Jul 19 2015 @ 00:19AM

ఏది పాపం.. ఏది పుణ్యం?

గోదావరి పుష్కరాల సందర్భంగా తొలి రోజున రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో 27 నిండు ప్రాణాలు పోయాయి. ఇంత మంది చావుకు కారణం ఎవరు? ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిదే బాధ్యత అని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమే! ఈ చావులకు ఒక్క చంద్రబాబు నాయుడే కారణమా? తెలుగునాట భక్తి రసాన్ని ఒక ఉద్యమంలా వ్యాపింపచేస్తున్న వారు కారణం కాదా? పుష్కరాలు ఇప్పుడే మొదటిసారిగా జరుగుతున్నాయా? గతంలో జరగలేదా? ఇంతకు మున్నెన్నడూ లేని విధంగా తెలుగు ప్రజలు లక్షల సంఖ్యలో పూనకం వచ్చినట్టు గోదావరిలో మునకలేయడానికి కారకులు ఎవరు? పుణ్యం పేరిట బురద నీళ్లలో కూడా మునిగేలా ప్రజలను ప్రేరేపించింది ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం అన్వేషించాలంటే గత కొంతకాలంగా తెలుగునాట భక్తి పేరిట జరుగుతున్న వ్యాపారం గురించి చర్చించుకోవాలి. ఒకప్పుడు పిండ ప్రదానాలకు మాత్రమే పరిమితమైన పుష్కరాలను ఇప్పుడు పుణ్యస్నానాలుగా మార్చివేశారు. తార్కికంగా ఆలోచించవలసిన ప్రజలను ‘విశ్వాసం’ పేరిట మాయలో పడేశారు. ఇప్పుడు జరుగుతున్న పుష్కరాలను 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా పుష్కరాలుగా ప్రచారం చేసిపారేశారు. 144 ఏళ్ల క్రితం గోదావరి నది ఏ రూపంలో ఉండేదో ఈ ప్రచారం చేస్తున్నవారికి తెలుసా? ఇప్పుడు పుణ్య స్నానాలు చేయకపోతే పాపులుగా మిగిలిపోతారని హెచ్చరికలు జారీచేశారు. సృష్టిని పూజించాలా? సృష్టికర్తను పూజించాలా? అంటే సమాధానం లభించని పరిస్థితి కల్పించారు. వెరసి తెలుగునాట ఇప్పుడు భక్తి మాఫియా రాజ్యమేలుతోంది. ఈ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ముగ్గురున్నారు. మొదటివారు పీఠాధిపతులు లేదా ప్రవచనకారులు. రెండవవారు మీడియావాళ్లు. మూడవ స్థానంలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ మూడు శక్తులూ కలిసి 27 మంది ప్రాణాలు బలి తీసుకున్నాయి. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామంటూ కొంతమంది స్వయంప్రకటిత పీఠాధిపతులు వెలిశారు. వారికితోడుగా ప్రవచనాలు చెప్పేవారు పుట్టుకొచ్చారు. భక్తి పేరిట ప్రజలను ఒక రకంగా మానసిక రోగులుగా మార్చివేశారు. పిల్లికి బిచ్చం పెట్టనివారిని సైతం ప్రవచనాల ప్రభావానికి లోనుచేసి విరాళాలు దండుకోవడం మొదలెట్టారు. