Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 09 Jun 2015 01:58:48 IST

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నినాదానికి నూరేళ్లు

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర నినాదానికి నూరేళ్లు

ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని మొట్టమొదట 1914లో అంటే నూరు సంవత్సరాల క్రితం నినదించారు. 1953లో ఆ కల ఫలించింది. మరో మూడేళ్లలో తెలుగు భాష మాట్లాడే ఆంధ్ర, తెలంగాణ ప్రజలు విశాలాంధ్ర ఏర్పాటు చేసుకొన్నారు. కొత్త రాష్ర్టానికి విశాలాంధ్ర అని పేరు పెడితే, ఆ నినాదాన్ని మొట్టమొదట ఇచ్చిన కమ్యూనిస్టులకు క్రెడిట్‌ వస్తుందేమోనని కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ అనే నామకరణం చేయటంతో దేశంలో మొదటిసారిగా భాషాప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు నాందీ ప్రస్తావన జరిగింది. అలా తెలుగు ప్రజలనందరినీ ఏకం చేసినదీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే. 2014లో వారిని నిట్టనిలువునా చీల్చిందీ ఆ కాంగ్రెస్‌ నాయకత్వమే. తేడా ఏమిటంటే 1953లో ఆంధ్రులు పోరాడి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో ఉద్యమం పరాకాష్టకు చేరడంతో నెహ్రూ దిగివచ్చి ప్రత్యేక రాష్ర్టాన్ని ప్రకటించాల్సి వచ్చింది. అయితే, ఈ ఉద్యమం నల్లేరు మీద బండిలా సాగిపోలేదు. రాష్ట్రం ఏర్పడితే రాయలసీమకు అన్యాయం జరుగుతుందంటూ నీలం సంజీవరెడ్డి ప్రభుృతులు మొదట మోకాలొడ్డినా, తర్వాత సర్కారు జిల్లాల కాంగ్రెస్‌ నాయకుల హామీతో, తమ వ్యతిరేకతను ఉపసంహరించుకున్నారు. అపుడు జరిగిన ఒడంబడికనే శ్రీబాగ్‌ ఒడంబడిక అంటారు. విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నీటిపారుదల సదుపాయాలు, శాసనసభ సభ్యత్వం ఈ ఒడంబడికలో ప్రధానాంశాలు. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సమావేశాలు నూతన రాష్ర్టానికి రాజధాని అయిన కర్నూలులో శ్రీ టంగుటూరి ప్రకాశం నేతృత్వంలో ఏర్పాటయింది. అపుడు కూడా విజయవాడ-కర్నూలు మధ్య వివాదం జరిగినా, రాయలసీమ నాయకులు ప్రథమంగా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన విషయాన్ని గమనంలో వుంచుకొని కర్నూలునే రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేశారు. నేను ఆ శాసనసభ సమావేశాలకు ‘విశాలాంధ్ర’ విలేకరిగా వుండటం జరిగింది. సభాభవనం అంటే ఇప్పటిలా రాజభవనం కాదు; ఒక పొడుగాటి హాలు (లైట్లు లేకపోతే చీకటి గొయ్యారం); దానిలో అంతే పొడవైన బల్ల, ఇరువైపులా కుర్చీలు, ఆ బల్ల వెడల్పు ఎంత చిన్నదంటే, ఇరుపక్కల వున్నవారు షేక్‌ హాండ్‌ ఇచ్చుకోనూవచ్చు, చేతులతో ముష్టియుద్ధమూ చేయవచ్చు. అగ్రభాగాన ఒక పక్క కాంగ్రెస్‌ నాయకుడు నీలం సంజీవరెడ్డి, ప్రతిపక్షంలో అదే స్థానంలో కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి. వారిద్దరి మధ్యా మాటల యుద్ధం జరిగినపుడు అయినా ఇవాళ చట్టసభల్లో ముష్టియుద్ధాలు, మైకులు విరిచేయటం, కుర్చీలు విసురుకోవటం లేదు.
 
