desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 23:45PM

నగరాలతోనే పేదరికం అంతం: మోదీ

  • పట్టణీకరణ సమస్య కాదు.. అవకాశం
  • స్మార్ట్‌ సిటీలంటే అదేదో ఫ్యాన్సీ కాన్సెప్ట్‌ కాదు
  • పేదలకు సమగ్రస్థాయిలో భరోసా ఇచ్చే కార్యక్రమం
  • నగరాల అభివృద్ధి పథాన్ని నిర్ణయించాల్సింది ప్రజలే
  • ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నవారు కాదు: ప్రధాని మోదీ
  • ‘స్మార్ట్‌ సిటీస్‌’ అభివృద్ధి పనులకు పుణెలో శ్రీకారం
  • 20 నగరాల్లో 84 ప్రాజెక్టులు ప్రారంభం
పుణె, జూన్‌ 25: ‘‘ఒకప్పుడు మనదేశంలో పట్టణీకరణను పెద్ద సమస్యగా చూసేవారు. కానీ, నేను దానికి భిన్నంగా భావిస్తున్నాను. పట్టణీకరణను మనం సమస్యగా చూడకూడదు. దాన్ని పేదరికాన్ని తగ్గించే ఒక అవకాశంగా పరిగణించాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్మార్ట్‌ సిటీస్‌’ కార్యక్రమంలో భాగంగా 20 నగరాల్లో 84 ప్రాజెక్టులను ఆయన శనివారం పుణెలో ప్రారంభించారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల్లో 14 పుణెవి కాగా.. మిగతా నగరాలవి 69 ప్రాజెక్టులు. ‘‘ఆర్థిక రంగంలో ఉన్నవారు నగరాలను అభివృద్ధి కేంద్రాలుగా పరిగణిస్తారు. పేదరికాన్ని తగ్గించే శక్తి మన నగరాలకే ఉంది. అందుకే పేద ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు వలస వెళ్తారు. అక్కడ అవకాశాలను వెతుక్కుంటారు’’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. పేదరికాన్ని వీలైనంత తక్కువ సమయంలో గరిష్ఠస్థాయిలో తగ్గించే విధంగా పట్టణాలను, నగరాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు. అయితే, దేశంలోని ప్రతి నగరానికీ ఓ ప్రత్యేక గుర్తింపు ఉన్నదని.. ప్రజల భాగస్వామ్యంతో సమగ్రమైన, పరస్పర అనుసంధానం ద్వారా ఒక దార్శనికతతో వాటిని బలోపేతం చేసుకోవాలి తప్ప ముక్కలుముక్కలుగా ఎక్కడివాటిని అక్కడ అభివృద్ధి చేసే పద్ధతిలో కాదని ఆయన పేర్కొన్నారు. ఏ పనినైనా ముక్కలుముక్కలుగా చేయడం వల్ల మార్పు సాధ్యపడదన్నారు. పట్టణప్రాంతాలను, నగరాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో అత్యంత తెలివైన దేశ ప్రజలే నిర్ణయించుకోవాలిగానీ.. ఇవన్నీ ఎక్కడో ఢిల్లీలో కూర్చుని తీసుకునే నిర్ణయాలు కావని స్పష్టం చేశారు.

ప్రజలూ భాగస్వాములు కావాలి..

స్మార్ట్‌ సిటీస్‌ అభివృద్ధి పథాన్ని నిర్ణయించే క్రమంలో ప్రజల భాగస్వామ్యం పెరగాలని.. ఈ నగరాలు కూడా అభివృద్ధి కేంద్రాలుగా ఎదగడంలో ఒకదానితో మరొకటి పోటీపడాలని ప్రధానిమోదీ పిలుపునిచ్చారు. గతప్రభుత్వాలు దేశాన్ని తిరోగమన మార్గంలో నడిపించాయని.. తమ ప్రభుత్వం దేశాన్ని ముందుకు తీసుకుపోయే మార్గాలను అన్వేషిస్తోందని పేర్కొంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. అలాగని ఆ ప్రభుత్వాలు ఏ పనీ చేయలేదని, బడ్జెట్‌ మొత్తాలను ఖర్చు చేయలేదని చెప్పడం తన ఉద్దేశం కాదని.. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన దేశాలు మనను దాటి అంత తక్కువ పరిధిలో ఎలా అభివృద్ధి చెందాయోనన్నదే తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. అలాగే.. స్మార్ట్‌ సిటీస్‌ అంటే అదేదో ఫాన్సీ విధానంగా భావించవద్దని, ఇది పట్టణ పేదలకు ఇళ్లు సహా సమగ్ర స్థాయిలో మౌలిక సేవలు అందించే దిశగా భరోసా ఇచ్చే మిషన్‌ అని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్‌ సిటీల్లో పాలన, ప్రజా సేవల నాణ్యతను పెంచేందుకు వాటి ప్రణాళికల్లో డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నారు.
 
స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి సంబంధించి 25 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభుత్వానికి సీరియ్‌సగా సలహాలు, సూచనలు ఇచ్చారంటూ వారి భాగస్వామ్యం పట్ల ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దేశంలోని 125 కోట్ల మందిప్రజల సామర్థ్యాన్ని సరైన రీతిలో వినియోగించుకుంటే.. వారి నైపుణ్యాలను వినియోగంలోకి తెస్తే వారు అద్భుతాలను సాధించగలరన్నారు. అప్పుడు ఎవరికీ ప్రభుత్వంతో అవసరం ఉండదన్నారు. పట్టణ ప్రాంతాలు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అలాగే, ‘మేక్‌ యువర్‌ సిటీ స్మార్ట్‌’ అనే పోటీని కూడా ప్రధాని ప్రారంభించారు. దీంట్లో పాల్గొనాలనుకునేవారు.. నగరాల్లో వీధులు, కూడళ్లు, ఖాళీ ప్రదేశాలు ఎలా ఉంటే బాగుంటుందో ఆ డిజైన్లను పంపించవచ్చు. ఈ ఐడియాలను, స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి అవసరమైన పరిష్కారాలను ఒకరితోమరొకరు పంచుకోవడానికి వీలుగా ‘స్మార్ట్‌ నెట్‌ పోర్టల్‌’ను కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు.. దీన్ని ఒక చరిత్రాత్మక కార్యక్రమంగా అభివర్ణించారు. ‘దేశ చరిత్రలో ఇదో కీలకమలుపు. మనం (ఇన్నాళ్లూ) సాంస్కృతిక పునరుజ్జీవనం గురించి విన్నాం. కానీ, ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో పట్టణ పునరుజ్జీవనం చోటుచేసుకోబోతోంది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీని ఆయన సంస్కరణవాది, కార్యోన్ముఖుడు, పరివర్తనశీలిగా అభివర్ణించారు. కాగా, స్మార్ట్‌సిటీ్‌సగా ఎంపికైన నగరాలున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు(ఏపీ), నవీన్‌ పట్నాయక్‌ (ఒడిసా), వసుంధర రాజె (రాజస్థాన్‌) తదితరులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మోదీ సంభాషించారు.