
కొవ్వూరుటౌన్ : గోదావరి మాతకు కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ప్రధాన స్నానఘట్టంలో మహానీరాజనం అందించారు. గోష్పాదక్షేత్ర గోదావరి నీరాజన సమితి ఆధ్వర్యంలో క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టంలో ఏర్పాటు చేసిన గోదావరి మాత విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు తుట్టగుంట భైరవమూర్తి, గోదావరి నీరాజన సమితి అధ్యక్షుడు కె.కృష్ణారావుదంపతులు గోదావరి మాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే జవహార్ మాట్లాడుతూ గోదావరి పవిత్రను కాపాడటానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారరు. జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి తీరంలో జన్మించి జీవించడం మహాభాగ్యమన్నారు. గోదావరి పరిశుభ్రత కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే యాత్రీకులకు ఘనంగా స్వాగతం పలకాలన్నారు. అనంతరం గోదావరి మాతకు అఖండ నీరాజనం అందించారు. మహిళలు దీపోత్సవం నిర్వహించారు. గోదావరి మాత చిత్రపటాన్ని ఆవిష్కరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహామహోపాధ్యాయ దోర్భల ప్రభాకరశర్మ, అల్లూరి ఇంద్రకుమారి, చైర్మన్ సూరపనేని చిన్ని,ఆర్డీవో శ్రీనివాసరావు, ఐటీడీఏ పీవోఆర్వీ సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ ఆళ్ల హరిబాబు, గోవర్ధనం శ్రీనివాసమూర్తి, మల్లాది కల్యాణ్‌కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పి.మురళీకృష్ణ, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రచారక్ భరత్‌జీ, సలాది సందీప్ కుమార్, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం వశిష్ఠతీరంలో..
నరసాపురం: వశిష్ఠ గోదావరికి బుధవారం రాత్రి అట్టహాసంగా సంధ్యాహారతినిచ్చారు. దామోదర భజన మండలి భక్తి కీర్తనల మధ్య, వేదపండితులు రామవరపు శ్రీరామ్, గంగా సత్యకిషోర్, రాంపండులు హారతి ఇచ్చారు. సంధ్యాహారతితో పాటు దూప, దీపా, శంక, కుంభ, నక్షత్ర, కర్పూర, వస్త్రహారతులు కూడా వశిష్ఠ గోదావరికి ఇచ్చారు. ఈ హారతిని తిలకించేందుకు వచ్చిన భక్తలతో వలంధర్‌రేవు పోటేత్తింది. సుమారు గంటన్నర పాటు ఈ కార్యక్రమం జరిగింది. తిలకించేందుకు విచ్చేసిన జన సందోహం భక్తి శ్రద్ధలతో హారతుల్ని వీక్షించారు. అంతకు ముందు రేవులో ఉన్న పరమశివుడు, వశిష్ఠ మహర్షి, అంజనేయస్వామి విగ్రహాలను ఎంపీలు తోట సీతారామలక్ష్మి, గంగరాజు, ఎమ్మెల్యే మాధవనాయుడు, చైర్పర్సన్ రత్నమాలు పూజా కార్యక్రమా లు నిర్వహించా రు. గోదావరి పుష్కరాలకు పురస్కరించుకుని నిర్వహించిన సంధ్యాహారతి కార్యక్రమాన్ని స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో విచ్చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రెడ్డప్ప ధవేజీ వ్యవహరించారు. తొక్కిసలాట జరగకుండా రేవులో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్ ఆర్డీవో రామకృష్ణమూర్తి, వీసీ పోన్నాల నాగబాబు, కౌన్సిలర్ పెదసింగ్ మణి తదితరులు పాల్గొన్నారు.
తాళ్ళపూడిలో మాజీ మంత్రి పురందేశ్వరి
తాళ్ళపూడి : పవిత్ర గోదావరి నదికి సంధ్యాహారతిని నా చేతుల మీదుగా అందించడం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నాని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బుదవారం తాళ్ళపూడి, తాడిపూడి, ప్రక్కిలంకలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ధర్మజాగరణ సమితి సభ్యులు గోదావరికి సంధ్యాహారతి ఇచ్చా రు. వేదపండితులు జంద్యాల గంగాధరశర్మ, అశ్వనీదత్ గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, కోనేరు మహేష్‌బాబు, సుంకవల్లి రామకృష్ణ, సింహాద్రి జనార్దనరావు,పరమేశ్వరరావు, సర్పంచ్ సుగుణ పాల్గొన్నారు.