
బుల్లితెరపై సరదాగా మాట్లాడే ఈ అమ్మాయి.. గజ్జెకడితే నాట్యమయూరి. చదువుల రికార్డు తిరగేస్తే.. ఇప్పటికే రెండు పీజీలు పూర్తి చేసింది. మరో మూడు చేస్తే గానీ తృప్తి లేదంటోంది. యాంకరింగ్ అంటే గలగలా మాట్లాడటమే కాదు.. కాసింత విషయమూ ఉండాలి అంటోన్న సుజాతను‘నవ్య’ పలకరించింది.
‘‘నేనెప్పుడూ యాంకర్ని అవుతానని అనుకోలేదు. కళలపై ఉన్న అభిరుచే నన్ను బుల్లితెరకు పరిచయం చేసిందేమో..! యాంకరింగ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ విషయానికొస్తే, మెదక్ జిల్లా సంగారెడ్డిలో పుట్టాను. మా నాన్న రామస్వామి, హిందూస్థానీ ఓకల్ టీచర్, అమ్మ లక్ష్మీ గృహిణి. నాకు ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్కయ్య. నేనే చిన్నదాన్ని కావటంతో అందరూ గారాబంగా పెంచారు. మా వారి పేరు శ్రీధర్ దీక్షిత్ . నా కొడుకు పేరు శ్రీశ్రీ. మా మామయ్య డి.ఎ్‌స.దీక్షిత్.. నటుడు, యాక్టింగ్ అధ్యాపకులు.
కరాటే క్వీన్..
స్కూల్ డేస్ నుంచే నేను చురుగ్గా ఉండేదాన్ని. మ్యూజిక్ మాస్టారి కూతుర్నయినా.. నేను సంగీతం నేర్చుకోలేదు. అడపాదడపా పాటలు పాడుతాననుకోండి. కరాటే కూడా వచ్చు. నాలుగేళ్ల వయసు నుంచి కూచిపూడి నేర్చుకున్నా. పదో తరగతి నుంచి చదువులపై ధ్యాస పెరిగింది. బి.కామ్ బ్యాక్‌గ్రౌండ్ అయిన నేను డ్యాన్స్‌లోనూ, జర్మలిజంలోనూ పీజీలు చేశాను. ‘మెదక్ జిల్లా సీ్త్రల జానపద కళారూపాలు’ సబ్జెక్ట్‌పై ఎం.ఫిల్ చేశాను. మెదక్ జిల్లా సంస్కృతిపై పీహెచ్డీ చేయాలని అనుకుంటున్నా. ఐదు పీజీలు చేయడం నా లక్ష్యం.
అలా బుల్లితెర పైకి..
చిన్నప్పటి నుంచి స్టేజ్‌పై పెర్ఫార్మెన్స్లు చేసిన నాకు స్టేజ్‌పై బెరుకులేదు. చిన్నప్పుడు ‘హమేషా తమాషా’లో డ్యాన్స్ చేశాను. సెంట్రల్ యూనివర్శిటీలో పీజీ చేసేటప్పుడు స్టేజ్‌పై ట్రెడిషనల్ క్యాస్టూమ్ వేసుకుని ఓ పాట పాడాను. అది చూసి ఓ చానెల్ వాళ్లు యాంకరింగ్ చేయమని అడిగారు. ప్రాంప్టర్‌లో చూసి ‘జస్ట్ ఫర్ యు’ కార్యక్రమం కోసం విషెష్ చదవమన్నారు. చదివాను. రెండు రోజుల తర్వాత ‘మీరు యాంకరింగ్ చేసిన ప్రోగ్రామ్ రేపు టెలికాస్ట్ అవుతుంది’ అంటూ చానల్ వాళ్లు కాల్ చేశారు. ఆ క్షణంలో నా ఆనందానికి హద్దుల్లేవు.
అబ్బాయికి మహాకవి పేరు..
దీక్షిత్‌గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకోవటానికి వెళ్లాను. అయితే వారి అబ్బాయి శ్రీధర్ని పెళ్లి చేసుకోవటంతో ఆ ఇంటికి కోడలినయ్యాను. రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నాం. పెద్దలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మా ఆయన దర్శకత్వ శాఖలో వర్క్ చేస్తున్నారు. ఓ సినిమా డైరెక్ట్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. మా మామయ్య గారికి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం. అందుకే మా అబ్బాయికి ఆ మహాకవి పేరు పెట్టారు.
