Jan 27 2020 @ 02:51AM

ఆనందం వైపు పయనించు..!

తీరంలో నడుస్తున్న ఓ వ్యక్తికి.. ఒడ్డునపడి గిలగిలా కొట్టుకుంటున్న ఓ చేప కన్పించింది. ‘‘అయ్యో!’’ అని దానిపై జాలి చూపుతూ.. ఇంటికి తీసుకొచ్చి, ఖరీదైన పరుపుపై పడుకోబెట్టి, విసరడం మొదలుపెట్టాడు. భార్యను పిలిచి, దాని నోట్లో కాస్త కాఫీ పోద్దామన్నాడు. ఆమె చేపను చూసి ‘‘ఏమండీ! దాని నోట్లో కాఫీ పోస్తే.. అది చచ్చిపోతుంది వెంటనే నదిలో వదిలిపెట్టండి’’ అన్నది. ‘‘దాని స్థానం అదే..! అది అక్కడైతేనే ఆనందంగా జీవిస్తుంద’’ని హితవుచెప్పింది.
 
అలాగే దుఃఖం అనే ఒడ్డుపై పడి బాధపడుతున్న మానవులను ఆనందమనే సాగరంలోకి పంపించేదే ఆధ్యాత్మికత. మనకున్న ఆనందాన్ని కోల్పోయి, ప్రస్తుతం కళ్లముందు కన్పించేదే శాశ్వతం అనుకుంటున్నాం. కానీ, అందులో శాశ్వతానందం లేదని గ్రహించే సరికి మన జీవితం మిగలడంలేదు. ఒక వ్యక్తికి వంద ఎకరాల మామిడి తోటతో పాటు.. చక్కెర వ్యాధి కూడా అమితంగా ఉంది. ఇంకొకరికి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ, రాత్రికి ఒక్క జొన్నరొట్టె కన్నా ఎక్కువ తినడం సాధ్యం కాదు. ఇంకొకరికి ముగ్గురు సంతానం. వారంతా విదేశాల్లో ఉంటున్నారు. చస్తే చివరి చూపునకు కూడా వారు అందకపోవచ్చు. మరో వ్యక్తికి గొప్ప పదవి ఉంది. కానీ, దాన్ని నిలబెట్టుకొనేందుకు రాత్రింబవళ్లు నిద్రలేదు. ‘‘రాళ్లను అరిగించుకునే వయస్సులో తినేందుకు తిండిలేదు; కోట్లు సంపాదించాక మరమరాలు కూడా అరిగించుకోలేకపోతున్నాడు’’ అన్న సామెత ఊరికే రాలేదు.
 
ధనం, పదవి, స్వార్థం, ఆశ్రిత పక్షపాతం, వ్యాధులు, బాధలు, మరణం, వృద్ధాప్యం, అనవసర చింత, అశాంతిగా జీవించడం, అసంతృప్తి, హద్దులు మీరిన కోరికలు.. ఇవన్నీ దుఃఖానికి వివిధ రూపాలు. మానవుడిని వెంటాడే ఈ దుఃఖాలకు ఆధ్యాత్మిక ఆనందమే పరిష్కారం. జీవితానికి సరిపడా డబ్బు చాలు అనుకుంటే అదే ఆనందం. పదవి వెంట మనం పడకుండా, అది వస్తే స్వీకరించడమే ఆనందం. నేను-నాది అన్న రెండు అవలక్షణాలను వదిలిపెడితే.. నీవు ఆనందమూర్తివే. శరీరాన్ని నియంత్రణతో ఉంచుకుంటే వ్యాధులు, బాధలు నీ దరిచేరవు. సహజంగా వచ్చే వృద్ధాప్యం, మరణాన్ని సంతోషంగా స్వీకరించగలిగితే అది ఆత్మానందమే. మానవునిలో నిద్రాణంగా ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకోవాలి. పశుపక్ష్యాదులకు లేని వివేచన మనిషికి మాత్రమే ఉంది. ఆలోచనాశక్తి, అనుభవం, విశ్లేషణ.. ఈ మూడు మానవుడిని ఇతర జంతువుల నుంచి వేరు చేస్తున్నాయి. వీటి ఆధారంగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి.
 
‘‘అమృతం చైవ మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠితం
మృత్యురాపద్యతే మోహాత్‌ సత్యేనాపద్యతే అమృతం’’
 
అమృతత్వం, మృత్యువూ రెండూ దేహంలోనే ఉన్నాయి. మోహాన్ని అంటిపెట్టుకొన్నప్పుడు మృత్యువును పొందుతారు. సత్యం అవలంబిస్తే అమృతత్వాన్ని పొందుతారు.. అని మహాభారతం చెప్పింది. ఆ అమృతత్వమే ఆనందం. అది శాశ్వతంగా ఉంటే ఆయనే భగవంతుడు. ఆనందాన్ని అంటిపెట్టుకొని ఉండడమే బ్రహ్మభావన.
- డాక్టర్‌ పి.భాస్కరయోగి