
మలాపురం(కేరళ): పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో అమరుడైన లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రనేడ్ పేలుడులో ఆదివారం అమరుడైన నిరంజన్ కుమార్‌కు ఓవైపు దేశమంతా నివాళులర్పిస్తుంటే మరోవైపు మలాపురం పట్టణానికి సమీపంలోని కోడూరుకు చెందిన అన్వర్ సిద్ధిఖ్(24) తన ఫేస్బుక్ పేజీలో అతనిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘‘మరొకడు చనిపోయాడు. ఇప్పుడు ప్రభుత్వం అతని భార్యకు ఉద్యోగం ఇవ్వాలి. కానీ సామాన్యులకు మాత్రం ఏమీ ఒరగడం లేదు. ఇదీ.. భారతదేశ దరిద్రమైన ప్రజాస్వామ్యం’’ అంటూ ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్‌పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తర్వాత తొలగించాడు. అయితే అప్పటికే అది దేశవ్యాప్తంగా శరవేగంగా పాకిపోయింది. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ప్రొఫైల్‌ను పరిశీలించారు. అతను మలయాలం డైలీలో పనిచేస్తున్నట్టు తేలింది. అయితే అతను తమ సంస్థలో పనిచేయడం లేదని సంస్థ పేర్కొంది. ఈరోజు అతడిని అరెస్ట్ చేసి విచారించగా కోడూరులోని ఓ రేషన్ షాప్‌లో పనిచేస్తున్నట్టు తేలింది. అతను నేరాన్ని ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఫేస్బుక్ పోస్టింగ్‌లకు ఉపయోగించే మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. పోస్టింగ్‌ను పేజీ నుంచి తొలగించడంతో దానిని రికవర్ చేయడం కష్టమని పోలీసులు వివరించారు.