ABN-Andhrajyothy కథనంతో దిగొచ్చిన హెచ్‌సీఏ... ఆలియాకు కొనసాగుతున్న చికిత్స

ABN , First Publish Date - 2022-09-23T16:04:55+05:30 IST

నగరంలోని జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన ఆలియా అనే యువతి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ABN-Andhrajyothy కథనంతో దిగొచ్చిన హెచ్‌సీఏ... ఆలియాకు కొనసాగుతున్న చికిత్స

హైదరాబాద్: నగరంలోని జింఖానా గ్రౌండ్స్(Gymkhana Grounds) వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన ఆలియా అనే యువతి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిన్న రాత్రి రూ.40 వేలు కడితేనే ట్రీట్మెంట్ చేస్తామని... లేదంటే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. కాగా... ఈ విషయంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) వరుస కథనాలు ప్రసారం చేయడంతో హెచ్‌సీఏ(HCA) యాజమాన్యం దిగివచ్చింది. ఆలియా డిశ్చార్జ్ అయ్యేంత వరకు ప్రతీ రూపాయి భరిస్తామని హెచ్‌సీఏ యాజమాన్యం హామీ ఇచ్చింది. రాత్రికి రాత్రి యశోదా(Yashoda hospital)కు వచ్చి చికిత్స డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఆలియాకు యశోదా ఆస్పత్రి వైద్యులు చికిత్స కొనసాగించారు. కొద్దిసేపు క్రితమే ఆలియాకు వైద్యులు సిటీ స్కాన్ చేశారు. గాయాలు ఎక్కువగా ఉన్నాయని, బ్లడ్ క్లాట్‌తో పాటు రిబ్స్‌లో కొంత గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆలియా ఆరోగ్యం నిలకడగా ఉంది.  సరైన సమయంలో స్పందించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఆలియా తల్లి బేగం ధన్యవాదాలు తెలిపారు. 


నిన్నటి దారుణానికి అజారుద్దీన్‌దే తప్పు: ఆలియా తల్లి

నిన్న జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన దారుణానికి అజారుద్దీన్‌దే తప్పని ఆలియా తల్లి అన్నారు. తమ పాపకు యశోదా ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని... టెస్టులు, స్కానింగ్స్ చేస్తున్నారని చెప్పారు. ఆలియాకి చెస్ట్, రిబ్స్‌లో బ్లడ్ క్లాట్ అయిందని డాక్టర్లు చెప్పారన్నారు. టికెట్ల కోసం ఉదయం 5 గంటలకి వచ్చామని... కోహ్లిని చూద్దామని అనుకున్నాం..కానీ ఇలా అయిందని అన్నారు. తమ పాపపై 3 వందల మంది పడిపోయారని... పది నిమిషాల తర్వాత జనాల కింది నుండి తమ పాపని తీశారని తెలిపారు. ‘‘మా పాప నిన్ననే చనిపోయేదని... దేవుడి దయ, మీడియా సహకారం వల్లే మా పాప బ్రతికింది’’ అంటూ ఆలియా తల్లి అన్నారు.


కాగా... భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్(India-Australia match) టికెట్ల కోసం పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అభిమానులతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. తొక్కిసలాటలో పలువురు స్పృహ కోల్పోగా.. ఏడుగురికి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి అదుపుతప్పడంతో అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 

Updated Date - 2022-09-23T16:04:55+05:30 IST