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని స్వాములకు, వారిభక్తులకు మధ్య అనుబంధంగా మార్చివేశారు. ఈ పరిణామాలను గమనించిన మీడియా, తాము ఎక్కడ వెనుకబడిపోతామోనని ఆధ్యాత్మికత పేరిట చానెళ్లు ప్రారంభించాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ చానెళ్లలో రోజుకో కొత్త స్వామి తెర మీద ప్రత్యక్షమై ప్రవచనాల పేరిట ప్రజలను భక్తికంపితులుగా చేశారు. పాపాలకు పరిహారం ఉందంటూ చెప్పి ప్రజలను సన్మార్గులుగా తీర్చిదిద్దవలసింది పోయి, మనం ఎన్ని పాపాలు చేసినా ప్రక్షాళనకు అవకాశం ఉంది కదా! అన్న భ్రమల్లోకి నెట్టారు. శాస్ర్తాల పేరిట కట్టుకథలను, పుక్కిటి పురాణాలను జనంలోకి వదలడం మొదలెట్టారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వాలు కూడా భక్తి పారవశ్యంలో మునుగుతున్న ప్రజలను తమ వైపునకు ఆకర్షించుకోవడానికి ప్రతి సందర్భాన్నీ వినియోగించు కుంటున్నాయి. ఇప్పుడు జరుగుతున్న పుష్కర ప్రచారం కూడా అందులో భాగమే! సర్వసంగపరిత్యాగులుగా ఉండవలసిన స్వాములు, ప్రవచనకారులలోనే స్వార్థం ప్రవేశించినప్పుడు రాజకీయ నాయకులలో ప్రవేశించదా? అందునా తెలుగు నేల రెండు రాష్ర్టాలుగా విడిపోయి ఉభయ రాష్ర్టాలలోని ప్రభుత్వాలు అనేక విషయాలలో పోటీ పడుతున్నాయి కదా! ఈ క్రమంలోనే పుష్కర ఏర్పాట్లను కూడా భారీగా చేసి అంతకంటే భారీగా ప్రచారం కల్పించాయి. ఒకవైపు స్వాములు, మరోవైపు ప్రభుత్వాలు, మధ్యలో మీడియా- ఈ ముగ్గురూ కలిసి గోదావరి జలాలు కలుషితంగా ఉన్నా లెక్కచేయకుండా మునగాల్సిందే, పుణ్యం మూటకట్టుకోవలసిందేనని ప్రజలంతా భావించే స్థితి కల్పించారు. పుణ్య స్నానాలు ఆచరించకపోతే పాపులుగా మిగిలిపోతామన్న భయంతో ముందుగా వెళ్లి పుణ్య ప్రాప్తి పొందాలనుకున్న వారిలో 27 మంది ప్రాణాలు వదిలారు. పుణ్య స్నానం కోసం వచ్చి మృతిచెందిన ఈ 27 మందీ నేరుగా స్వర్గప్రాప్తి పొందారా? లేదా? అన్నది మన స్వాములు, ప్రవచనకారులు చెప్పాలి. ప్రతి దానికీశాస్త్రం చెప్పింది అని అనేవాళ్లు ఈ విషయం కూడా శాస్త్రంలో ఉందో లేదో వివరించాలని కోరుకోవడంలో తప్పు లేదనుకుంటాను.
 
 మంచిని ముంచి...
ప్రజలను గుళ్లూ గోపురాలు, పుణ్యక్షేత్రాలు, నదుల వెంట పరిగెత్తిస్తున్న స్వాములు, ప్రవచనకారులు సమాజానికి మేలు చేస్తున్నామా? కీడు చేస్తున్నామా? అన్న విషయాన్ని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదేమో! ప్రజలలో వ్యక్తిత్వాన్ని, శీల సంపదను పెంపొందించవలసిందిపోయి మాఫియాగా ఏర్పడి భక్తి సామ్రాజ్యాలను నిర్మించుకుంటున్నారు. సమాజం నుంచి లభించిన సహకారంతో ధనాన్ని ఆర్జించినవారు సమాజ సేవకు పునరంకితులు కావలసిందిపోయి, స్వాములకు అంకితం అవుతున్నారు. ఒక్కొక్క స్వామిచుట్టూ కొంతమంది ధనవంతులు ముఠాలుగా ఏర్పడి ఆయా స్వాముల సామ్రాజ్యాలను విస్తరింపజేస్తున్నారు. ఇక్కడ పుణ్యం సంగతి ఏమో గానీ, పురుషార్థం మాత్రం కచ్చితంగా ఉంటోంది. భగవంతుడికి, భక్తుడికి మధ్య అనుసంధానకర్తలుగా ఉండవలసిన కొందరు స్వాములు తమను పోషిస్తున్నవారి ప్రయోజనాల పరిరక్షణకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకు దేవాలయాల్లో లేదా ఆశ్రమాల్లో ప్రవచనాలు చెప్పేవారు. అది కూడా మనుషులను స్వార్థానికి దూరంగా ఉండమని చెప్పేవారు. మానవ సేవయే మాధవ సేవ అని