Advertisement
Advertisement
Abn logo
Advertisement

MP Vijayasai Reddy పై తిరుగుబాటు.. ఇక సామాన్లు సర్దుకోవాల్సిందేనా.. అసలేం జరిగింది..!?

ఆయనది ఆ ఊరు కాదు, వాడ కాదు.. కానీ అక్కడ ఆయనే నెంబర్‌ వన్‌ అంటుంటారు. ఆయన, ఆయన అనుచరుల హల్చల్‌తో లోకల్‌ బాయ్స్‌కు నాన్‌ లోకల్‌పై చిర్రెత్తుకొచ్చింది. ఉంటే ఆయనైనా ఉండాలి లేదంటే మీమైనా ఉండాలి అనేంతగా వార్‌ ముదురుతోంది. మ్యాటర్‌.. సార్‌ దగ్గరకి పోవడంతో నాన్‌లోకల్‌ పాలిటిక్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని ఆర్డర్‌ పాసైందట. దీంతో సామాన్లు సర్దుకోవడమే మిగిలింది అనే ప్రచారం మొదలైంది. ఇంతకీ లోకల్‌ నాన్‌లోకల్‌ పాలిటిక్స్‌ ఏంటి..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌ స్టోరీలో చూద్దాం.

నెంబర్‌-02 అని అభిమానుల ప్రచారం..! 

వైసీపీలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తర్వాత నెంబర్‌ టూ పొజిషన్‌ విజయసారెడ్డిదే అని ఆయన అభిమానులు ఘనంగా చెప్పుకుంటారు.  ఉత్తరాంధ్రలో ఆయనదే హవా... ముఖ్యంగా విశాఖలో అయితే ఆ నేత మాటకు తిరుగేలేదు. ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి, నెల్లూరు పెద్దా రెడ్డి అని ఆయన ప్రత్యర్దులు ముద్దుగా పిలుచుకుంటారు. ఆ మధ్యన విజయసాయిరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా విశాఖలో ఎక్కడపడితే అక్కడ ప్లెక్సీలు, భారీ భారీ కటౌట్లు కట్టి ఆయన అభిమానులు ప్రేమను చాటుకున్నారు. వీటిని చూసిన వారు ఇది విశాఖపట్నమా..? విజయసాయి పట్నమా అనేలా  చేశారు. అయితే వైసీపీలో ఆయనపై నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి కొద్దికొద్దిగా బయటపడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఎంతలా అంటే ఆయన విశాఖ పట్నం కేంద్రంగా నడుపుతున్న రాజకీయాలకు పుల్‌స్టాప్‌ పెట్టాల్సిందే అనేంతంగా.

విజయసాయి సైలెంట్‌గా సైడ్‌ అవుతున్నారా..? 

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాజ్యసభ ఎంపీ విజయసాయి అచరులను ఎవర్ని విశాఖలో ఉండవద్దని చెప్పినట్లు వార్తలు గుప్పుమన్నాయి.మరో వైపు విజయసాయి రెడ్డి అండ్ కో పై జరుగుతున్న ప్రచారాల నేపధ్యంలో ఆయన కూడా సైలెంట్ అయిపోయారట. అందుకే ఆయన విశాఖకు వచ్చినా...తన పని తాను చూసుకొని వెళ్లిపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయసాయి అనుచరులు సెటిల్మెంట్లు చూసుకుంటూ దోచుకుంటున్నారని విస్త్రతంగా ప్రచారం జరుగుతోంది. ఇదే పంథా కొనసాగితే భవిషత్తులో పార్టీకి నష్టమని హైకమాండ్ దృష్టికి కొందరు తీసుకువెళ్లారంట.

చెక్‌పెడుతున్న సీనియర్లు..!

