Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Fri, 17 Apr 2015 20:03:15 IST

ఆరేళ్లకే యాంకర్ నయ్యా..

ఆరేళ్లకే యాంకర్ నయ్యా..

ఆరగలగల గోదారిలా సాగిపోతుంది ఆమె మాటల ప్రవాహం... అలాగని నోటికి ఏదొస్తే అది కాకుండా నాలెడ్జ్‌తో పాటు క్లారిటీ కూడా కనిపిస్తుంది ఆ మాటల్లో. విష్ణుసహస్రనామాల నుంచి విండోస్‌ వరకూ నిరాటంకంగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత. ‘మా ఫ్రెండ్స్‌ అందరూ నన్ను వసపిట్ట, గులకరాళ్ల డబ్బా..’ అంటారని తనపై తనే చెణుకులు వేసుకునే ఫన్‌గన్‌, మాటల మిసైల్‌ అశ్విని శర్మ ఈ వారం టెలీస్టార్‌.
 
‘‘ఇంట్లో అందరూ నన్ను చంటి, చాటర్‌బాక్స్‌ అని పిలుస్తారు. మాట్లాడకుండా క్షణం కూడా ఉండలేను.. మౌనం, నిశ్శబ్దం అంటే పరమ చిరాకు. అందుకే యాంకరింగ్‌కి సరిపోయాననుకుంటా. మా స్వస్థలం వైజాగ్‌ కాని నేను అండమాన్‌ దీవుల్లో పుట్టాను. మా నాన్న సూర్యప్రకాష్‌ శర్మ ఆర్మీ ఆఫీసర్‌. అమ్మ లక్ష్మి గృహిణి. అమ్మ వాళ్ల ఊరు శ్రీకాకుళం, నాన్న ఊరు వైజాగ్‌. నాకో అక్క ఉంది తన పేరు అనూష. చిన్నదాన్ని కావడం వల్ల గారాబంగా పెంచారు. మా తాతగారు వి.ఎ్‌స.ఆర్‌. శ్రీపాద ప్రముఖ లాయర్‌. మా ముగ్గురు మామయ్యలు లాయర్లు. మా పెద్దతాత శ్రీపాద పినాకపాణి గారు ప్రముఖ సంగీతజ్ఞులు. సింగర్‌ చిన్మయి శ్రీపాద నా కజిన్‌.
 
ఇల్లు తగలబెట్టేంత అల్లరి..
నేను టామ్‌బాయ్‌ టైప్‌. మా నాన్న మిలిటరీ ఆఫీసర్‌ కావడం వల్ల చదువు ఒక చోట సాగలేదు. ఢిల్లీ, రాజస్తాన్‌, ముంబై, ఒరిస్సా, కేరళ, వైజాగ్‌.. ఇలా చాలా చోట్ల తిరిగాం. నేను ఆరో తరగతిలో ఉండగా హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాం. సికింద్రాబాద్‌లోని ‘కేంద్రీయవిశ్వవిద్యాలయం’లో చేరాక చదువు స్థిరంగా సాగింది. ఒకసారి వేసవి సెలవుల్లో శ్రీకాకుళం వెళ్ళాను. మా తాతగారి ఇంటి పక్కన తడికెల గుడిసెలు ఉండేవి. మధ్యాహ్నం పూట పిల్ల గ్యాంగ్‌తో కలిసి ఆడుకుంటూ అగ్గిపుల్ల గీసి తడికెలకి అంటించాను. ఇల్లు తగలబడిపోయింది. లాయర్‌గారి మనవరాలని వదిలిపెట్టారు వాళ్ళు. నీ అల్లరి తగలడా అని కొందరంటే... ఈ ఘనకార్యం విన్న మా అమ్మగారు
 
మాత్రం నన్ను చితక్కొట్టారు.
హైదరాబాద్‌లో ఒకరోజు మా ఇంటి చుట్టుపక్కల ఉండే పేదపిల్లలు మా ఇంటికొచ్చారు. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. వాళ్ళకి సరిగా బట్టల్లేవని నా బట్టలతో పాటు మా అక్కవి, నాన్నవి, అమ్మవి కూడా ఇచ్చేశా. వాళ్లకి అన్నం పెడదామని కుక్కర్‌లో బియ్యం పోసి నీళ్ళు పోయకుండా గ్యాస్‌పై పెట్టా. మాడిపోయి ఇల్లంతా ఒకటే వాసన. సరిగ్గా అప్పుడే అమ్మ ఇంటికొచ్చి చూసింది... ఇల్లే తగలబెట్టేసేదానివే అంటూ నా వీపు విమానం మోత మోగించింది.
 
