది. ఈ సభను వెనుక వుండి నడిపించింది కోటయ్య గారే. ఎన్‌.జి.రంగా ఈ సభలు ప్రారంభించారు. తాడిపర్తి శ్రీకంఠం, దామెర్ల రమాకాంతరావు, రామనాథం రామదాసు, పెండెం వెంకట్రాములు నాయకత్వం వహించారు. ఆ తర్వాత గుంటూరులో చెన్న రాష్ట్ర చేనేత మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభలో అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చేనేత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి వుందని ఆయన ప్రకటించారు. 1939లో జరిగిన మద్రాసు రాష్ట్ర కేంద్ర చేనేత సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టర్లుగా చేనేత నాయకులు ఎన్నికయ్యేలా కోటయ్య పథకం రచించి కృతకృత్యులయ్యారు. 1941లో బ్రిటిష్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేనేతరంగం స్థితిగతులను అధ్యయనం చేసేందుకు థామస్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీని కోటయ్య గుంటూరు జిల్లాకు ఆహ్వానించారు. వంద పేజీల మెమొరాండాన్ని ఆ కమిటీకి అందజేశారు. 1942లో చెన్నరాష్ట్ర చేనేత పారిశ్రామిక సంఘాన్ని చైతన్యవంతంగా చేసేందుకు దామెర్ల రమాకాంతరావు అధ్యక్షులుగా, కోటయ్య ప్రధాన కార్యదర్శిగా కృషి చేశారు. నూలు కొరతను అధిగమించేందుకు నూలు ధరల స్థిరీకరణ కోసం చేనేత రక్షణ యాత్రలు నడిపారు.
 
చేనేత పారిశ్రామికులకు చాలినంత నూలు సరఫరా చేయాలని, నూలు ధరలు అదుపులో పెట్టాలని, నూలు ఎగుమతులు ఆపాలని నినదిస్తూ కోటయ్య ఆందోళనలు చేపట్టారు. 1950 వరకు పరిస్థితులలో మార్పు రాలేదు. దాంతో చేనేత కాంగ్రెస్‌ సమర శంఖం పూరించింది. అన్ని జిల్లాల్లో ఆకలియాత్రలు, సత్యాగ్రహాలు పెద్దఎత్తున చేపట్టారు. అయినా ఫలితం రాలేదు. దాంతో మద్రాసు నగరంలో 1950 ఏప్రిల్‌ 16 నుంచి జూన్‌ 30 వరకు 75 రోజులపాటు కోటయ్య సత్యాగ్రహం నడిపారు. దాదాపు పదివేల మంది చేనేత కార్మికులు ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 75 రోజుల అనంతరం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి హరేకృష్ణ మెహతాబ్‌ మద్రాసు వచ్చారు. చేనేత కాంగ్రెస్‌ నాయకులతో చర్చలు జరిపారు. మంత్రిగారు ఇచ్చిన హమీలతో సత్యాగ్రహాన్ని విరమించారు.
 
1952 మద్రాసు శాసనసభ ఎన్నికల్లో కిసాన్‌ మజ్దూర్‌ ప్రజాపార్టీ అభ్యర్థిగా కోటయ్య చీరాల నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎన్నికయ్యారు. 1953 తర్వాత చేనేత వర్గాల ప్రయోజనాల కోసం రేపల్లెలో సత్యాగ్రహం చేపట్టారు. ఫలితంగా కోటయ్య జైలు శిక్ష అనుభవించాల్సివచ్చింది. కనుంగో కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు. పవర్‌ మగ్గాల ఏర్పాటుతో చేనేత కార్మికుల జీవితాలు కడతేరవని ఆయన బలంగా నమ్మారు. రెండున్నర దశాబ్దాలు చట్టసభల్లో సభ్యుడిగా ఉన్న కోటయ్య చేనేతే తన శ్వాస ధ్యాస అన్నట్లుగా జీవించారు. చట్టసభల్లోను, బయట వస్త్రరంగం గురించి వీరు ప్రపసంగిస్తుంటే ప్రతి ఒక్కరూ ఆసక్తిగా వినేవారు. కోటయ్య డిమాండ్లు, ప్రతపాదనలకు ప్రతి సభ్యుడూ మద్దతు పలుకుతూ వచ్చారు. ఎందుకంటే ఆయన చర్చించే అంశం మొత్తం భారతదేశవ్యాప్తంగా ఉన్న చేనేత పారిశ్రామిక వర్గానికి చెందినది కాబట్టి. చేనేత కార్మికవర్గ ప్రయోజనాల కోసం నిరంతరం అప్రమత్తతతో ఉంటూ వచ్చారు. చేనేతకు సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం చేయాలన్నా కోటయ్య గారిని సంప్రదించాల్సిందే! కోటయ్య శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన నిబద్ధత, నిజాయితీ, నిరాడంబరత, కార్యదీక్షత, పోరాటపటిమలను ముందుకు తీసుకుపోవాలి. చేనేత రంగం అభివృద్ధికి కోటయ్య చూపిన మర్గాన్ని నేటి నవతరం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. ప్రజల కోసం ప్రజలతో జీవించి వారి కోసమే చివరి శ్వాస వరకు జరిపిన పోరాట పటిమకు శతజయంతి జోహార్లు.
తడ్క యాదగిరి
ఆల్‌ ఇండియా హాండ్లూమ్‌ బోర్డ్‌ సభ్యులు
(నేడు ప్రగడ కోటయ్య శత జయంతి)

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.