పార్టీలో కొంతమంది సీనియర్లు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన యోధానుయోధులు ..విసారె ఎత్తుగడలు, వ్యూహాలను ఎప్పటికప్పుడు కనిబెడుతూ, వ్యూహాత్మంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.అయితే వీరంతా తమ రాజకీయ అనుభవంతో ఎక్కడా,  విసారెని బహిరంగా వ్యతిరేకిస్తున్నట్లు కనబడరు...బయటపడరు. తమ చేతల ద్వార అభిప్రాయాలను చెప్పకనే చెబుతారు. అందుకే పార్టీ కార్యాలయంలోకానీ, ప్రభుత్వ కార్యాలయాలలో విజయసాయి రెడ్డి ప్రెస్‌మీట్ కానీ, కార్యాక్రమాల్లో కానీ ఆయనతో కలిసి పాల్గొనడానికి ఇష్టపడరు. ఆయనతో కలసి వేదికను పంచుకోవడానికి ఆసలు ఆసక్తి చూపించరు. వీరంతా సింగిల్‌గా వచ్చి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోతారు. లేదంటే నగరంలో ఏదైనా కార్యక్రమంలో హాజరై వెళ్లిపోతారు.

విశాఖలో విజయసాయి సెటిల్‌ అవుతారా..?

ఆ మధ్య విసారె ప్రకటన.. ఉత్తరాంధ్ర వైసిపి సీనియర్ నేతలలో రైళ్లు పరిగెత్తించింది. తాను విశాఖలో స్థలం కొని ఇక్కడే సెటిల్ అవుతానని ఆ ప్రకటన సారాంశం. దీంతో ఉత్తరాంధ్ర వైసిపి సీనియర్లలో అలజడి రేగింది. ఇప్పటికే తాము విజయసాయిరెడ్డి కారణంగా వెనకబడిపోతున్నామని, ఆయన ఇక్కడ సెటిల్ అయితే...తమకు రాజకీయ భవిషత్తుకు ఇబ్బంది తప్పదని అంచనా వేస్తున్నారట. చిత్రం ఏమిటంటే ..నెల్లూరు నుంచి వచ్చిన విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర సిఎం అని అంటున్నారు కానీ, ఉత్తరాంద్రలోనే పుట్టి పెరిగి, రాజకీయాలలో ఉన్న తమను ఏనాడూ ఎవరూ ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి అనలేదని ఒక సీనియర్ నేత తమ అనుచరుల వద్ద వాపోయారట.

విశాఖ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం..!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి విజయ సాయి రెడ్డి పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఉత్తరాంధ్ర సీనియర్లకు కంటి మీద కునుకు లేదనే టాక్‌ అంతర్గతంగా వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో విసారే సెటిల్ అయినా, ఎంపీగా పోటీ చేసి గెలిచినా  ఇక తమ రాజకీయ అధిపత్యానికి గండిపడుతుందేమోనని ఇప్పటి నుంచే భయపడుతున్నారట. అందుకే ఇప్పటి నుంచే చాప కింద నీరులా ఆయన వ్యూహాలకు ప్రతివ్యూహాలను రచిస్తున్నారు. ఆయన కార్యాకలాపాలపై ఒక నిఘా పెట్టి, పార్టీకి ఆయన వల్ల  జరుగుతున్న నష్టం, ఆయన వ్యవహార శైలిని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారంట. ఈ విషయంపై పార్టీ హైకమాండ్ కూడా వారి చెప్పిన మాటలకు షాక్ తిందని, త్వరలోనే ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తారని విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాదు, విసారె ఆశిస్తున్నట్లు విశాఖ లోక్‌సభ స్థానం కూడా ఇవ్వవద్దని ఇప్పటికే విజ్ఞప్తి చేశారని సమాచారం.

ఎంపీ సీటు ఇస్తే ఓడిస్తామని హైకమాండ్‌కు వార్నింగ్‌!

ఒకవేళ విసారె ప్రభావానికి లొంగిపోయి  హైకమాండ్ కనుక వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ నుంచి విజయసాయి రెడ్డికి అవకాశం కల్సిస్తే...గతంలో పోటీ చేసిన వైఎస్ విజయమ్మ పరిస్థితే వస్తుందని కూడా చెప్పేశారట. నిజంగా విసారె విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారా? లేదా? ఒక వేళ పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే..


Advertisement
Advertisement