Advertisement
Advertisement
Abn logo
Advertisement
Published: Sat, 13 Sep 2014 23:19:38 IST

తెలుగు రాష్ర్టాల పుట్టినరోజు ఎప్పుడు?

తెలుగు రాష్ర్టాల పుట్టినరోజు ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాలు అనే పేరు ఈ మధ్యన అటు పత్రికలలోను, ఇటు దృశ్యమాధ్యమంలోను బాగా వినిపిస్తూ ఉంది. ఈ తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు వాటి అవతరణ దినోత్సవాలను జరుపుకోవాలి? మొదటిగా నేడు ఆంధప్రదేశ్‌ అని పిలుచుకుంటున్న ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన పార్లమెంటు చట్టం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అప్పాయింటెడ్‌ డేట్‌ ప్రకారం జూన్‌ రెండున ఏర్పడింది. కాని దీనికి తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్‌ 8న ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ అనే పేరున్న రాష్ట్రం నవంబరు 1న ఏర్పడింది. కాబట్టి జూన్‌ 2, జూన్‌ 8, నవంబరు 1 ఇందులో ఏ తేదీన ఇప్పుడున్న 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవాలనే సమస్య ముందుకు వచ్చింది. మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న 13 తెలుగు జిల్లాలు, పోయిన బళ్ళారి, గంజాం జిల్లాలు రెండు కలిగి 15 జిల్లాలు విడిపోయి తెలుగు రాష్ట్రంగా ఏర్పడాలి అనే కోరికతో ఉద్యమం సాగింది. ఉద్యమంలో తారస్థాయిగా పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్‌ 29న ఆమరణ నిరాహారదీక్షకు కూర్చొన్నారు. డిసెంబరు 19న అంటే పొట్టి శ్రీరాములు అమరుడైన నాలుగో రోజున పార్లమెంటులో నాటి ప్రధాని తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చివరికి 13 జిల్లాల తెలుగు రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి ఏర్పడింది. అది ‘ఆంధ్రరాష్ట్రం’ అని అధికారికంగా పిలవబడింది. చాలా తర్జభర్జనల తర్వాత కర్నూలు పట్టణాన్ని దీనికి రాజధానిని చేశారు. అప్పటికే అటు హైదరాబాదు సంస్థానం నిజాం కబంధ హస్తాల నుంచి విముక్తమై 1948 సెప్టెంబరు 17 నుంచి హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది. 1952లో సార్వత్రక ఎన్నికల అనంతరం బూర్గుల రామకృష్ణరావు ముఖ్యమంత్రిగా హైదరాబాదులో ప్రప్రథమంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. అంటే మనకు 1953 నుంచి 1956 వరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. అదే స్థితి నేడు అంటే 2014లో తిరిగి వచ్చి చరిత్ర పునరావృతమయింది.
ముందుగా 13 జిల్లాల ఆంధ్రరాష్ట్రం గురించి ఆలోచిస్తే 1956 నవంబరు 1 నుంచి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నుంచి పది జిల్లాలను 29 వ రాష్ట్రం తెలంగాణగా విడదీస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అప్పాయింటెండ్‌ డేట్‌ని ప్రకటించింది. మిగిలిన 13 జిల్లాలని అవశేష ఆంధ్రప్రదేశ్‌గా చట్టంలో కేంద్రప్రభుత్వమే ప్రకటించింది. అంటే ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు 13 జిల్లాలకు అలాగే మిగిలిపోయింది. పది జిల్లాలకు అధికారికంగా కొత్తపేరు వచ్చింది. కాని 13 జిల్లాలకు రాలేదు. దీనికి కారణం ఉంది. విడదీసిన ప్రాంతానికే కొత్త పేరుకావాలి కాని మిగిలిఉన్న రాష్ట్రానికి అదే పేరు ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలను విడదీసినప్పుడు కొత్త ప్రాంతానికి కొత్త పేరువచ్చింది. కాగా మిగిలిన రాష్ట్రాలకు అవే పేర్లు మిగిలాయి. 13 జిల్లాలకు అదే ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకారం అప్పాయింటెండ్‌ డేట్‌ జూన్‌ 2 కాబట్టి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌ లేదా నవ్యాంధ్రప్రదేశ్‌ (అలా కూడా వ్యక్తులు, మీడియా ప్రేమతో పిలుస్తున్నారు) జూన్‌ 2న దాని అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని కొందరు ప్రజలు భావిస్తున్నారు. కాని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్‌ 2నే పదవీప్రమాణ స్వీకారం చేశారు. అప్పటిదాకా అటు తెలంగాణ ఇటు అంధ్రప్రాంతాలు రాష్ట్రపతి పాలనలో అంటే గవర్నర్‌ అధీనంలో ఉన్నాయి. ఆనాటి నుంచే కొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కాని జూన్‌ 8 దాకా నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయలేదు. జూన్‌ 8న కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఆంధ్రరాష్ట్రం తిరిగి ఈ రోజే అధికారంలోనికి వచ్చింది. కాబట్టి నేటి ఆంధ్రప్రదేశ్‌ దాని అవతరణ దినోత్సవాన్ని జూన్‌ 8న జరుపుకోవాలని కొందరు భావిస్తున్నారు. కాని మరికొందరు ప్రజాప్రభుత్వం లేకున్నా రాష్ట్రం విడిపోయి ఏర్పడిన రోజు జూన్‌ 2 కాబట్టి ఆ రోజు జరుపుకోవాలి అని భావిస్తున్నారు.
