సర్వం ‘సజ్జల’మయం.. మంత్రుల్లో మథనం.. YS Jagan నోరు మెదపరేం..!?

ABN , First Publish Date - 2021-12-27T19:23:41+05:30 IST

అంతా ఆయనే..! ప్రభుత్వ వైఖరి చెప్పాలన్నా ఆయనే.. పార్టీ అభిప్రాయాలు తెలియజేయాలన్నా ఆయనే కనిపిస్తారు..!..

సర్వం ‘సజ్జల’మయం.. మంత్రుల్లో మథనం.. YS Jagan నోరు మెదపరేం..!?

అంతా ఆయనే..! ప్రభుత్వ వైఖరి చెప్పాలన్నా ఆయనే.. పార్టీ అభిప్రాయాలు తెలియజేయాలన్నా ఆయనే కనిపిస్తారు..! చివరకు ఉద్యోగులతో సమస్యలపై చర్చల్లో కూడా ఆయనే కీలకపాత్ర వహిస్తారు..! ముఖ్యమంత్రి దర్శనం లభించకపోతే ఆయనను కలసి తమ సమస్యలను చెప్పుకుంటుంటారు..! ఇంతకీ ఆయన ఎవరు? అధికార వైసీపీలో ఆయనపై ఎందుకంతలా చర్చ జరుగుతోంది? అనే ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


సజ్జల పెత్తనమేంటో..!

పార్టీలో, ప్రభుత్వంలో ఇలా ఒక్కరి చేతికి పెత్తనం ఇవ్వడం, ఆయనకే అన్ని బాధ్యతలు అప్పగించడం అనేది చాలా ప్రమాదకరమైన ధోరణి అని ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత ఒకరు ఆఫ్‌ ది రికార్డ్‌గా చెప్పారు. ఉద్యోగుల ఆందోళన విషయంలో కూడా వాళ్లు రోడ్డు ఎక్కేవరకు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని ఆ నేత ప్రశ్నించారు. రాష్ట్రస్థాయి ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనను తాత్కాలికంగా విరమించినప్పటికీ.. జిల్లా, మండల స్థాయి ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆ నేత విశ్లేషించారు. ఈ విషయంపై చర్చించేందుకు మంత్రులను పిలవడంతో.. కొందరు అమాత్యులు అసలు సచివాలయానికి కూడా రావడం మానేశారు. అంతా ఆయనే చూసుకుంటే.. ఇంకా మాకేం పని మరి అని కొందరు మంత్రులు అంటుండటం కొసమెరుపు.


అంతా ఈయనకే ఎందుకో..!

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కార్యదర్శుల కమిటీ నివేదికపై అధ్యయనం చేసి, ఉద్యోగులతో చర్చలు జరిపించేందుకు మంత్రులతో ఒక కమిటీని నియమించాల్సి ఉంది. కానీ అటువంటి పరిస్థితి లేదు. చర్చలో చివరకు ఆయనే కీలకంగా మారారు. ముఖ్యమంత్రి దర్శనం లభించని అనేకమంది నేతలు ఎమ్మెల్యేలు, చివరకు మంత్రులు కూడా సజ్జలను కలిసి తమ సమస్యలు చెప్పుకొని వెళుతుంటారు. నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు, ఇప్పటికీ చేపట్టిన పనులకు బిల్లులు విడుదల కోసం అర్జీలు ఆయనకే ఇస్తుంటారు. ఇది పరిష్కారం కావడం లేదు. ఎందుకంటే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వానికి నిధుల కొరత ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే సమస్యలు పరిష్కారం కాకపోవడం, మంత్రులను, నోరున్న ఎమ్మెల్యేలను విస్మరించి అంతా ఆయనకే అప్పగించడం ఏమిటనే గుసగుసలు అధికార పార్టీలో వినిపిస్తున్నాయి.


ఇంత జరుగుతున్నా నోరు విప్పరేం..!

ప్రభుత్వాన్ని సమస్యలు చుట్టుముడుతున్నా... వాటిపై సీఎం జగన్‌ నోరు విప్పరు. అయితే ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం.. అన్ని సమస్యలకు సమాధానం చెబుతుంటారు. ప్రెస్‌ మీట్లు మరీ వెల్లడిస్తుంటారు. విద్యుత్‌ చార్జీలపైనా, జాబ్‌ క్యాలెండర్‌ సమస్య అయినా, ఏదైనా సరే ఆయనే మీడియా ముందుకు వస్తారు. అంతేకాకుండా ముఖ్యమంత్రికి మౌత్‌ పీస్‌లాగా వ్యవహరిస్తారు. చివరకు ఉద్యోగులు ఆందోళనకు పిలుపునిచ్చిన తరువాత పోరాటం జరుగుతున్న సమయంలో.. వారితో చర్చల్లో కూడా ఆయనే కీలకపాత్ర పోషిస్తున్నారు. చివరకు రెండు రోజుల తరువాత ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిని రంగంలోకి దించారు. ఈ పరిణామమే అధికార పార్టీలో అంతర్గత గుసగుసలకు కారణమైంది. అన్నింటికీ ఆయనేనా అనే ప్రశ్న ప్రారంభమైంది.


ఆ మాటలు వైసీపీకి శాపంగా మారాయ్!

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయింది. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో.. నిన్నమొన్నటి వరకు అంతా సాఫీగానే జరిగింది. పదవుల పంపకం కూడా సాగింది. కానీ రెండున్నర సంవత్సరాలు గడిచిన తరువాత వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలు, జగన్‌ పాదయాత్రలో చెప్పిన మాటలు ప్రస్తుతం అధికార పార్టీకి శాపంగా మారాయి. చివరకు ఉద్యమాలుగా మారుతున్నాయి. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించిన నాటి నుంచి ఈ ఎదురుగాలి ప్రారంభమైంది. అమరావతి ఉద్యమం, ఓటీఎస్‌పై ప్రజల్లో అసంతృప్తి, చెత్త, విలువ ఆధారిత పన్ను పెంపుపై ప్రతిపక్షాల పోరాటాలు, ఇలా ఒకదాని వెంట ఒకటిగా సమస్యలు చుట్టుముడుతున్నాయి.





Updated Date - 2021-12-27T19:23:41+05:30 IST