May 28 2015 @ 13:01PM

‘కృష్ణార్జున’ చిత్రానికి బ్రేక్ ఎందుకు?

ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం’ చిత్రం 1963లో విడుదలైంది. అయితే దానికంటే రెండేళ్ల ముందే ‘కృష్ణార్జున’ పేరుతో ఒక సినిమా ప్రారంభమై కొంతకాలం షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయిన విషయం చాలా కొద్దిమందికే తెలుసు. ఆ ప్రయత్నం చేసింది దర్శక నిర్మాత కె.బి.తిలక్. 1960 ప్రారంభంలో ఎన్.టి.ఆర్. కృష్ణునిగా జగ్గయ్య అర్జునునిగా, దేవిక సుభద్రగా ‘కృష్ణార్జున’ చిత్రాన్ని ప్రారంభించారు తిలక్. అయితే ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. శ్రీ కృష్ణుని గెటప్‌లో షూటింగ్‌లో పాల్గొనలేదు. ఆరుద్ర రచయిత, పెండ్యాల సంగీత దర్శకుడు. రెహమాన్ ఛాయాగ్రాహకుడు. రెండు పాటలను రికార్డ్ చేశారు కూడా. ‘బారెడు పిడికెడు బారెడు పిల్ల...బలే మంచి పిల్ల’ అనే గీతాన్ని, ‘‘నీవూ నేనూ జాబిలి మువ్వురమూ వున్నాముగా’’ అనే యుగళ గీతాన్ని రికార్డ్ చేశారు. మొదటి పాట సుభద్రను వర్ణిస్తూ పాడే పాట. దీనిని హాస్యనటుడు రమణారెడ్డిపై చిత్రీకరించారు. ( ఈ సినిమా ఆగిపోయిన తర్వాత ఈ పాటలోని కొన్ని పదాలను ‘అమ్మకుట్టి అమ్మకుట్టి’ పాటలో ( పెళ్లిపుస్తకం, బాపురమణ) వాడారు. ఆరుద్ర అలాగే యుగళ గీతాన్ని జగ్గయ్య, దేవికపై చిత్రీకరించారు. దీనికోసం భారీ సెట్ ను వాహినీ స్టూడియోలో వేశారు. సరిగ్గా అదే తరుణంలో అంటే 1962 జూన్ 7న ‘గుండమ్మ కథ’ చిత్రం విడుదలైంది. ఆ సినిమా చూసిన తర్వాత అర్జునునిగా అక్కినేనిని ఎంపిక చేస్తే బాగుంటుందనే అభిప్రాయం తిలక్ కి కలిగింది. అర్జునుడు పాత్రధారి జగ్గయ్యతో ఒకపాట, కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినప్పటికీ ఆయన మళ్లీ వాటిని అక్కినేనితో చిత్రీకరించాలనే నిర్ణయానికి వచ్చారు. ముందు జగ్గయ్యకు ఈ విషయం చెప్పి, ఆయన బలరాముని పాత్రకు ఒప్పించారు. తర్వాత అక్కినేని దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పారు తిలక్. అయితే ఎన్.టి.ఆర్ పక్కన మైథాలజీ చేయడం కష్టమని చెప్పి తనని వదిలెయ్యమన్నారు అక్కినేని. ఆయనని ఒప్పించడానికి తిలక్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ‘కృష్ణార్జున’ చిత్రానికి తొలి బ్రేక్ అక్కడ పడింది. ఆ తర్వాత ఇతర ఇబ్బందులు ఎదురు కావడంతో మొత్తానికే ఈ చిత్ర నిర్మాణాన్ని ఆపేశారు తిలక్. ఆ తర్వాత ఎన్.టి.ఆర్., ఏ.ఎన్.ఆర్. కాంబినేషన్‌లో ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం’ చిత్రాన్ని రూపొందించారు కె.వి.రెడ్డి. ఎన్.టి.ఆర్. నటించే చిత్రంలో తను పౌరాణిక పాత్ర పోషించడానికి అక్కినేని మొదట సందేహించినా, తమ సొంత చిత్రం ‘దొంగరాముడు’కు కె.వి.దర్శకత్వం వహించారనే గౌరవభావంతో అర్జునునిగా నటించడానికి అంగీకరించారు.
 
సౌజన్యం: యుగానికి ఒక్కడు
రచన: యు.వినాయకరావు