Jun 21 2015 @ 11:16AM

పరుచూరి వెంకటేశ్వరరావు బర్త్ డే

తెరపై పరుచూరి బ్రదర్స్ పేరు చూడగానే ఆనందంతో ఈలలు వేసే ప్రేక్షకులెందరో ఉన్నారు... వారిద్దరే కానీ, ఒక్కటే మాటగా సాగి పలు చిత్రాలను విజయాల బాటలో పయనింప చేశారు... అగ్రజుడు వెంకటేశ్వరరావు సెంటిమెంట్ ను పండించడంలో దిట్ట అయితే, అనుజుడు గోపాలకృష్ణ ఎమోషన్ ను పెంచి, పంచ్ లు దంచడంలో మేటి!... మహానటుడు యన్టీఆర్ 1981లో ఈ సోదరులిద్దరికీ 'పరుచూరి బ్రదర్స్' అని నామకరణం చేసి, తన సొంత చిత్రం 'అనురాగదేవత' ద్వారా పరిచయం చేశారు... అంతకు ముందు పరుచూరి వెంకటేశ్వరరావు ఒక్కరే కొన్ని చిత్రాలకు సంభాషణలు రాశారు... సెలవు రోజుల్లో గోపాలకృష్ణ అన్నకు చేదోడు వాదోడుగా మాట పలికించేవారు... యన్టీఆర్ ఆశీస్సులతో 'పరుచూరి బ్రదర్స్'గా పేరొందిన ఈ సోదరులు వందలాది చిత్రాలకు రచన చేశారు... తమ మాటల తూటాలతోనూ, విరుపుల చరుపులతోనూ జనాన్ని ఆకట్టుకొని టాప్ హీరోస్ అందరికీ గ్రాండ్ సక్సెస్ అందించారు ఈ సోదరులు.

వందలాది చిత్రాలకు మాటలు రాసిన పరుచూరి సోదరులు, కొన్ని చిత్రాలకు దర్శకత్వం సైతం నెరపి శభాష్ అనిపించుకున్నారు... ఇద్దరూ నటనలోనూ రాణించారు... పరుచూరి వెంకటేశ్వరరావు పలు చిత్రాల్లో సెంటిమెంట్ ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి అలరించారు... ఈ నాటికీ ఈ అన్నదమ్ములు కలసి మెలసి రచనలు చేస్తూ ఉండడం విశేషం... చిరంజీవిని తమ 'ఖైదీ'తో స్టార్ హీరోగా మలచిన ఈ సోదరులు ఇప్పుడు ఆయన 150వ చిత్రానికీ రచన చేస్తున్నారట... పరుచూరి వెంకటేశ్వరరావు మరిన్ని వసంతాలు చూస్తూ, మరెంతగానో తమ రచనతో జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం...