Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Mon, 15 Jun 2015 02:13:56 IST

నేడే పూరీలో బ్రహ్మపరివర్తన వేడుక

నేడే పూరీలో బ్రహ్మపరివర్తన వేడుక

పూరీ, జూన్‌ 14: పూరీ జగన్నాథ క్షేత్రంలో సోమవారం రాత్రి అత్యంత పవిత్రమైన బ్రహ్మపరివర్తన వేడుక జరగనుంది. అంటే... ఆలయంలోని జగన్నాథుడి మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని.. కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవమిది. ఆ పదార్థమేమిటో ఎవరికీ తెలియదు. మనుషులెవ్వరూ ఆ పదార్థాన్ని ఇంతదాకా చూడనూలేదు. సాధారణంగా అధిక ఆషాఢమాసం వచ్చిన సంవత్సరంలో పూరీలో కొయ్యతో చేసిన మూలవిగ్రహాలను ఖననం చేసేసి, కొత్తగా ఎంపిక చేసిన చెట్ల దారువుతో మూలవిరాట్టులను తయారుచేసి ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకను నవకళేబర అంటారు. పాత విగ్రహాలను ఖననంచేసే ముందు.. ఆలయ పూజారి కళ్లకు గంతలు కట్టుకుని, చేతికి వస్త్రం చుట్టుకుని.. జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఇది అత్యంత రహస్యంగా జరగాల్సిన ప్రక్రియ కాబట్టి.. ఇప్పటికే గుడిలోని సీసీటీవీ కెమెరాలన్నింటినీ తొలగించారు. ఆ సమయంలో ఆలయంలోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ విద్యుత్‌ సరఫరా నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. బ్రహ్మపదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు. ఆ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఇది మంగళవారం జరుగుతుంది. ఈ కొత్త విగ్రహాలను దర్శించుకునేందుకు భక్తులను బుధవారంనుంచి అనుమతిస్తారు. నూతన దారుబ్రహ్మలు తొలిసారిగా భక్తులకు ఇచ్చే దర్శనాన్ని ‘నవయవ్వన దర్శన’గా వ్యవహరిస్తారు. కాగా.. అధిక ఆషాఢమాసం చివరిసారిగా 1996లో వచ్చింది. మళ్లీ 19 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది జరుగుతుండడంతో భక్తులు స్వామి దర్శనానికి పెద్ద ఎత్తున పూరీకి చేరుకుంటున్నారు.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.