దేనికీ భయపడేదాన్ని కాదు..
ఇప్పుడైతే పెద్ద జడ ఉంది కానీ.. చిన్నప్పుడు బాయ్‌కట్‌లోనే ఉండేదాన్ని. ఇద్దరు అమ్మాయిలు నా బెస్ట్‌ఫ్రెండ్స్‌. వారిలో ఒకరికి వాటర్‌ బాటిల్‌, ఇంకొకరికి బ్యాగ్‌ ఇచ్చి లీడర్‌లా ముందు నడిచేదాన్ని. ఐదో తరగతిలోనే కారు నడిపాను. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు మా అక్కని పదోతరగతి చదువుతున్న ఒక అబ్బాయి ఏడిపించాడు. అతడ్ని దగ్గరికి పిలిచి మరీ కొట్టాను. లెక్కల టీచర్‌ ఉమారాణి క్లాస్‌కి రాకూడదనే కోపంతో ఆమె స్కూటీకి పంక్చర్‌ చేశాను. నేను ఏడో తరగతి చదివే రోజుల్లో మా ఇంట్లో రోజుకో వస్తువు పోయేది. ఎందుకలా జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఓ రోజు రాత్రి రెండుగంటలప్పుడు కిటికీలోంచి చేయి పెట్టి దొంగ వస్తువులు అందుకుంటుంటే ఒక వస్తువు జారి కింద పడింది. ఆ శబ్దానికి మా అక్క నిద్రలేచి అరిచింది. నేను లేచి దొంగని పట్టుకోవటం కోసం స్పీడుగా పరిగెత్తాను. వాడు కొడితే నా చెవిలోంచి రక్తం కారింది. అయినా వదల్లేదు. తర్వాత మిగతా వారందరూ నా వెనక వచ్చి దొంగని పట్టుకుని పోలీసులకి అప్పగించారు.
 
తొలిసారి సినిమాల్లోకి..
చిన్నప్పుడు హైదరాబాద్‌కి అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుండేవాళ్లం. ఓ ఫంక్షన్‌ కోసం హైదరాబాద్‌కి వచ్చినపుడు దర్శకుడు సానా యాదిరెడ్డి గారు ‘సినిమాల్లో యాక్ట్‌ చేస్తావా’ అని అడిగారు. సరే అన్నాను. తొలి సినిమా ‘హీరో’. మంచి పేరొచ్చింది. ‘కొడుకు’ మూవీలో బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టి్‌స్టగా అవార్డు అందుకున్నా. ఆ తర్వాత ‘అభిమాని’, ‘పల్లకిలో పెళ్ళికూతురు’, ‘ధైర్యం’, ‘గొడవ’ ఇలా పదిహేను సినిమాల్లో నటించా. ‘ఛత్రపతి’ చిత్రంలో చంద్రముఖిగా నటించా. ఆ పాత్రతో మస్తు క్రేజ్‌ వచ్చింది.
 
సినిమాల్లోకి రావటం, యాంకరింగ్‌ చేయటం ఒకేకాలంలో జరిగింది. మొదటి యాంకరింగ్‌ ప్రోగ్రామ్‌ ‘నీకోసం’. స్టూడియోకి వెళ్ళాక మేకప్‌ వేసేందుకు తీసుకెళ్లి ఫెయిర్‌ అండ్‌ లవ్లీ ముఖానికి పూసి... పాలరంగుకు మేకప్‌ అవసరం లేదన్నారు. నన్ను ‘స్మాల్‌ స్ర్కీన్‌ మిల్కీబ్యూటీ’ అంటారు. నాకు తెలుగు రాదు. మా అమ్మ చెబితే ఇంగ్లీషులో రాసుకుని తెలుగులో మాట్లాడేదాన్ని. ‘ఖుషి అన్‌లిమిటెడ్‌’తో పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ‘ఆనందం’, ‘వారెవ్వా’, ‘మా-టాకీస్‌’, ‘దూకుడు’, ‘ఫ్యామిలీ సర్కస్‌’ ఇలా చాలా ప్రోగ్రామ్స్‌ చేశాను. లైవ్‌ కార్యక్రమాలు చేయటంలో అశ్విని ది బెస్ట్‌ అనిపించుకున్నా. యాంకరింగ్‌లో పేజీలకి పేజీలు గుర్తు పెట్టుకుని మాట్లాడటం చూసి నా మెమొరీచిప్‌ అదుర్స్‌ అనేవారు.
 
