Jan 15 2016 @ 00:45AM

ఫైనల్లో ఢిల్లీ

  • సెమీస్‌లో చెన్నై ఓటమి 
  • వారియర్స్‌-ముంబై సెమీస్‌ నేడు 
బెంగళూరు: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో ఢిల్లీ ఏసర్స్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. లీగ్‌ దశలో అద్భుతంగా రాణించి టాప్‌ ప్లేస్‌తో సెమీస్‌కు చేరుకున్న ఢిల్లీ మరోసారి అదే ఆటతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగిన సెమీస్‌లో ఢిల్లీ 4-3తో పీవీ సింధు నేతృత్వంలోని చెన్నై స్మాషర్స్‌ను ఓడించింది. మొదటిదైన పురుషుల డబుల్స్‌లో ఢిల్లీ జోడీ కూ కీట్‌-టాన్ బూన్‌ 15-10, 15-14తో క్రిస్‌ అడ్‌కాక్‌-ప్రణవ్‌ చోప్రా (చెన్నై) జంటపై గెలిచింది. తర్వాతి పురుషుల సింగిల్స్‌లో అజయ్‌ జయరామ్‌ 14-15, 15-10, 15-7తో సోనీ కుంకోరొపై నెగ్గి ఢిల్లీకి 2-0తో ఆధిక్యం అందించాడు. అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో చెన్నై జంట క్రిస్‌ అడ్‌కాక్‌-పియా జుబేదియా 15-9, 15-14తో గాబ్రియెల్లె- కూ కీట్‌ (ఢిల్లీ) ద్వయాన్ని ఓడించింది.
 
ఆ వెంటనే తమ ట్రంప్‌ మ్యాచ్‌ అయిన మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 15-6, 15-7తో పీసీ తులసిని ఓడించి రెండు పాయింట్లు గెలుచుకుంది. దీంతో చెన్నై 3-2తో ఆధిక్యంలో నిలిచింది. ఇక చివరిదైన పురుషుల సింగిల్స్‌ రెండో మ్యాచ్‌ను ఢిల్లీ ట్రంప్‌గా ఎంచుకోగా.. దీనిలో టామీ సుగియార్టో 15-11, 15-10తో బ్రైస్‌ లెవెర్డెజ్‌ (చెన్నై)ను ఓడించి ఢిల్లీకి 4-3తో విజయం అందించాడు. ఇక హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగే రెండో సెమీస్‌లో సైనా నెహ్వాల్‌ సారథ్యంలోని అవధ్‌ వారియర్స్‌, ముంబై రాకెట్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ విజేత ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ ఏసర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.