Telugudesamలో ఎంపీ కేశినేని మరోసారి హాట్ టాపిక్.. ఇంత జరుగుతున్నా ఎందుకీ మౌనం..!?

ABN , First Publish Date - 2022-01-31T17:59:33+05:30 IST

Telugudesamలో ఎంపీ కేశినేని మరోసారి హాట్ టాపిక్.. ఎందుకీ మౌనం..!?

Telugudesamలో ఎంపీ కేశినేని మరోసారి హాట్ టాపిక్.. ఇంత జరుగుతున్నా ఎందుకీ మౌనం..!?

బెజవాడ టీడీపీలో వైసీపీపై పోరు కన్నా పార్టీలో ఆధిపత్యం కోసం పోరాటమే ఎక్కువగా కనిపిస్తోందా..? ఏదైనా అంశంలో ఒకరు జోక్యం చేసుకున్నాక మరొకరు అందులోకి ఎంటర్‌ కాకుండా తాము మాత్రమే హైలైట్‌ అయ్యేందుకు బెజవాడ టీడీపీ నేతలు తపిస్తున్నారా..? కేసినో విషయంలో పార్టీ నేతలందరూ గట్టిగా గళం వినిపించినా.. ఎంపీ కేశినేని నాని మాత్రం మౌన మునిగా మారారెందుకు..? ఆయన సైలెంట్‌గా ఉండటంపై బెజవాడ టీడీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది..? అనే ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం..


మరోవైపు రాధా ఎపిసోడ్‌లోనూ..!

ఇటీవల వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగిందన్న విషయంలో ఎంపీ కేశినేని నాని ముందున్నారు. వంగవీటి రాధాను పరామర్శించారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు రాధా ఎపిసోడ్‌లో బుద్దా వెంకన్న, బొండా ఉమ దూరంగా ఉన్నారు. ఇప్పుడు కేసినో విషయంలో అందుకు విరుద్ధంగా పరిస్థితి నెలకొంది. గుడివాడ కేంద్రం కేసినో నిర్వహణ అంశంలో మంత్రి కొడాలి, డీజీపీలపై బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఎప్పుడు చూసినా ఆధిపత్య పోరు!

నిజానికి బెజవాడ టీడీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఇక్కడ పార్టీలో పలు గ్రూపులున్నాయి. ఇందులో ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని గ్రూప్‌ ఒకటి కాగా.. రెండో గ్రూపులో బుద్దా వెంకన్న, బోండ ఉమ, నాగుల్‌ మీరాలు ఉన్నారు. ఒక వర్గం వారితో మరొక వర్గం వారికి పడదు. ఈ క్రమంలోనే ఈ రెండు గ్రూపులు ఒక్కో అంశాన్ని ఒక్కో గ్రూపు వారు తమ చేతుల్లోకి తీసుకుని ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.


నోరు మెదపలేదేం నానీ..!

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా తమ పార్టీ అధినేత చంద్రబాబును ఇష్టానుసారంగా మాట్లాడిన కొడాలిపై విరుచుకుపడ్డారు. దేవినేని ఉమ, వర్ల రామయ్య, బోండ ఉమ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, బుద్దా వెంకన్న, పట్టాభి రామ్‌, నాగుల్‌ మీరా తదితర నేతలు కొడాలి నాని తీరుపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే సీరియస్‌గా మాట్లాడిన బుద్దా వెంకన్నను అరెస్ట్‌ చేశారు. ఇంత జరుగుతున్నా కేసినో విషయంలో కానీ, చంద్రబాబుపై మంత్రి కొడాలి చేసిన వ్యాఖ్యలపై కానీ స్వపక్ష ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో స్పందించకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేశినేని నానికి చంద్రబాబు మద్దతు ఎక్కువగా ఉందని టాక్. అయినప్పటికీ ఎంపీ కేశినేని నాని.. మంత్రి కొడాలిపై నోరు మెదకపోవడం ఏమిటని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.


కొడాలి నాని సవాల్.. మరోసారి కేశినేని హాట్ టాపిక్..

బెజవాడ టీడీపీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా గుడివాడ కేంద్రంగా కేసినో జూదాన్ని మంత్రి కొడాలి నాని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలను హీటెక్కించాయి. అయితే తనపై వచ్చిన కేసినో నిర్వహణ ఆరోపణలను మంత్రి కొడాలి నాని ఖండించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబుపై ఆయన మరోసారి బూతు మాటలతో ధ్వజమెత్తారు. నోటికి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. తాను కేసినో నిర్వహిస్తున్నానని నిరూపిస్తే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు పెట్టుకుంటానని కూడా మంత్రి కొడాలి నాని సవాల్‌ విసిరారు.


వీళ్లు అందిపుచ్చుకున్నారుగా..!

మరోవైపు ఎంపీ కేశినేని నాని మాత్రం.. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు, కేసినో నిర్వహణ వ్యవహారంలో సైలెంట్‌గా ఉన్నారు. దీంతో బొండా ఉమ, బొద్దా వెంకన్నలు ఈ అంశాన్ని అందింపుచ్చుకున్నారు. ఇలా ఒకరు జోక్యం చేసుకున్న అంశంలో మరొకరు జోక్యం చేసుకోకుండా తాము మాత్రమే హైలైట్‌ అయ్యేందుకు బెజవాడ టీడీపీ నేతలు తపిస్తున్నారని తమ్ముళ్లలో జోరుగా చర్చ జరుగుతోంది.


మౌన మునిలా ఉండిపోయారేం..!

కాగా.. గతంలోనూ ఎంపీ కేశినేని నాని పార్టీలో తనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదని సైలెంట్‌ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. అయితే పార్టీ పెద్దల జోక్యంతో ఆయన మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. చంద్రబాబు సైతం ఆయనకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కేసినో అంశంపై మాటల యుద్ధం జరుగుతోంది. ఇందులో ముఖ్య నేతలందరూ మాట్లాడుతున్నా.. ఎంపీ కేశినేని నాని మాత్రం మౌన మునిలా వ్యవహరిస్తున్నారు. దీంతో బెజవాడ టీడీపీలో ఆయన వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది.



Updated Date - 2022-01-31T17:59:33+05:30 IST