MP Galla Jayadev తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారా...!?

ABN , First Publish Date - 2021-12-12T20:29:11+05:30 IST

ఆయన్ను పార్టీ రెండు సార్లు ఎంపీ చేసింది. పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగినా.. పార్టీ అధినేత దీక్ష చేసినా ఆ నేత కనిపించరు..

MP Galla Jayadev తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారా...!?

ఆయన్ను పార్టీ రెండు సార్లు ఎంపీ చేసింది. పార్టీ ఆఫీస్‌పై దాడి జరిగినా.. పార్టీ అధినేత దీక్ష చేసినా ఆ నేత కనిపించరు.. చివరకు పార్టీ అధినేత కుటుంబ సభ్యులను విపక్షం కించపరిచినా ఆ ఎంపీ నుంచి స్పందన లేదు. ఓట్లు వేసి గెలిపించిన రైతులు న్యాయం కోసం రోడ్డున పడ్డా వారి వైపు ఎంపీ కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో అసలు ఆ ఎంపీ పార్టీలో ఉన్నారా.. లేదా..? అనే చర్చ మొదలైంది.. ఇంతకు ఎవరా ఎంపీ..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం..


మొహం చాటేస్తున్న గల్లా!

రాజకీయ ఉద్దండులను అందించిన గుంటూరు జిల్లా కేంద్రం నుంచి తెలుగుదేశం ఎంపీగా గల్లా జయదేవ్‌ను ప్రజలు రెండు పర్యాయాలు ఓట్లు వేసి గెలిపించారు. తొలిసారి ఎంపీగా గెలిచినపుడు పార్టీ అధికారంలోఉండటంతో గల్లా హడావుడి చేశారనే నేతలు రెండోసారి ఎంపీగా గెలిచి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నియోజకవర్గానికి రాకుండా మొహం చాటేస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ కుమారుడు గల్లా జయదేవ్‌. గల్లాకు గుంటూరు ఎంపీ సీటు కేటాయించినప్పుడు పార్టీలో విమర్శలు వచ్చినా చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు.


                            గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే ఏపీ నూతన రాజధాని అమరావతి కూడా ఏర్పాటు చేయడంతో  స్థానిక ఎంపీగా గల్లా జయదేవ్‌కు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రం అంతా వైసీపీ ప్రభంజనం సృష్టించినా గుంటూరు ప్రజలు మాత్రం తెలుగుదేశం అభ్యర్థి గల్లా జయదేవ్‌కు  పట్టం కట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లా జయదేవ్‌.. తెలుగుదేశం  పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు దూరంగా ఉంటున్నట్లు టాక్‌ వస్తోంది.


రాజధాని ఉద్యమాన్ని నడిపించాల్సిన గల్లా సైలెన్స్‌!

వైసీపీ సర్కార్‌ వచ్చాక  మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తోంది. గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే అమరావతి ఉండటం విశేషం. రాజధాని ఉద్యమాన్ని ముందుండి నడిపించాల్సిన ఎంపీ గల్లా జయదేవ్ తొలుత అడపాదడపా వచ్చి ఒకటి రెండు సార్లు రైతులకు కనిపించి వెళ్లారు. అమరావతి రైతు చేపట్టిన ‘న్యాయం స్దానం టూ దేవస్దానం’ పేరుతో మహా పాదయాత్రకు వైసీపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతుపలుకుతూ సంఘీభావం తెలుపుతున్నాయి. కాని స్దానిక ఎంపీ ప్రతిపక్ష ఎంపీ గల్లా జయదేవ్ మాత్రం పత్తాలేకుండా పోయారని విమర్శలు వస్తున్నాయి. ఓట్లు వేసి గెలిపించిన రాజధాని రైతులు ఇంత ఉద్యమం చేస్తున్నా తన ఓటర్లవైపు గల్లా జయదేవ్ మాత్రం కన్నెత్తి కూడా చూడటం లేదు, మద్దతుగా ప్రకటన చేయడం లేదు అనే ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.


గల్లా జయదేవ్‌ టీడీపీలోనే ఉన్నారా..!?

టిడిపి అధినేత చంద్రబాబు సతీమణిపై అసెంబ్లీలో వైసీపీ ప్రజా ప్రతినిధులు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుటికి కూడా ఎంపీ గల్లా జయదేవ్ స్పందించకపోవడంతో పార్టీ క్యాడర్‌లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అసలు గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నారా? లేదా? అనే ప్రశ్నలు పార్టీ క్యాడర్‌లో చర్చకు వస్తోంది. సారు ఎంపీగా గుంటూరు రారు, ప్రజలకు అందుబాటులో ఉండరు. కనీసం పార్టీకి, పార్టీ అధినేతకు కష్టాలు వచ్చినా స్పందించరు అనే అసంతృప్తి కార్యకర్తల గుసగుసలు రూపంలో వినిపిస్తోంది. మరీ గల్లా జయదేవ్ ఎందుకు మౌనం దాల్చారు. మౌనానికి కారణాలు ఏంటోనని అంతుచిక్కడం లేదు.


చంద్రబాబు దీక్ష టైమ్‌లో.. ఢిల్లీ పర్యటనలోనూ కనిపించలేదేం..!?

అమరావతి ఉద్యమానికి మాత్రమే కాదు సొంత పార్టీ తెలుగుదేశానికి సైతం ఎంపీ గల్లా జయదేవ్‌ దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన సందర్భంలో, చంద్రబాబు రెండు రోజుల పాటు దీక్ష చేసిన సమయంలో ఎంపీ గల్లా జయదేవ్ కనీసం స్పందించకపోవడం, కనిపించకపోవడం ఆరోపణలకు బలం చేకూర్చుతోందని పార్టీలో ఇన్‌సైడ్‌ టాక్ నడుస్తోంది. చంద్రబాబునాయుడు  మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో కూడా ఆ పార్టీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ ఎక్కడా కనిపించకపోవడం టీడీపీ నేతల్లో అనుమనాలు మొదలయ్యాయి.



Updated Date - 2021-12-12T20:29:11+05:30 IST