బోధించేవారు. ఇప్పుడు అలా జరుగుతున్నదా? జరుగుతూ ఉంటే ప్రవచనాలు వింటున్నవారు స్వార్థానికి అతీతులుగా ఎందుకు మారలేకపోతున్నారు? పాపాలు చేయకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం అడిగితే తిట్టిపోస్తారు. అదేమంటే నాస్తికులనో, హిందూ మత వ్యతిరేకులు అనో ముద్ర వేస్తారు. ఇటీవల కాలంలో తెలుగునాట బాగా ప్రాచుర్యం పొందిన చాగంటి కోటేశ్వరరావు విషయమే తీసుకుందాం. ఈయనగారు చెప్పే ప్రవచనాలకు ప్రజలు అధిక సంఖ్యలో ఆకర్షితులవుతున్నారు. ఈ పరిణామం సహజంగానే ప్రవచనాలు చెప్పే ఇతరులకు కడుపు మంట పుట్టిస్తూ ఉండవచ్చు. ఇప్పుడు పుష్కరాల సందర్భంగా చాగంటి అనుగ్రహ భాషణంపై వ్యక్తమైన విమర్శలను కూడా ఈ కోణంలోనే చూడాలి. ఏ కారణంతో విమర్శించినా, చాగంటి వ్యాఖ్యలు మాత్రం అభ్యంతరకరమైనవనే చెప్పాలి. తమను ఎవరు ఎక్కువగా నమ్మించగలిగితే వారు అంత గొప్పగా ప్రవచనాలు చెప్పినట్టుగా ప్రజలు పరిగణిస్తారు కనుక చాగంటి కోటేశ్వరరావు ఈ విద్యలో మిగతావారికంటే ఒక అడుగు ముందే ఉన్నారు. దీంతో గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవ హారతిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా రాజమండ్రిలో 13వ తేదీ సాయంత్రం చాగంటి ఉపన్యసించారు. అది ఉపన్యాసమో? ప్రవచనమో? తెలియదు. మొత్తానికి ఆ సందర్భంగా పుష్కరాలు ప్రారంభ ముహూర్తంలోనే స్నానం చేస్తే పుణ్యం సిద్ధిస్తుందనీ, పనిలో పనిగా గోదావరిలో మునిగినవారు ఒడ్డున ఉన్న కాస్త మట్టి తీసి నదిలో వేయాలని సదరు చాగంటి సెలవిచ్చారు. అలా చేయకపోతే కృత్య అనే రాక్షసి పుష్కర స్నానం చేసిన వారి పుణ్యాన్ని తినేస్తుందని, దాంతో స్నానం చేసినా పుణ్యం దక్కదని పేర్కొన్నారు. ఈ మాటలు విన్న అధికారులకు వణుకు పుట్టింది. ఎందుకంటే స్నానం చేసినవారంతా ఇలా మట్టి తీసుకెళ్లి వేస్తే ఆ క్రమంలో అది కాస్తా మెట్లపై పడి భక్తులు కాలు జారిపడతారన్నది వారి ఆందోళన. మొత్తంమీద దేవుడు కరుణించి భక్తులతో ఆ పని చేయించలేదనుకోండి. లేకపోతే తొక్కిసలాటలో చనిపోయినవారితో పాటు బురద వల్ల కాలు జారి ఎముకలు విరగ్గొట్టుకునేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండేది. ఇంతకీ కృత్య అనే రాక్షసి ఉండటమేమిటి? మిగతా రాక్షసుల వలె మనుషులనో, దేవతలనో చంపి తినకుండా అమాయక ప్రజలు పుష్కర స్నానమాచరించి సంపాదించుకున్న పుణ్యాన్ని తినడమేమిటి? ఇందులో హేతుబద్ధత ఏమైనా ఉందా? మనుషులుగా మనం మనకు సహాయం చేసిన వారినీ, ఆపదలో ఆదుకున్న వారినీ దేవుడుగా భావించి భక్తిభావం ప్రదర్శిస్తాం. కీడు చేసినవారినీ, అన్యాయంగా వ్యవహరించినవారినీ రాక్షసులుగా అభివర్ణించి శపిస్తూ ఉంటాం. పురాణాల్లో గానీ, శాస్ర్తాల్లోగానీ పాపాత్ములు, పుణ్యాత్ములు అనే చెప్పి ఉంటారు. పాపాలు చేసిన వారిని రాక్షసులుగా చిత్రీకరించి అందుకోసం కొన్ని క్యారెక్టర్లను సృష్టించి