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి వెనుకబడిన రాయలసీమ నాయకులు ఎటువంటి భయాలు వెలిబుచ్చారో, ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు సందర్భంలో కూడా తెలంగాణ ప్రాంత నాయకత్వానికి కొన్ని రిజర్వేషన్లు వుండటం అసహజం కాదు. అసలీ వెనుకబాటుతనం అనే మాటకు అర్థం చెప్పడానికి సామన్యులకు కొలబద్దలేమీ లేవు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే వర్ధమాన దేశాలు, ఒకే దేశంలో, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలు, అభివృద్ధి చెందిన జిల్లాల్లో వెనుకబడిన మండలాలు, ధనికులతో పోలిస్తే పేదలు, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలతో పోలిస్తే ఆదిలాబాద్‌ వెనుకబడి లేదూ? ఏమైనా ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే, నిజాం పాలించిన తెలంగాణ వెనుకబాటుతనంలో కూరుకుపోయింది. (అటువంటి దుష్టుడికి ముఖ్యమంత్రి కితాబులివ్వటం దురదృష్టం). కోస్తా ఆంధ్ర పాలకులు కూడా ఈ వెనుకబాటు తనాన్ని గుర్తించి, ఆ ప్రాంత నాయకులతో చర్చలు జరిపి ఒక ఒడంబడిక- (దీనినే ‘పెద్ద మనుషుల ఒప్పందం’ అంటారు) మీద సంతకాలు చేశారు. ఇక్కడ ఈ వేర్పాటు ఉద్యమాల గురించి, అవి ఆంధ్ర-తెలంగాణల మధ్యనే కాక దేశవ్యాపితంగా ఆ కాలంలో జరిగిన ఉద్యమాలు, ఆందోళనల గురించి తెలుసుకొందాం. ఐటీ ప్రవేశంతో ప్రపంచమంతా చిన్న గ్రామమైపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో ‘మేం విడిపోతాం, మా దుకాణం వేరే పెట్టుకొంటాం’ అనే వారి గురించి ఏమనుకోవాలి? పంజాబు రాష్ర్టాన్ని పంజాబ్‌, హర్యానా రాష్ర్టాలుగా విభజించారు. ఆంధ్ర రాష్ట్రమే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయింది. వేర్పాటు వాదానికి ఇంత పూర్వ చరిత్ర వుంటే, తెలంగాణ విడిపోతానంటే అభ్యంతరం ఎందుకు అనేది ఒక వాదన. 1969లో, 1973లో, మళ్లీ ఇపుడెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏకం కావడానికి, విడిపోవడానికి ఫలానా సిద్ధాంత ప్రాతిపదిక పైన జరిగిందని చెప్పడానికి వీలులేదు; ఒకే కారణమని చెప్పడానికీ వీలులేదు. భాషా సమస్య మీద పంజాబును విడదీస్తే, ఒకే భాష మాట్లాడుతున్నా ఆంధ్ర, తెలంగాణలు విడిపోయాయి. బీహార్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలు ఒకే భాష మాట్లాడుతున్నా విడిపోవడానికి రాజకీయాలు కారణం. ఉత్తరప్రదేశ్‌ను రెండు నుంచి నాలుగు రాష్ర్టాలుగా విభజించాలంటున్నారంటే అంత పెద్ద రాష్ర్టాన్ని పాలించటంలో వున్న సమస్యలు, రాజకీయాలు కారణం. ఈశాన్య రాష్ర్టాలు దేశం నుంచి విడిపోవాలని అంటున్నారంటే వాటికి సరిహద్దున ఉన్న ఇతర దేశాలతో సాంస్కృతిక కారణాలున్నాయి. ఒకే భాష, సంస్కృతి, సాంప్రదాయం వున్నా ప్రజలను రాజకీయ ప్రయోజనాల కోసం విడదీయటం హృదయం లేని వారు చేసే పని. కానీ నిజంగా తెలంగాణ ప్రాంతాన్ని నిజాం చెరనుంచి విముక్తి చేసింది సంగం (ఆంధ్ర మహాసభ); కమ్యూనిస్టు ఆధ్వర్యంలో జరిపిన తెలంగాణ ప్రజల సాయుధ విముక్తి పోరాటం. ప్రపంచ సాయుధ పోరాటాల్లో చోటు చేసుకొంది. సువర్ణాక్షరాలతో లిఖించిన తెలంగాణ సాయుధ పోరాటమెక్కడ? ఈ రోజున కొందరు తెల్లచొక్కాల వాళ్లు, విద్యాధికులు, రాజకీయ రాబందులు ప్రత్యేక తెలంగాణను సమర్థిస్తూ వచ్చినా, తెలంగాణ చంద్రుడి పాలన మీద పెదవి విరుస్తున్నారు.
 
