Jul 5 2015 @ 11:35AM

మూడోవారంలోకి అడుగుపెట్టిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'!

విడుదలైన తొలిరోజునే ఫిల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకున్న 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రానికి కలెక్షన్ల పరంగాను చక్కని స్పందన లభిస్తోంది. రెండోవారంలో మరిన్ని థియేటర్లను పెంచామని, సినిమా మూడోవారంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 'బి' క్లాస్ సెంటర్స్ లోనూ శుక్రవారం విడుదల చేశామని లగడపాటి శ్రీధర్ చెప్పారు. యువతరంతో పాటు మహిళా ప్రేక్షకులూ ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారని శిరీషా శ్రీధర్ తెలిపారు.'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనలో లగడపాటి శ్రీధర్ ఇప్పటికే ఉన్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా రీమేక్ రైట్స్ కోసం ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ సినిమాను తమిళ, మలయాళ భాషల్లోనూ అనువదించే పనిలో పడ్డారు లగడపాటి శ్రీధర్. ఇటీవలే ఈ రెండు వర్షన్స్ డబ్బింగ్ పనులను మొదలుపెట్టామని, అతి త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల్లోనూ సినిమాను విడుదల చేస్తామని శ్రీధర్ తెలిపారు. ఇప్పటికే కన్నడ, తెలుగు ప్రాంతాల్లో చక్కని ఆదరణ పొందిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' మరి కోలీవుడ్, మల్లూవుడ్ లో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూద్దాం.