Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Tue, 21 Jan 2020 04:44:27 IST

చలో విశాఖ!

చలో విశాఖ!

 • అమరావతికి అన్యాయం చేయం
 • సహజసిద్ధంగా అభివృద్ధి చెందేందుకు సహకరిస్తా
 • ఏదో ఒక రోజు మహా నగరం అవుతుంది
 • మరో రెండు ప్రాంతాలకూ న్యాయం
 • అమరావతిని నిర్మించే ఆర్థిక శక్తి లేదు: జగన్‌
 • ఏపీ రాజధానిగా ఉక్కు నగరం..
 • అసెంబ్లీ సమావేశాలకే అమరావతి
 • కర్నూలులో కొలువుదీరనున్న హైకోర్టు
 • ‘3 రాజధానుల’కు అసెంబ్లీ ఆమోదం
 • హై పవర్‌ కమిటీ సిఫారసులకు ఓకే
 • ఏపీలో 13 జిల్లాలు 25కు పెంపు
 • జిల్లాగా లోక్‌సభ నియోజకవర్గం
 • రాష్ట్రంలో 4 ప్రాంతీయ కమిషనరేట్లు
 • సీఆర్డీయే రద్దు.. కొత్తగా ఏఎంఆర్డీయే
కృష్ణా తీరం పోయి.. సముద్ర తీరం రానుంది! కనుచూపు మేరంతా పచ్చని పొలాల బదులు ఎత్తైన కొండలు కనిపించనున్నాయి! వెరసి, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని మరోసారి మారనుంది! అమరావతి కేవలం అసెంబ్లీ సమావేశాలకు పరిమితమై.. అసలు సిసలు రాజధానిగా విశాఖపట్నం కొనసాగనుంది! హైకోర్టు కూడా అమరావతి నుంచి తరలిపోయి కర్నూలులో కొలువుదీరనుంది! సంబంధిత బిల్లుకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది! ‘చిన్న వాడివైనా చేతులెత్తి వేడుకొంటున్నా.. అమరావతిని కొనసాగించండి’ అని సీఎం జగన్‌కు చంద్రబాబు విన్నవిస్తే.. ససేమిరా.. ముందుకే అని జగన్‌ తేల్చి చెప్పారు. ‘మూడు రాజధానుల’ నిర్ణయంపై అమరావతి రైతులు భగ్గుమన్నారు! మహిళలు, యువకులు, వృద్ధులు, పిల్లలు.. పొలాలకు అడ్డం పడి.. పోలీసు లాఠీలు విరుగుతున్నా.. అసెంబ్లీని చేరుకున్నారు! నిర్బంధాలను ఛేదించి.. అసెంబ్లీ ప్రహరీ గోడను తాకి మరీ తమ నిరసన స్వరం వినిపించారు!! అయినా.. రాష్ట్రానికి రాజధానిని నిర్మించేందుకు అత్యంత విలువైన.. ముక్కారు పంటలు పండే తమ భూములను త్యాగం చేసిన వారి వేదన అరణ్య రోదనే అయింది!!
 
అమరావతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పాలనా రాజధానిగా విశాఖపట్నం ఖరారైంది. హైకోర్టు కర్నూలుకు తరలిపోనుంది. శాసన రాజధానిగానే అమరావతి పరిమితం కానుంది. అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా.. జగన్‌ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. రాజధాని విషయంలో ముందుకే సాగింది. 3 రాజధానుల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అనంతరం, ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తొలుత, ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో సోమవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. పాలన వికేంద్రీకరణకు 3రాజధానులు, 4ప్రాంతీయ కమిషనరేట్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ జీఎన్‌ రావు, బోస్టన్‌ కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి హైపవర్‌ కమిటీ అందించిన రిపోర్టును ఆమోదించింది. తద్వారా, పాల నా వ్యవస్థలో కీలకమైన సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖకు తరలించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అమరావతిలో అసెంబ్లీ వర్షాకాల, శీతాకాల సమావేశాలను నిర్వహించనుంది. కర్నూలును న్యాయ రాజధానిని చేసినా.. హైకోర్టు బెంచ్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది.
 
జిల్లాగా లోక్‌సభ నియోజకవర్గం
జిల్లాల వికేంద్రీకరణకూ ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. వీటిని ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 జిల్లాలుగా చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. జిల్లాల పెంపుదల 2021 నాటికి జరుగుతుంది. ఆలోగానే 4 పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేస్తారు.
 
ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు!
ఏపీలో ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేస్తారు. వాటిని ప్రాంతీయ ప్రణాళిక, అభివృద్ధి బోర్డులుగా వ్యవహరిస్తారు. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజనల్‌ డెవల్‌పమెంట్‌ ఏరియా, విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజనల్‌ డెవల్‌పమెంట్‌ ఏరియా, కర్నూలు అర్బన్‌ డెవల ప్‌మెంట్‌ ఏరియాలుగా వీటిని ఏర్పాటు చేస్తారు. తమ పరిధిలోని ప్రభు త్వ కార్యాలయాల నుంచి అవసరమైన నివేదికలను కోరడం; అభివృద్ధి ప్రణాళికల తయారీ, సమీక్ష, వాటి అమలు అధికారాలు ఆయా బోర్డులకు ఉంటాయి.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.