desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jul 12 2015 @ 00:04AM

విప్లవ మార్గదర్శి డీవీ

ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనిస్టు ఉద్యమంలో ఏ ఇతర నాయకుడితో పోల్చినా దేవులపల్లి వెంకటేశ్వరరావు ద్వితీయులయ్యే అవకాశం లేదు. 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి గుండెలాంటి నల్గొండ జిల్లా పార్టీ సారధిగా అటు పోరాటంలోనూ, ఇటు సిద్ధాంత చర్చలోనూ అగ్రభాగాన నిల్చిన వ్యక్తి. 1969 తర్వాత నక్సల్‌బరీ విప్లవోద్యమంలో తరిమెల నాగిరెడ్డి - చండ్ర పుల్లారెడ్డిలతో కల్సి వున్న ‘ఆంధ్రప్రదేశ్‌ విప్లవ కమ్యూనిస్టు కమిటీ’కి ఆయనే కార్యదర్శి. ఉద్యమంలో ‘అతివాద పెడధోరణి’, ‘మితవాద పెడధోరణి’లపై ఆయనరాసిన సిద్ధాంత ప్రతాలే ఆనాటి నుంచి ఈనాటి వరకు విప్లవకారులకు గైడుగా, గైడెన్స్‌గా ఉపయోగపడుతున్నాయి.
డి.వి. 1917 జూన్‌ 2న వరంగల్‌ జిల్లా ఇనుగుర్తిలో జన్మించినా వీరి స్వస్థలం సూర్యాపేట సమీపంలోని చందుపట్ల గ్రామం. సంపన్న భూస్వామ్య కుటుంబంలో జన్మించిన డి.వి. బాలవితంతువైన శ్రీరంగమ్మను వివాహం చేసుకున్నారు. దేవులపల్లి ప్రాథమిక విద్యాభ్యాసం చందుపట్ల సమీపంలోని తిరుమలగిరి, నామవరం గ్రామాల్లోనూ, మాధ్యమిక విద్య సూర్యాపేటలోనూ, హైస్కూలు చదువు వరంగల్‌లోనూ సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరింనబడంతో జబల్పూరు వెళ్ళి అక్కడ బి.ఎ. డిగ్రీ పూర్తి చేసుకున్నారు. అక్కడే జాతీయోద్యమంతోనూ కమ్యూనిస్టు సాహిత్యంతోనూ పరిచయం ఏర్పడింది.

 
స్వగ్రామం వచ్చిన దేవులపల్లి 1939లో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అప్పటికే నిజాం పాలనలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉంది. హైదరాబాద్‌లో ‘కామ్రేడ్స్‌ అసోసియేషన్‌’ నిర్మాతల్లో డి.వి. ప్రథములు. ఉద్యమం సాయుధ పోరాట రూపం తీసుకున్న కాలంలో అంటే 1941-51 దశాబ్దంలో కీలకమైన నల్గొండ జిల్లా పార్టీ బాధ్యతలు చేపట్టి యూనియన్‌ సైన్యాలపై కొనసాగిన పోరాటానికి కూడా నాయకత్వం వహించి పోరాట విరమణ వాదాన్ని వ్యతిరేకించాడు. తెలంగాణ పోరాట చరిత్రను ఆయన సవివరంగా గ్రంథస్థం చేసినా అందులో మొదటి భాగమే అందుబాటులోకి వచ్చింది. ‘జనగామ ప్రజల వీరోచిత పోరాటం’. ‘హైదరాబాద్‌ కౌల్దారీ చట్టం’ అనే పుస్తకాలు రాశారు. పోరాట విరమణ తర్వాత కాలంలో 1957లో నల్గొండ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయారు. ఆయన మొత్తం పొలాన్ని కౌలుదారులకే ఇచ్చేశాడు. 1962లోనూ, 1964లోనూ డిటెన్యూగా, 1970లో నాగిరెడ్డి కుట్రకేసులో ముద్దాయిగానూ జైలు జీవితం గడిపారు. కుట్ర కేసులో నాలుగు సంవత్సరాలు కారాగార శిక్ష విధించగా బెయిల్‌పై విడుదలయ్యారు.
 
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఎనిమిది సంవత్సరాలు, నక్సల్‌బరి పోరాటకాలంలో 9 సంవత్సరాలు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యునిగా, సీపీయం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ విప్లవ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, అనంతరకాలంలో ‘భారత విప్లవకారుల సమైక్యతా కేంద్రం’ కేంద్ర కమిటీ కార్యదర్శిగా, ప్రొలిటేరియన్‌ పాత్‌, సంకేతం, జనశక్తి పత్రికల ద్వారా దేశంలో కమ్యూనిస్టు విప్లవకారుల్లో పొడ చూపిన అతివాద, మితవాద పెడధోరణులకు వ్యతిరేకంగా తరిమెల నాగిరెడ్డితో కల్సి ఆయన చేసిన పోరాటం అద్వితీయం. ఈ సిద్ధాంత పోరాటంలో వారి జోడి అపూర్వం.
 
1984 జూలై 12వ తేదీ అకస్మాత్తుగా గుండెపోటుతో దేవులపల్లి వెంకటేశ్వరరావు చనిపోయారు. బారత విప్లవోద్యమ యవనికపై ఒక ధ్రువతార రాలిపోయింది.
 
- చెరుకూరి సత్యనారాయణ
(నేడు దేవులపల్లి వెంకటేశ్వరరావు వర్ధంతి)