ఉంటారు. శాస్ర్తాల్లో చెప్పిన వాటిల్లో హేతుబద్ధతను వదిలేసి ప్రజలను భయపెట్టడానికో, భక్తి పేరిట వివేకరహితులుగా మార్చడానికో ప్రయత్నించడమే పెద్ద పాపం. వాస్తవానికి ఇలాంటి విషయాలను కూడా పురాణాలు, శాస్ర్తాలలో పేర్కొన్నారు. పాప పుణ్యాల పేరిట ప్రజలను తప్పుదారి పట్టించిన క్యారెక్టర్లను, తమను తాము దేవుళ్లుగా ప్రచారం చేసుకున్నవారి గురించి పురాణాల్లో పేర్కొన్నారు. పౌండ్రక వాసుదేవుడు అనే క్యారెక్టర్‌ అలా సృష్టించబడిందే! ఇప్పుడు మన మధ్య ఎందరో పౌండ్రక వాసుదేవుళ్లు సంచరిస్తున్నారు. వారినే దేవుళ్లుగా కొందరు నమ్ముతున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రజలకు దాహార్తిని తీర్చడంతో పాటు బంగారు పంటలు పండించుకోవడానికి గోదావరి నది ఉపయోగపడుతోంది. అటువంటి గోదావరి నది పట్ల మనకు కృతజ్ఞతాభావం ఉండి తీరాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? గోదావరిని కాలుష్య కాసారంగా మార్చివేశాం. ఇంతటి పాపానికి ఒడిగట్టిన మనకు అందులో మునిగినంత మాత్రాన పుణ్యం ఎలా వస్తుంది? సృష్టికర్త సృష్టించిన వాటికి హాని చేయవద్దని ఎంతమంది ప్రవచనకారులు చెబుతున్నారు?
 
స్వాములోర్ల భక్తి వ్యాపారం
కొంత మంది స్వాములోర్లు, ప్రవచనకారులు వ్యక్తిగత ప్రచారానికి అర్రులు చాచడం వల్ల ప్రస్తుత దుస్థితి ఏర్పడింది. ఈ వ్యక్తిగత ప్రచార కాంక్ష ఎంతవరకు వెళ్లిందంటే కొంత మంది స్వాములు తమకు సొంతంగా భక్తి చానెళ్లు ఏర్పాటు చేసుకునేంత వరకు. చినజీయర్‌స్వామి ఇటీవలే ఒక చానెల్‌లో కొంత వాటాను సొంతం చేసుకున్నారు. శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి సొంతంగా ఒక భక్తి చానెల్‌ ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నారు. బహుశా ఈ విషయంలో వాళ్లకి కొన్ని క్రైస్తవ సంస్థలు ఏర్పాటుచేసిన చానెళ్లు ఆదర్శం అయి ఉంటాయి. ఈ ఇద్దరి ప్రేరణతో భవిష్యత్తులో మరికొంత మంది స్వాములు కూడా చానెళ్లు ప్రారంభించవచ్చు. సొంతంగా చానెల్‌ ప్రారంభించే ఆర్థిక స్థోమత లేని స్వాములు ఇలాంటివారిని నిందించవచ్చు. తెలుగునాట ఏదైనా వేలంవెర్రిగానే ఉంటుంది. ఎవరైనా ఒక వ్యాపారం ప్రారంభించి లాభాలు గడిస్తే మిగతావారు కూడా అదే వ్యాపారం మొదలుపెట్టి సదరు వ్యాపారం దివాలా తీసే వరకు నిద్రపోరు. ఇప్పుడు ఈ ధోరణి భక్తి వ్యాపారంలో కూడా ప్రబలుతోంది. ఒకరు ఆధ్యాత్మిక చానెల్‌ ప్రారంభించడంతో మిగతావాళ్లు కూడా మొదలుపెట్టారు. శాస్ర్తాల గురించి, పురాణాల గురించి తెలియని ఎవరెవరో చానెళ్లు ప్రారంభించడమేమిటి? మనమే సొంతంగా పెట్టుకుందాం అన్న ఆలోచనకు స్వాములు వస్తున్నారు. ఇదంతా సమాజంలో పరివర్తన తెస్తుందా? అంటే కాదనే చెప్పవలసి ఉంటుంది. పరివర్తన వచ్చి ఉంటే ఇవ్వాళ సమాజంలో అధర్మం ఇంతగా విజృంభించి ఉండేది కాదు. ధర్మం- అధర్మం మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు చెప్పకుండా పాపాలు చేయండి- వాటి పరిహారానికి క్రతువులు చేయండి అని సెలవిస్తున్నారు. ప్రవచనాలకు వెళ్లి వాటిని వింటున్నవారు పరివర్తన చెందాలి కదా? అలా ఎందుకు జరగడం లేదు? లోపం ఎక్కడ ఉంది? ఈ విషయాన్ని ప్రవచనాలు చెప్పేవారు ఆలోచిస్తే మంచిది. మనుషులందరూ సమానమేనని చెప్పలేని ప్రవచనాలు ఎవరిని ఉద్ధరించడానికి? తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు గానీ, మీడియా సంస్థలు గానీ చెబుతున్న లెక్కల ప్రకారం.. ఇప్పటికే ఇరు రాష్ర్టాలలో పుష్కర స్నానం ఆచరించి పునీతులైనవారు కోట్లలో ఉన్నారు. వారిలో దళితులు ఎంత మంది ఉన్నారు? వారు హిందూ ధర్మానికి దూరంగా ఎందుకు ఉండిపోతున్నారు? పీఠాధిపతులు, మఠాధిపతుల నిరాదరణకు ఎందుకు గురవుతున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. సాటి మనిషిని అగ్రవర్ణానికి చెందినవాడైనా ముట్టుకోవడమే మహా పాపం అన్నట్టుగా వ్యవహరించే ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు దళితులను దరిచేర్చుకోవాలనుకోవడం దురాశే అవుతుంది. మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్న పుష్కరాలకు మనలోనే ఒక వర్గం దూరంగా ఉండిపోవడం హిందూ ధర్మానికి శోభనిస్తుందా? ఇదేదో అగ్రవర్ణాల వారి పండుగ అని కొందరు భావించడం హిందూ ధర్మంలోని డొల్లతనాన్ని బట్టబయలు చేయడం లేదా? అయినా గురువులుగా ఉండవలసిన వారు స్వాములుగా, స్వాములుగా ఉండవలసిన వారు దేవుళ్లుగా ప్రమోషన్‌ పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్లీ గోదావరి పుష్కరాలకు వద్దాం. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కుటుంబసమేతంగా తొలి రోజే పుష్కర స్నానం చేశారు. ముఖ్యమంత్రులు చేశారు కనుక మంత్రులు కూడా పోటీపడి చేశారు. కొంతమంది అయితే పలుమార్లు స్నానమాచరించి పెద్దమొత్తంలో పుణ్యం మూటగట్టుకునే ప్రయత్నం చేశారు. ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి క్రైస్తవాన్ని ఆచరిస్తారు. అయినా ఆయన తాను విశ్వసించని హిందూ ధర్మం ప్రకారం పుష్కర స్నానం చేసి దివంగత తండ్రి రాజశేఖర్‌ రెడ్డికి పిండ ప్రదానం చేశారు. రాజశేఖర్‌ రెడ్డి అంత్యక్రియలు జరిగినప్పుడు మాత్రం ఆయన గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ పిండ ప్రదానం వంటి క్రతువు నిర్వహించలేదు. మరి ఇప్పుడు ఎందుకు చేశారంటే అందులో రాజకీయ ప్రయోజనం పొందాలని. లక్షల సంఖ్యలో ప్రజలు పుష్కర స్నానాలు చేస్తూ ఉంటే తాను దూరంగా ఉంటే హిందువులకు దూరమవుతానని భయపడి ఉంటారు! జగన్మోహన్‌ రెడ్డిది రాజకీయ స్వార్థం అయితే మిగతా వారిది పుణ్యం పొందాలన్న స్వార్థం. మంచి పనులు చేస్తూ సాటి మనిషికి చేతనైనంత సహాయం చేస్తే పుణ్యం వస్తుందని శాస్ర్తాలు చెప్పిన విషయం వాస్తవం కాదా? పుణ్యం రావాలని కోరుకోవడం కూడా స్వార్థమే అవుతుందని శాస్ర్తాలలో