
అమరావతి: ఏపీలో శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి, ఆమోదింపజేసుకున్న వైసీపీ ప్రభుత్వం తాజాగా ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి జగన్ సర్కార్ పంపింది. హోం శాఖ, ఎన్నికల సంఘానికి కూడా మండలి రద్దు తీర్మానం, ఓటింగ్ సరళిని పంపినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లుపై కేబినెట్లో తీర్మానం చేసిన తర్వాత బిల్లును కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
కేంద్ర కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకుని, న్యాయశాఖ బిల్లు తయారు చేసి, పార్లమెంటు ఉభయ సభల్లో దానిపై చర్చించడానికీ ఎంతో కాలం పడుతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాతైనా దానిని పార్లమెంటు స్థాయూ సంఘానికి నివేదించక తప్పదని అంటున్నారు. జాతీయ స్థాయిలో ఒక విధానం అంటూ లేకపోతే ఒక ప్రభుత్వం మండలి ఏర్పాటు చేస్తే, మరో ప్రభుత్వం రద్దు చేస్తుందని పార్లమెంటరీ స్థాయూ సంఘం తెలిపింది. శాసనమండళ్ల ఏర్పాటు పూర్తిగా రాజకీయంగా మారిందని కమిటీ వ్యాఖ్యానించింది.
శాసన మండలిని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్న ఒడిసా కూడా ఈ విషయంలో జాతీయ విధానం కావాలని కేంద్రాన్ని కోరింది. ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోనే శాసన మండళ్లు ఉన్నాయి. గత అక్టోబరులోనే జమ్మూ కశ్మీర్ శాసన మండలిని ఆ రాష్ట్ర గవర్నర్ రద్దు చేశారు. ఏపీలోనూ రద్దయితే ఐదు రాష్ట్రాల్లోనే ఉంటాయి.