ఆ తర్వాత విశాలాంధ్ర వాదాన్ని సమర్థించిన బూర్గుల రామకృష్ణరావు ప్రభుత్వంలో సభ్యులైన కొండా వెంకట రెడ్డి చెన్నారెడ్డి ద్వయం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అనే రొట్టెముక్క విసిరేసరికి, అది దొరకపుచ్చుకొని ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఏడు నిలువుల లోతున పాతేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా అధికారం చలాయించడానికి ఆయనకు అభ్యంతరం లేకపోయింది. ఆయనే కాదు, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ముఖ్యమంత్రులెవ్వరూ ప్రత్యేక తెలంగాణ ఊసైనా ఎత్తలేదు. తెలంగాణ చంద్రుడికి కూడా ఆయన కోరిన మంత్రి పదవి ఇచ్చివుంటే, ఈ విభజన జరిగేది కాదేమో. రాజకీయ పదవీ లాలస ఎంత వారినైనా ఏమైనా చేయిస్తుంది. ప్రస్తుత ప్రధాని మోదీ కూడా ఈ కోవలోని వారే. బీజేపీ ప్రభుత్వం అనే మాట ఒక్కసారైనా ఆయన నోటి వెంట వచ్చిందా? అటు ఆంధ్రప్రదేశ్‌ చంద్రుడు 2030 నాటికి రాష్ర్టాన్ని స్వర్ణధామంగా మార్చేస్తానంటున్నారు. ఇదివరలో ఆయన అధికారంలో వున్నపుడు కూడా జ్యోతిబసులా తాను 30 సంవత్సరాలు పరిపాలిస్తానని చిత్తుగా ఓడిపోయారు.
 
తెలంగాణ ఉద్యమానికి ఇంత వూపు వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్‌ పార్టీయే. 1967 జనరల్‌ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ఒక ‘ఘనకార్యాన్ని’ చేబట్టి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారకులయ్యారు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు ఎన్నికలు జరిపే సందర్భంలో తెలంగాణ జిల్లాల్లో నాయకులకు వారి జీవితంలో మొదటిసారిగా అధికార పీఠాలు లభించాయి. ఆ తర్వాత 1968-69లో ఎన్నికలు జరిగినపుడు అధికారం రుచి చూచిన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు శాసనసభలో ప్రవేశించాలని టిక్కెట్ల కోసం కొంతమంది విఫలురై ఇండిపెండెంట్లుగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించారు. ముఖ్యమంత్రికి కోపం వచ్చి వీళ్ల ‘రోగం’ కుదర్చాలని, అపుడు రాష్ట్ర ముఖ్యకార్యదర్శిగా వున్న ఎం.టి. రాజుతో కలిసి జిల్లా పరిషత్తులనే రద్దు చేసి పరిషత్‌ అధ్యక్షుణ్ణి నామమాత్రుణ్ణి చేసి, అధికారం అంతా కలెక్టర్లకు అప్పగించారు. ఇది తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. నోటి దగ్గర కూడు లాగేసినట్లయింది. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి ఈ అసంతృప్తినే అవకాశంగా తీసుకొని ‘తెలంగాణ ప్రజా సమితి’ని ఏర్పాటు చేసి, జిల్లాల్లోని అసం తృప్తిని ఎగదోసి హైదరాబాద్‌ నగరంలో మంటలు లేపారు. హింస చెలరేగింది. ఆంధ్ర ప్రజల మీద దాడులు జరిగాయి. గోడల మీద ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బూతులు రాశారు. కమ్యూనిస్టులను హింసా వాదులనే కాంగ్రెస్‌ వారే హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. నూరు మంది బలయ్యారు. 1973లో ప్రత్యేకాంధ్ర ఉద్యమం మరొక దురదృష్ట పరిణామం. సరిగ్గా ఇదే సమయంలో కేంద్రంలో ఇందిరాగాంధీ మీద కాంగ్రెస్‌లోని మితవాదులు తిరుగుబాటు జండా ఎగురవేశారు. ఈ మంటలార్పాలంటే ముందు చిన్న చిన్న మంటలార్పాలి కదా. శ్రీమతి గాంధీ ఆరు సూత్రాల పథకాన్ని రచించి ఈ మంటలార్పింది.
 