కమల్ కాంప్లిమెంట్స్..
యాక్టింగ్ కంటే యాంకరింగ్ టఫ్ జాబ్. ఇదో విలక్షణమైన కళ. అయితే నాట్యకళలో రాణించిన నాకు యాంకరింగ్ చేయటం సులువుగా అబ్బింది. పైగా జ్ఞాపకశక్తి కూడా తోడవ్వటంతో ఈ ఫీల్డ్‌లో నిలదొక్కుకోగలిగాను. ప్రేక్షకులకు, చానల్‌కు వారధి యాంకర్. ‘మీ ఇంటి వంట’తో ఇంటింటికీ పరిచయమయ్యా. ‘సఖి’, ‘తెలుగు వెలుగు’, ‘లక్కీ లేడీ లవ్లీ శారీ’, ‘బొమ్మాళీ బాక్సాఫీస్’ ప్రోగ్రామ్స్‌తో ఫేమస్ అయ్యాను. ఏకంగా నా పేరుపై ‘సుజాత నటించిన సినిమా పోస్టర్’ అనే కార్యక్రమం ఓ చానల్ రూపొందించటం వల్ల నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నుంచి సెలబ్రిటీల ఇంటర్వ్యూల వరకూ అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేశాను. కమల్‌హాసన్ గారిని ఇంటర్వ్యూ చేయటం, ఆయన నుంచి కాంప్లిమెంట్స్ అందుకున్న క్షణాన ఈ జన్మకు ఇది చాలు అనుకున్నా.
నాట్యమంటే ప్రాణం..
డ్యాన్స్ చేయటాన్ని ఆస్వాదిస్తాను. నాట్యంతో ఏకాగ్రత, ఫిట్నెస్, క్రమశిక్షణ అలవడ్డాయి. డ్యాన్స్‌తో ఎంతో మానసిక ఆనందం పొందుతాను. రవీంద్రభారతిలో అనేకసార్లు నాట్యప్రదర్శనలిచ్చాను. ఇతర రాషా్ట్రల్లోనూ ప్రదర్శనలిచ్చాను. యూత్ కాంపిటీషన్స్‌లో జాతీయ స్థాయిలో రాణించాను. బోలెడన్ని అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం నేనీ స్థాయిలో ఉన్నానంటే అంతా నాట్యకళ వల్లే. అన్నట్లు ప్రస్తుతం కూచిపూడి నేర్పించే టీచర్ని.. కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థిని కూడా.
యాంకరింగ్‌లో రికార్డ్
పలు చానల్స్ తరఫున యాంకర్‌గా ఏడుసార్లు అవార్డులు అందుకున్నా. డీడీలో ‘ఆలాపన’ అనే కార్యక్రమం డైలీ ప్రసారమైంది. ఓ ప్రభుత్వ చానెల్లో ఇలా జరగటం అరుదు. 340 ఎపిసోడ్స్ చేశాక యాంకర్‌గా నాకు మిరాకిల్స్ ‘వరల్డ్ రికార్డ్’ వచ్చింది. ఇదే గొప్ప అచీవ్మెంట్. మరో విశేషమేంటంటే, డీడీలో యాంకర్‌గా పనిచేయటం వల్ల అరకులోని గిరిజనులు సైతం నన్ను గుర్తుపట్టారు. అంతకన్నా నాకు ఏం కావాలి?
బాపు గారి దర్శకత్వంలో ‘శ్రీ వేంకటేశ్వర వైభవం’ సీరియల్లో దేవకీ పాత్ర నాకు దక్కడం ఓ అదృష్టంగా భావించాను. ఇక సినిమాల విషయానికొస్తే ‘ఆపద మొక్కులవాడు’, ‘జన్మస్థానం’ చిత్రాల్లో నటించాను. డ్యాన్స్, యాంకర్‌గా బిజీగా మారడంతో సినిమాలు చేయలేకపోయాను. కోవై సరళలా మంచి కామెడీ రోల్స్ చేయాలని నా కోరిక..’’