సహనమే సక్సెస్‌ సీక్రెట్‌
నా యాంకరింగ్‌ జీవితం కేక్‌ వాక్‌లా ఏమీ సాగలేదు. ఫామ్‌లో ఉన్నప్పుడే ‘నీకు యాంకరింగ్‌ రాద’ని విమర్శించారు కొందరు. మా అమ్మ మాత్రం ‘నవ్విన ఊళ్ళే పట్నాలు అవుతాయి.. నానిన గోడలే అద్దాలు అవుతాయి’ అని చెప్పేది. మనసును బాధించే అంశమేమిటంటే... నాతో షూటింగ్‌ పూర్తి చేశాక నన్ను వద్దని వేరే వాళ్ళతో మళ్లీ షూటింగ్‌ చేయడం. పని చేసినా డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం వంటివి చాలా జరిగాయి. ఎటువంటి పరిస్థితినైనా సహనంతో భరించాను. నా పని నేను పర్ఫెక్ట్‌గా చేసి సక్సెస్‌ సాధించాను. యాంకరింగే నాకు బ్రెడ్‌ అండ్‌ బటర్‌. అందుకే మేకప్‌ వేసుకున్నాక దేవుడికి దండం పెట్టి స్టేజ్‌ ఎక్కుతాను.
 
ఆ ప్రశంస జీవితాంతం మర్చిపోలేను
నా తొలి సెలబ్రిటీ ఇంటర్వ్యూ హరికృష్ణగారిది. ముందురోజు జ్వరం వచ్చింది. గొంతు బాగోలేదు. అయినా అలాగే చేశాను. ఇంటర్వ్యూ బాగా వచ్చిందని కాంప్లిమెంట్స్‌ దక్కాయి. సెలబ్రిటీ ఇంటర్వ్యూల విషయానికొస్తే రజనీకాంత్‌ సింప్లిసిటీ అద్భుతం. కమల్‌హాసన్‌ గారిని 21 సార్లు ఇంటర్వ్యూ చేశాను. నాగార్జున, దిల్‌ రాజు నా యాంకరింగ్‌కి అభిమానులు. ఇక లెక్కలేనన్ని సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేశాను. ఈ మధ్య జరిగిన ‘ఓకే బంగారం’ మూవీ ప్రెస్‌మీట్‌లో నేను పాట హమ్‌ చేస్తుంటే... స్వయానా ఎ.ఆర్‌. రెహ్మాన్‌ గారే వచ్చి ‘మీ గొంతు వింటుంటే ట్రాక్‌ విన్నట్లుంది’ అంటూ నన్ను ప్రశంసించటం కలలా అనిపించింది. ఆ ప్రశంస జీవితాంతం మర్చిపోలేను. మ్యూజిక్‌ మాసో్ట్ర ఆప్యాయంగా మాట్లాడిన ఆ అద్భుతక్షణాల్ని మాటల్లో వర్ణించలేను.
 
గిన్నిస్‌ రికార్డు సాధించాను
బాల్యంలో సంప్రదాయ నాట్యం, సంగీతం నేర్చుకోలేదు. చిన్నప్పుడు వినాయక మండపాల దగ్గర డ్యాన్సు చే స్తుంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్‌ చేసేవారు. ఆ పైన ‘డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌’లో స్టేట్‌ ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. అయిదేళ్ళ క్రితం కర్ణాటక వోకల్‌ని అభ్యసించా. రీసెంట్‌గా ఒకటిన్నర నెలక్రితం 9 కీర్తనలు(నవగ్రహకీర్తనలు) 108 నిమిషాల్లో పాడాను. ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ బుక్‌ రికార్డుతో పాటు ‘గిన్నిస్‌ బుక్‌ రికార్డు’ సాధించా. చాలా సంతోషపడ్డాను. మామూలుగా నేర్చుకున్న కీర్తనలు పాడాలని ప్రయత్నిస్తే గిన్ని్‌సబుక్‌లో చోటుదక్కడం అదృష్టం. నేను యాంకరింగ్‌ చేసే తొలినాళ్లలో సింగర్‌ కార్తీక్‌ దగ్గరికి వెళ్ళి.. ‘కార్తీక్‌ అన్నయ్యా .. నన్ను పెళ్ళిచేసుకుంటావా?’ అని అడిగా. అపుడు కార్తీక్‌గారు ‘అరె బంగారు తల్లీ’ అని చాలాసేపు మాట్లాడారు. వేరే రంగంలో ఉండే అబ్బాయినే పెళ్ళిచేసుకుంటాను. రెండుమూడేళ్ళలో ఓ ఇంటిదాన్నవుతా. యాంకరింగ్‌ చేసినన్నాళ్ళూ చేస్తాను. ఆ తర్వాత ప్రొడక్షన్‌ హౌస్‌ నెలకొల్పాలనే ఆలోచన ఉంది. ఓ సినిమాకు డైరెక్షన్‌ చేయాలనే ఆశ ఉంది.

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.