చెప్పలేదా? ప్రతిఫలాన్ని ఆశించి ఏ పనీ చేయకూడదని సూచించలేదా? మరి అలాంటప్పుడు గోదావరిలో మునిగితేనే పుణ్యం వస్తుందని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడం కాదా? పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుందన్నది విశ్వాసం మాత్రమే! ఈ విశ్వాసాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల దైనందిన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు- వాటినన్నింటిని కడుక్కోవడానికి అందివచ్చిన మొదటి అవకాశం ఈ పుష్కర స్నానం అన్న అభిప్రాయంతో ప్రజలు లక్షలాదిగా వెళ్లి స్నానాలు చేస్తున్నారు. మీడియా కూడా వందల్లో వస్తే వేలల్లో వచ్చారనీ, వేలల్లో వస్తే లక్షల్లో వచ్చారనీ ప్రచారం చేస్తోంది. దీంతో తాము కూడా ఎలాగైనా పుణ్యం పొందాలన్న తపనతో పుష్కర ఘాట్లు బురదమయంగా ఉంటున్నా వెరవకుండా ముక్కు మూసుకుని మునకలేస్తున్నారు. పుష్కరాలు ముగిసేనాటికి ఉభయ రాష్ర్టాలలో ఉన్న తెలుగు ప్రజలలో అత్యధికులు స్నానాలు చేసి పుణ్యం సొంతం చేసుకోబోతున్నారన్న మాట! దీన్నిబట్టి ప్రభుత్వం, మీడియా చెబుతున్న లెక్కల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యాత్ములే ఉంటారు. మొత్తంమీద పుణ్యాత్ముల సంఖ్య అధికంగా ఉంటుంది కనుక రెండు రాష్ర్టాలలో ధర్మం నాలుగు పాదాలా నడవాలి మరి! అలా నడవకపోతే ఆ పాపం ప్రవచనాలు చెప్పేవారిదే గానీ వారి మాటలు విని స్నానాలు చేసినవారిది కాదు. తెలుగు రాష్ర్టాలను వర్షాభావం వెంటాడుతోంది. ధర్మం ఎక్కడ విరాజిల్లుతుందో అక్కడ నెలకు మూడు వానలు పడతాయని చెబుతారు కదా! ఇన్ని కోట్లమంది పుష్కర స్నానం చేయడం వల్ల ధర్మం విరాజిల్లి వానలు పడితే రైతులన్నా సంతోషిస్తారు. భక్తుల విశ్వాసాన్ని ఎందుకు కాదనాలన్న ఉద్దేశంతో వ్యవసాయానికి ఉపయోగ పడవలసిన నీటిని తెలంగాణ ప్రభుత్వం కడెం వంటి ప్రాజెక్టుల నుంచి గోదావరిలోకి విడుదల చేసింది. ఇప్పుడు వానలు కురవకపోతే ఆ ప్రాజెక్టుల కింద సాగు కూడా ప్రశ్నార్థకమే అవుతుంది. ప్రజలందరూ పునీతులవుతున్నారు కనుక ఆ పరిస్థితి రాదని ఆశిద్దాం. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా పుష్కర స్నానం చేశారు కనుక వారికి కూడా పుణ్యం వచ్చి ఉంటుంది. స్నానంతో వచ్చిన పుణ్యంతో సంతృప్తిపడకుండా ఇరు రాష్ర్టాల మధ్య నెలకొన్న వివాదాలు, సమస్యలను పెద్ద మనసుతో పరిష్కరించుకుంటే మరింత పుణ్యం వస్తుందని వారి చెవిలో ప్రవచనాలు చెప్పేవారు ఊదితే బాగుంటుంది. పుష్కర ఘట్టం ముగింపునకు వచ్చేసరికి తెలంగాణలోని కొన్నిఘాట్‌లలో బురద మాత్రమే మిగలవచ్చు. ఏపీలో రాజమండ్రి వద్ద గోదావరి జలాలు మరింత కలుషితం కావచ్చు. జనాలకు చర్మ వ్యాధులు కూడా రావచ్చు. గోదావరిలో నీళ్లు లేని సమయంలో పుష్కరుడు ప్రవేశించడమే అన్నింటికన్నా బ్యాడ్‌! వచ్చే పుష్కరాలకైనా గోదావరిలో సమృద్ధిగా నీళ్లు ఉండాలని ఆశిద్దాం!