May 2 2015 @ 09:17AM

నాటకరంగాన్ని బతికించాలి: స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు

రేపల్లె/ భట్టిప్రోలు, మే 1: సమాజంలో రుగ్మతలను, దోపిడీ వ్యవస్థను రూపుమాపే శక్తి నాటకరంగానికే వుందని, ఆ రంగాన్ని బతికించుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో నందమూరి తారక రామారావు కళా ప్రాంగణంలో నిర్మించిన ఆడిటోరియంను స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ప్రారంభించారు. పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్ట్‌ 25వ అఖిలభారత రజతోత్సవ నాటక పోటీలు శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్పీకర్‌ కోడెల మాట్లాడుతూ, కళాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో 25 ఏళ్లుగా పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు నిర్వహిస్తున్న పరుచూరి బ్రదర్స్‌ కృషి వెలకట్టలేనిదన్నారు. ప్రజల హృదయాలను హత్తుకుంటూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించేది నాటకరంగమేనన్నారు. కాకినాడజేఎన్‌టీయూకే వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వీఎస్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో కళారంగానికి జీవం పోయాల్సిన అవసరం వుందని, ఒకప్పుడు నాటకరంగంలో రాణించినవారే హీరోలుగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారన్నారు. తొలుత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు జ్యోతి ప్రజ్వలనతో నాటకోత్సవాలను ప్రారంభించారు. నాటకపోటీల్లో విజయవాడ వారిచే అనగనగా నాటిక, చిలకలూరిపేట వారిచే ఆకుపచ్చనిసూర్యుడు, ఒంగోలు వారిచే ప్రేమకు 18 ఏళ్లా..? నాటకాలను ప్రదర్శించారు.