కాగా ఇక్కడ ఒక చారిత్రక విషయాన్ని గమనించాలి. 1956 దాకా రెండు తెలుగు రాష్ట్రాలు ఉనికిలో ఉన్నాయి. అప్పటిదాకా 13 జిల్లాల ఆంధ్రరాష్ట్రం పనిచేసింది. అదే రాష్ట్రం 1956లో తెలంగాణతో కలిసింది. తాత్కాలికంగా ఉనికిని కోల్పోయి తిరిగి 2014 లో విడిపోయింది. కాబట్టి ఇది ఒక కొత్త రాష్ట్రం కాదు. కాగా అక్టోబరు 1నే ఆంర ధరాష్ట్రం అనేది కొత్తగా మద్రాసు నుంచి విడిపోయి అధికారికంగా ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంతో ఏర్పడింది. వేరే చోట కలిసి, విడిపోయిందికాగా తిరగి విడిగా నిలబడింది. ఇలా చరిత్ర పునరావృతం అయింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి అవతరణ అనేది అక్టోబరు 1నే జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంగా తిరిగి ఏర్పడిన ఈ 13 జిల్లాల రాష్ట్రం తిరిగి అక్టోబరు 1నాడే అధికారికంగా అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవల్సివుంటుంది. జూన్‌ రెండును, జూన్‌ 8ని అలాగే నెహ్రూగారు రాషా్ట్రన్ని ప్రకటించిన డిసెంబరు 19ని ముఖ్యమైన చారిత్రక దినాలుగా ఆంధ్రప్రదేశ్‌ గుర్తు పెట్టుకోవచ్చు. కాని అసలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది అక్టోబరు 1నే కాబట్టి అదే రాష్ట్రం ఈ రోజున ఇక పైన అలా ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని అక్టోబరు 1న చేసుకోవాలి. చారిత్రకంగా తర్క సహితంగా కూడా ఆదే సరైనది అవుతుంది.
ఇక తెలంగాణ విషయానికొస్తే సెప్టెంబర్‌ 17న అది స్వాతంత్ర్యాన్ని పొందినా దాదాపు రెండు సంవత్సరాలు జనరల్‌ జయంతినాథ్‌ చౌదరి అధిపతిగా సైనిక పాలనలో ఉండింది. అప్పటి తెలంగాణలో తెలుగు జిల్లాలే కాక కర్ణాటకలోని కొన్ని జిల్లాలు మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు ఖమ్మంతో కలిపి 16 జిల్లాలుండేవి. అప్పటికి ఖమ్మం జిల్లా వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉండేది. అలా అప్పటి తెలంగాణలో 15 జిల్లాలుండేవి. కాగా తెలంగాణ, ఆంధ్రరాష్ట్రంతో కలిసినప్పుడు తొమ్మిది జిల్లాలతోనే కలిసింది. కారణం 1956 నాటికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన కారణంగా తెలంగాణలోని కన్నడ భాషా జిల్లాలు అటు కర్ణాటకలో కలిసాయి. అందుకు వీటిని తొమ్మిది జిల్లాలతోనే (అప్పటికి రంగారెడ్డి జిల్లాలేదు. అది హైదరాబాద్‌ జిల్లాలోనే భాగం) ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. అందుకే 1956 నవంబర్‌ 1 నాటికి ఉన్న తెలంగాణ కావాలని తెలంగాణ ఉద్యమంలో ఉన్న టిఆర్‌ఎస్‌ కోరింది. కాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలి అని అంటే రెండు మూడు ఆలోచనలు మనస్సులో మెదులుతాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడదీస్తూ పార్లమెంటు చట్టం చేసిన రోజు లేదా ఆ చట్టాన్ని అమలు చేసిన అప్పాయింట్‌డ్‌ డే జూన్‌ 2న అనేది ఒక తర్కం . ఇక్కడ విషయం స్పష్టం. రాష్ట్రపతి ఆమోదించిన చట్టం చేసినది ఏవరే రోజు అయినా దాన్ని అమలు చేసిన జూన్‌ 2నే అవతరణ జరిగినట్లు లెక్క. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది జూన్‌ 2నే. కాగా అసలు తెలంగాణ విడిపోయి విమోచనం చెందిన రోజు సెప్టెంబర్‌ 17. సెస్టెంబర్‌ 17న విమోచనం జరిగింది హైదరాబాదు సంస్థానానికి, తెలంగాణకు కాదు. తెలంగాణ తిరిగి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది జూన్‌ 2నే. అప్పటిదాకా పది జిల్లాల తెలంగాణ అనేది ఉనికిలో లేదు కాబట్టి తెలంగాణకు అవతరణదినోత్సవం జూన్‌ 2నే జరపడం తర్క సహం సరైనది. కాగా ఆంధ్రప్రదేశ్‌ అనేది 1953 అక్టోబర్‌ 1నే తొలిసారి ఉనికిలోనికి వచ్చింది. అదే 13 జిల్లాల్లో అదే విధంగా తిరిగి బయటకు వచ్చిందికాబట్టి అక్టోబర్‌ 1నే నేటి ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం జరుపుకోవడం సరైనది అవుతుంది. చరిత్ర తెలిసిన పెద్దల అభిప్రాయం కూడా ఇదే కనిపిస్తూ ఉంది.
- పులికొండ సుబ్బాచారి
ద్రావిడ విశ్వవిద్యాలయం

ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.