ఆంధ్ర ప్రాంతంతో పోల్చి చూస్తే తెలంగాణ వెనుకబడిన ప్రాంతమే. గ్రామీణ ప్రాంతమంతా జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల చేతుల్లో వుండేది. వీరుగ్రామాలను కొల్లగొట్టి, నైజాం నవాబుకు చేరవేసేవారు. ‘నీ బాంచను దొరా’ అనే మాట పేదల నోటి వెంట రావటం సర్వసాధారణం. కాగా వెనుకబాటుతనానికి నైజం పాలనే కారణం. అటువంటి వెనుకబాటు తనాన్నుంచి కొన్ని రక్షణలు కోరటం సహజం. ఉభయ ప్రాంత కాంగ్రెస్‌ నాయకుల సమావేశంలో ‘పెద్ద మనుషుల ఒప్పందం’ మీద సంతకాలు చేశారు. 1956 ఫిబ్రవరి 20న కుదిరిన ఈ ఒప్పందంపై ఆంధ్ర నుండి బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు కాగా, తెలంగాణ వైపు నుంచి బూర్గుల రామకృష్ణరావు, కె.వి. రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి. నరసింగరావు ప్రభుృతులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలో తెలంగాణకు ఎన్నో రక్షణలు కల్పించబడ్డాయి; వీటిలో ముఖ్యమైనవి; తెలంగాణకు సంబంధించిన మిగులు ఆదాయాన్ని తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేయాలి. రాష్ట్రంలో మొత్తం మీద విద్యాసంస్థల్లో మూడింట ఒకవంతు స్థానాలు తెలంగాణకు లభింపచేయాలి. ఉత్తరోత్తరా జరిగే నియామకాలు జనాభా బట్టి చేయాలి; ‘ముల్కీ’ నిబంధనలు అమలు చేయాలి. తెలంగాణ ప్రాంత అభివృద్ధికై ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి. ఈ మండలి 20 మంది సభ్యులతో కూడి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలి. ప్రణాళికాభివృద్ధి, సేద్యపు నీటిపారుదల, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ నియమాకాలు పరిశీలించి నిర్ణయాలు చేస్తుంది. ప్రాంతీయ మండలికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విబేధాలు వస్తే కేంద్రానికి నివేదించాలి. ఈ విధంగా తెలంగాణ ప్రాంతీయ మండలి మరో ప్రభుత్వంగా విశేషాధికారాలతో మలచబడింది. ఈ నిర్ణయాలు తెలంగాణకు న్యాయం చేకూర్చినా, దానికి కాలపరిమితి ఉండాలని, లేనిచో అధికార దుర్వినియోగానికి తావిస్తుందని కొంతమంది భావించారు. ఆచరణలో రాజకీయ ఎత్తుగడలకు ఇచ్చిన ప్రాముఖ్యం ఉభయ ప్రాంతాల మధ్య సమైక్యతా భావం పెంపొందించేటందుకివ్వలేదు. ఈ ఒప్పందాన్ని కాంగ్రెస్‌ నాయకులు, ముఖ్యమంత్రులు నిష్టగా అమలుపరిచి వుంటే, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలెత్తి వుండేది కాదు. పోనీ, తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రులైనా ప్రయత్నించారా అంటే అదీ లేదు. 1973లో వేర్పాటు ఉద్యమాలు చల్లారాయి. ఈ పదవుల వేటులో భాగంగానే తెలంగాణ చంద్రుడు మంత్రి పదవినాసించి, వైఫల్యం చెందటంతో, ప్రత్యేక తెలంగాణ జెండా నెగురవేశారు. గత సంవత్సరం జరిగిన జనరల్‌ ఎన్నికల్లో సోనియాగాంధీ రచించిన పథకం బెడిసికొట్టింది. కాంగ్రెస్‌ ఊడ్చిపెట్టుకపోయింది.
 
రాష్ర్టాలు చిన్నవైతే, వారి ఆర్థిక వనరులు కూడా అంతంత మాత్రంగానే వుంటాయి. నిధుల కోసం కేంద్రం వైపు చూడటం, దీన్ని అవకాశంగా తీసుకొని రాష్ర్టాల భవిష్యత్తుతో ఆడుకోవటం కేంద్రం చేస్తూ వచ్చింది, వస్తూంది కూడా. దీనిని తెరాస నాయకత్వం గ్రహించాలి. కేంద్రం మీద ఆ నాయకత్వం తిరుగుబాటు జండా ఎగురవేస్తే నష్టపోయేది తెలంగాణయే. ఆంధ్రప్రదేశ్‌ చంద్రుడు ఎలాంటి వారైనా ఉభయులు కలిసి సమస్యలను పరిష్కరించుకొందామని అనటం ఉభయ ప్రాంతాలకు లాభకరం. ఈ వైపుగా తెలంగాణ ప్రజలు ఉద్యమించాలి.
 
-  వి. హనుమంతరావు
సీనియర్‌ పాత్రికేయులు

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.