Abn logo
Oct 19 2021 @ 12:41PM

Kurnool జిల్లాలో YSRCP పునాదులు కదులుతున్నాయా.. ఎన్నికల వరకు ఓ లెక్క.. గుడ్ బై చెప్పేస్తున్న నేతలు..!

వైసీపీ అంటే చచ్చేంత పిచ్చి. ఆ జెండా అంటే గుండెల నిండా అభిమానం. ఎప్పటికైనా కోరుకున్న పదవి దక్కకపోదా అనే ఆశ. అయితే ప్రజలు ఆశీర్వదించినా పార్టీ పక్కనపెడుతుంటంతో ఆగ్రహంతో ఊగిపోకతప్పడం లేదు. అవమానాలతో రగిలిపోతూ విగ్రహాలు కూల్చేందుకు సిద్దమవక తప్పడం లేదు. జెండా పీకేస్తున్నారు. కండువ మార్చేస్తున్నారు. అధికార పార్టీని వదిలేస్తున్నారు. వైసీపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఈ మార్పులెందుకు వస్తున్నాయి. దీనికి బాధ్యులైనవారిపై చర్యలేమైనా ఉంటాయా..? అనే ఆసక్తికర విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.

పునాదులు కదులుతున్నాయా.. అసలేం జరిగింది..!? 

కంచుకోట అనుకున్న కర్నూలులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పునాదులు కదులుతున్నాయి. పరిషత్ ఎన్నికలు రేపిన చిచ్చుచల్లారడం లేదు. ఎన్నికలు ప్రారంభమైనపుడు మొదలైన అసంతృప్తులు, ఫలితాలు వెలువడిన తర్వాత పదవుల పంపకంలో తేడాలు రావడంతో పార్టీని వీడేవారి సంఖ్యక్రమేపీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయని గ్రామ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మీకే మండల పరిషత్‌ చైర్మన్ పదవి అని చెప్పి ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు నమ్మించి మోసం చేయడంతో పదవులు దక్కనివారు కుతకుతలాడుతున్నారు. కొన్ని చోట్ల ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల జెండాలు పీకేస్తున్నారు. కండువాలు పారేస్తున్నారు. నిగ్రహాలు కోల్పోయి విగ్రహాలు కూల్చివేసే ప్రయత్నం చేసి తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.

కండువా తీసి మేయర్‌ కాళ్లు మొక్కబోయిన అసంతృప్తులు!

గూడూరు మండలం కె.నాగలాపురం వైసీపీ ఎంపీటీసి రాజమ్మ ఎమ్మెల్యే సుధాకర్‌ తీరును నిరసిస్తూ రోడ్డు మీద టెంట్‌ వేయడం పార్టీలో హాట్‌ టాపిక్‌ అయింది. ఎంపీపీ పదవి ఇస్తానని మోసం చేశారని ఆరోపిస్తూ ఎంపీటీసీ రాజమ్మ, కుమారుడు నరసింహారెడ్డి, మద్దతుదారులతో  ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. వీరి శిబిరానికి కర్నూలు నగర మేయర్ బివై రామయ్యను ఎంఎల్ఏ సుధాకర్ తీసుకొ చ్చి బుజ్జగించే ప్రయత్నం చేశారు. వైసిపికో దండం అంటూ ఎంపీటీసీ రాజమ్మ కుమారుడు నరసింహా రెడ్డి పార్టీ కండువా తీసేసి మేయర్ కాళ్లు మొక్కబోయడం పార్టీని నమ్ముకున్న వారికి ఎంత మోసం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేయడంపై క్యాడర్‌ చర్చించుకుంటోంది.

పెద్ద చర్చే..!

సొంత స్ధలంలో ఏర్పాటు చేసిన  వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించమంటూ ఎంఎల్ఏ,మేయర్‌కు ఎంపిటిసి కుమారుడు తేల్చిచెప్పడం చూస్తే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చనే మాట వినిపిస్తోంది. ఎంపీటిసి రాజమ్మ ఎంత మొత్తుకున్నా చివరకి అనుకున్న వాళ్లకే ఎంపీపీ పదవి కట్టబెట్టారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన  ఎంపీటీసి రాజమ్మ కుమారుడు తన స్థలంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని గునపంతో పెకిలించే ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి పోలీసులు జీపులోకి ఎక్కించుకుని వెళ్లడం నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారితీసింది.

ఎన్నికల వరకు ఓ లెక్క.. ఆ తర్వాత మరో లెక్క!

సి. బెళగల్ మండల కో ఆప్షన్ ఎన్నికలో జరిగిన గొడవలో సి.బెళగల్‌-2 ఎంపీటీసీ ఈరన్నగౌడ్‌ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంపై పార్టీలో చర్చ మొదలైంది. కో ఆప్షన్ సభ్యుడిగా హారున్ ఎన్నికను నిరసిస్తూ సి.బెళగల్ - 2 ఎంపిటిసి ఈరన్న గౌడ్ పురుగుల మందు తాగి సూసైడ్అటెంప్ట్‌ చేయడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పార్టీ కోసం కష్టపడి స్థానికంగా అవమానాలు ఎదుర్కొంటున్న వాళ్లను ఎమ్మెల్యేలు తమ అనుచరుల కోసం బలి తీసుకుంటున్నారని ఆవేదనలు, అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీ పదవుల ఆశచూపిన ఎమ్మెల్యేలు, కీలకనేతలు తీరా పార్టీ గెలిచాక తమ మనుషులను కుర్చీల్లో కూర్చోబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

వైసీపీకి గుడ్‌బై చెబుతున్న నేతలు..! 

పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పదవుల విషయంలో వైసీపీ నాయకులు కుట్రలు, అన్యాయాన్ని భరించలేక ఇక ఇక్కడ ఉండలేమని కొందరు అధికార పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. గోస్పాడు మండలం రాయపాడు గ్రామానికి చెందిన వైసీపి నాయకులు.. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సమక్షంలో టిడిపిలో చేరి పసుపు కండువ కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలు బహిష్కరించినప్పటికీ స్ధానిక పరిస్థితులను బట్టి జిల్లాలో చాలా చోట్ల టిడిపి మద్దతుదారులు పరిషత్ ఎన్నికల బరిలో నిలిచారు.

కారణమేంటో..!

రాష్ట్రంలోని 13 జిల్లాలో టీడీపీకి వచ్చిన స్థానాల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 105 చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. దీనికి కారణం వైసీపీలో నెలకొన్న వర్గపోరే కారణమనే చర్చ జరుగుతోంది. పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పదవులు ఆశించి.. పదవులు రాక చాలా మంది నిరాశ నిసృహలో కొట్టుమిట్టాడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఇమడలేక పోతున్న నేతలు ఇక్కడే ఉండి అవమానా లు భరించడం కంటే పక్క పార్టీలోకి వెళ్లడం ఉత్తమమని అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన వైసీపీ జిల్లా నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారట. మొత్తం మీద పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీకి వలసల ఫీవర్ పట్టుకుందనే  చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.


ఇవి కూడా చదవండిImage Caption