desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Feb 1 2020 @ 01:32AM

గాలికుంటుకు టీకాలు

  • నేటి నుంచి మార్చి 6 వరకు..
  • జిల్లాలో సుమారు 2.97 లక్షల పశువులు
  • టీకాలు వేయడానికి 106 బృందాలు
సిద్దిపేట, జనవరి31: జిల్లాలో నేటి నుంచి పశువులకు గాలికుంటు టీకాలు వేయనున్నారు. వైరస్‌ ద్వారా పశువులకు సంక్రమించేది గాలికుంటు వ్యాధి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువులకు దూరంగా ఉంచడం వల్ల కొంతవరకు వ్యాప్తిని అరికట్టవచ్చు. వ్యాధి సోకిన పశువుల నోట్లో పుండ్లు కావడం, పొదుగుల వద్ద, కాలి గిట్టలకు కురుపుల్లా వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.
 
పశువులు లోలోపలే నీరసించిపోతాయి. పశువులకు వ్యాక్సినేషన్‌ చేయించాలని పశువైద్యులు సూచిస్తున్నా రు. నేటి నుంచి మార్చి 6వరకు జిల్లాలోని పశు వైద్యాధికారులు, సిబ్బంది 106 బృందాలుగా ఏర్పడి పశువులన్నింటికీ వ్యాక్సినేషన్‌ చేయడంతో పాటు, దాని యజమాని వివరాలు మొదలైనవి సేకరించి ఆన్‌లైన్‌లో
 అప్‌లోడ్‌ చేయనున్నారు.
 
జిల్లాలో ఆవు జాతి పశువులు 1,47,705, గేదె జాతి పశువులు 2,05,357 ఉన్నాయి. జిల్లాలో ఐదు పశు వైద్యశాలలు, 37 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 51 పశుఆరోగ్య ఉపకేంద్రాలు, ఐదు సంచార పశు వైద్యశాలలు, 41 గోపాలమిత్ర కేంద్రాలున్నాయి.
పశువైద్యం చేసేందుకు సహాయ సంచాలకులు ఐదుగురు, 37 మంది సహాయ శస్త్ర చికిత్సకులు, ఏడుగురు వెటర్నరీ లైవ్‌స్టాక్‌ ఆఫీసర్లు, 26 మంది జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్లు, 21 మంది లైవ్‌ స్టాక్‌ అసిస్టెంట్లు, 31 మంది వెటర్నరీ అసిస్టెంట్లు ఉన్నట్లు సమాచారం. గోపాలమిత్రలు ఇతర సిబ్బందితో కలిసి వీటికి గాలికుంటు వ్యాధి నివారణ వ్యాక్సినేషన్‌ చేసేందుకు 106 టీంలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
 
వైర్‌సతో సంక్రమించే వ్యాధి
గాలికుంటు వైరస్‌ వ్యాధి కావడంతో ఒక పశువుకు సోకితే గాలి ద్వారా నోటి స్రావాలు, ద్రవాల నుంచి వెలువడే వైరస్‌ మరో పశువుకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులకు గర్భస్రావం జరిగి పాల ఉత్పత్తి క్రమంగా పడిపోతుంది. పనిచేసే సామర్థ్యం ఉన్న ఎడ్లు, దున్నపోతులు క్షీణించి పని చేయలేని స్థితికి చేరుకుంటాయి. తీవ్రమైన జ్వరం, నోట్లో నాలుకపై, కాలి గిట్టల మధ్య పుండ్లు ఏర్పడుతాయి. అవి ఆహారం తీసుకోలేక, నడవలేక నీరసించిపోతాయి.
 
ఇది ప్రాణాంతక వ్యాధి కాకపోయినా పశువులు అవస్థల పాలవుతాయి. అలాంటపుడు గంజి వంటి ద్రవ పదార్థాలు పశువులకు తాపాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. దూడలు ఈ వ్యాధి సోకి చనిపోయే ప్రమాదముంది. వ్యాధి ప్రభావంతో పశువుల్లో రక్తహీనతతో పాటు శ్వాస పీల్చడం కష్టమౌతుంది. పుండ్లు ఉన్నచోట పశువులకు పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణంతో శుభ్రం చేయాలి. నోటి పుండ్లకు బ్లోరోగ్లిజరిన్‌, కాలిపుండ్లకు జింక్‌ ఆక్సైడ్‌, క్లోరాక్సిన్‌ వంటి మందులను రాయాలి. ఈగలు వాలకుండా వేపనూనె పూయాలి. మూడు నుంచి ఐదు రోజుల పాటు యాంటిబయోటిక్స్‌ మందులు విధిగా వాడాలి. పశువుల కొట్టాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం వల్ల వైరస్‌ నశిస్తుందని పశువైద్యులు సూచిస్తున్నారు.
 
టీకాలతో పాటు సమాచారం సేకరణ
నాలుగు నెలల దూడ నుంచి మొదలుకుని పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ఉచితంగా టీ కాలు వేస్తారు. పశువుకు సంబందించిన వ్యాక్సినేషన్ల వివరాలతో పాటు దాని యజమాని వివరాలు సేకరించి పూర్తి డాటా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. పశువులకు ట్యాగ్‌ వేస్తారు. ఇందుకోసం జిల్లాలో 106 టీంలు నేటి నుంచి పనిచేయనున్నాయి. ఇందుకు పశువుల యజమానులు సహకరించాలని పశువైద్యాదికారులు కోరుతున్నారు.