Sep 2 2014 @ 02:56AM

పాత్రికేయ పితామహుడు నండూరి


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
పత్రికా రచనలో సరికొత్త ఒరవడిని సృష్టిం చిన పాత్రికేయ పితామహుడు నండూరి రామ్మోహనరావు. తన విలక్షణ రచనా శైలితో రెండో తరం పాత్రికేయుల్లో ప్రముఖునిగా నిలిచిన నండూరి పత్రికా సంపాదకుడే కాదు. సామాజిక, రాజకీయ వ్యాఖ్యతకూడా. అచ్చ తెలుగు నుడికారాలతో, చక్కనైన పదబంధాలతో, సరళంగా, ఆనందంగా చదువుకుంటూ, అన్ని వయసులవారూ ఆనందించేలా అనేక అనువాద రచనలతో అనువాద హనుమంతుడని బాపు - రమణలతో పిలిపించుకున్నారు. మార్క్‌ట్వేన్‌, టామ్‌సాయర్‌, హకల్‌ బెరిఫిన్‌, రాజు - పేద, విచిత్ర వ్యక్తి, కాంచన ద్వీపం వంటి అనువాద రచనలతో పిల్లల మనసులకు దగ్గరైన నండూరి, శాస్త్ర విజ్ఞానాన్ని అనేక గ్రంథాల ద్వారా ప్రజలకు చేరువ చేశారు. ఖగోళ, భౌతిక శాసా్త్రలను పరిశోధించి వివరించే ‘విశ్వరూపం’, మానవ పరిణామ క్రమాన్ని వివరించే ‘నరావతారం’, తత్వశాస్ర్తాన్ని సులువుగా వివరించే ‘విశ్వ దర్శనం’, రాజకీయ వ్యంగ్య రచన ‘సవ్యసాచి’, బాలగేయాల ‘హరివిల్లు’ఆయన కలంనుంచి జాలువారినవే.
1960 నుంచి ఆంధ్రజ్యోతిలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన నండూరి, సుదీర్ఘకాలం సంపాదకునిగా ఉన్నారు. 1994 నవంబర్‌లో ఆయన ఉద్యోగ విరమణ చేశారు. సామాన్యల ముంగిట సైన్సు సంగతులను ఉంచిన నండూరి అక్షర కృషీవలుడు.
నండూరి రామమోహనరావు కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అరుగొలను గ్రామంలో ఏప్రిల్‌ 24, 1927లో జన్మించారు. రాజమండ్రిలో ఆర్ట్స్‌ కళాశాలలో విద్యార్థిగా ఉంటూనే ‘విజ్ఞానం’ అనే లిఖిత పత్రికను నడిపారు. తన 21వ ఏటనే పాత్రికేయునిగా ప్రస్థానం ప్రారంభించారు. 1947లో ‘జన్మభూమి’ పత్రికలో ఉపసంపాదకుడిగా ఉద్యోగంలో చేరారు. 1948 నుంచి 1960 మధ్యలో వివిధ స్థాయిల్లో ‘ఆంధ్రపత్రిక’లో పనిచేశారు. 1960 నుంచి 1994 వరకు ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వివిధ స్థాయిల్లో పనిచేసి సంపాదకులుగా పదవీవిరమణ చేశారు. ఆ సమయంలోనే ‘జ్యోతిచిత్ర’, ‘వనితాజ్యోతి’, ‘బాలజ్యోతి’ పత్రికలకు వ్వవస్థాపక సంపాదకులుగా ఉన్నారు.
ఎంతోమందిని పాత్రికేయులను తీర్చిదిద్దారు. సూటిగా సరళంగా ఉండే ఆయన సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. తొలితరం సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావుతో కలసి పనిచేశారు. నార్లవారి నిష్క్రమణ అనంతరం 1980లో నండూరి ఆంధ్రజ్యోతి సంపాదకుడిగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టారు.
హేమాహేమీలతో అనుబంధం
నండూరికి ప్రముఖ పాత్రికేయులు, రచయితలతో సన్నిహిత సంబంధాలునాయి. కొడవగంటి కుటుంబరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, తెన్నేటి సూరి, పిలకా గణపతిశాసి్త్ర వంటి హేమాహేమీలతో సాహిత్య చర్చలు సాగించేవారు.సాహితీవేత్తలు ఆరుద్ర, శ్రీశ్రీ లతోపాటు, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు రామచంద్రమూర్తి, ప్రస్తుత సంపాదకులు కె.శ్రీనివాస్‌లతో అనుబంధం ఉంది.