Jul 2 2015 @ 20:29PM

‘తానా’ మొదలైంది ఇలా...

అమెరికాలో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసుకున్న తొలి సంస్థ తానా. 40 ఏళ్ల వయసున్న ఈ సంస్థ 20వ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో- సమావేశాలకు సంబంధించిన వివరాలతో- ప్రముఖ రచయిత నరిసెట్టి ఇన్నయ్య- తానా సజీవ చరిత్ర అనే పుస్తకాన్ని రచించారు. దానిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

  • 1977 లో అమెరరికాలోని తెలుగు వారితో సంఘస్థాపన ఆలోచన చేసిన ఆద్యుడు డాక్టర్‌ గుత్తికొండ రవీంద్రనాథ్‌. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో ఇండియా క్లబ్‌ కార్యనిర్వాహక వర్గ సభ్యుడిగా గుత్తికొండ రవీంద్రనాథ్‌ పలు పదవుల్లో పనిచేశారు. 1976 జూలై 4న అమెరికా ద్విశత వార్షికోత్సవ వేడుకల్లో తెలుగు దేశభక్తి గేయాలతో ఒక కార్యక్రమాన్ని కొలంబియా యూనివర్సిటీ రేడియో ప్రసారం చేసింది. దీనిలో చురుకుగా పాల్గొన్న రవీంద్రనాధ్‌కు- మన తెలుగు సంస్కృతికి కూడా అమెరికాలో గుర్తింపు వస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. ఆయన ఆలోచనకు మద్దతు పలికిన డాక్టర్‌ కాకర్ల సుబ్బరావు సంఘస్థాపనకు దారితీశారు.
  • డాక్టర్‌ మాధవరావు తుమ్మల 1977 డిసెంబర్‌లో డెట్రాయిట్‌లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో తాము ఏర్పాటు చేసుకున్న తెలుగు సంస్థకు ‘ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ అనే పేరు పెట్టాలని నిర్ణయించారు. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న వివిధ తెలుగు సంఘాలకు ఒక సమాఖ్యగా కూడా ఆ సంస్థను రూపొందించాలని నిర్ణయించారు. న్యూయార్క్‌ తొలి తెలుగు సభల అనంతరం రెండవ మహాసభ నాటికి తానా నామకరణం స్థిరపడింది.
  • న్యూయార్క్‌లో తొలి ‘తానా మహాసభ’ జరిగినప్పుడు పాల్గొన్న తెలుగు వారి సంఖ్య పరిమితంగా ఉన్నా అత్యంత ఉత్సాహభరితంగా కార్యక్రమాలు జరిగాయి. ఆ సభల ప్రత్యేకతను చాటే రీతిలో తొలి ప్రత్యేక సంచిక వెలువరించారు. కాకతీయ సంస్కృతీ సంప్రదాయాలని ప్రజ్వలింపచేస్తూ వరంగల్లు కోట ముఖద్వారం, దాని మధ్యలో తెలుగు జాతి గౌరవాన్ని, సంప్రదాయాన్ని విశ్వజనీనం చేసేలా కలశం, నాలుగు వైపులా పువ్వుల వరుసతో కూడిన ప్రత్యేక సంచిక మొదటి పేజీ అందరిని ఆకర్షించింది.
  •  రెండవ తానా మహాసభల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆనందింపచేశాయి. ముఖ్యంగా ప్రముఖ హరికథా కళాకారుడు వీరగంధం వెంకట సుబ్బారావు ప్రదర్శించిన హరికథ ఆహుతులను ఎంతో రంజింపచేసింది. ఆయన తన స్వంత ఖర్చులతో తానా వచ్చారని తెలిసిన ప్రేక్షకులు అక్కడికక్కడే నిధులు సేకరించి ఆయనకు ఇచ్చారు. నిజానికి కవి దాశరథికి తప్ప మహాసభలకోసం రాష్ట్రం నుంచి వచ్చిన వారెవరికీ ‘తానా’ ప్రయాణ ఖర్చులు భరించలేదు. తర్వాత జరిగిన మూడు, నాలుగు, అయిదవ మహాసభల్లో కూడా ఇదే విధమైన విధానాన్ని అనుసరించారు. ఈ సభలకు దాదాపు రెండు వేల మంది హాజరయ్యారు. సభల నిర్వహణకు ఏడు వేల డాలర్లు ఖర్చయ్యాయి. ఈ మహాసభల కోసం తెలుగు పలుకు అనే ప్రత్యేక సంచికను ఆంధ్రజ్యోతి అప్పటి అధినేత కె.ఎల్‌.ఎన్‌.ప్రసాద్‌ తమ ప్రెస్‌లో ముద్రించి అందించారు. 
  • మాడవ ‘తానా’ మహాసభల నుంచి ప్రముఖులకు తానా అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. మొదటి తానా అవార్డును ప్రముఖ గణాంక శాస్త్రవేత్త, ప్రపంచంలోని పదిమంది గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరైన ప్రొఫెసర్‌ సి.ఆర్‌.రావుకు ప్రదానం చేశారు. 
  • ఏడవ తానా మహాసభలో ప్రప్రథమంగా తానాకు రూపొందించిన లోగోను అధికారికంగా సమావేశంలో ఆమోదించారు.
  • పద్నాలుగవ తానా మహాసభల్లో ముత్యాల పద్మశ్రీని అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం తానా చరిత్రలో గొప్ప మలుపు. స్ర్తీ పురుషుల సమానత్వాన్ని మాటలలో కాక ఆచరణలో చూపెట్టింది. అమెరికాలోని భారతీయ భాషా సంఘాలలో ఇలాంటి ఘనత తొలిసారి తానాకే దక్కింది.

ఇది ప్రాంతీయోన్మాదుల సభకాదు. భాషోన్మాదుల సభ అంతకన్నా కాదు. మనమంతా ఆత్మస్తుతికి సమావేశమైన జనం కాదు. దేశానికి దూరంగా ఉన్నా మన భాషకు, ఆచార వ్యవహారాలకు దూరం కాలేదని, కాలేమని మనం వెల్లడి చేసుకోవడానికీ మన సాధక బాధకాలను చర్చించుకోవడానికి మాత్రమే ఇక్కడ సమావేశమయ్యాం.
 వెలువోలు బసవయ్య (టొరంటొ)