ఏబీఎన్ స్ట్రింగ్ ఆపరేషన్‌.. వెలుగులోకి నివ్వెరపోయే నిజాలు

ABN , First Publish Date - 2021-02-24T00:34:15+05:30 IST

భ్రూణ హత్యలు మహాపాపం అని ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొన్ని ఆస్పత్రులు అడ్డగోలుగా..

ఏబీఎన్ స్ట్రింగ్ ఆపరేషన్‌.. వెలుగులోకి నివ్వెరపోయే నిజాలు

హైదరాబాద్: భ్రూణ హత్యలు మహాపాపం అని ప్రభుత్వాలు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొన్ని ఆస్పత్రులు అడ్డగోలుగా వ్యహరిస్తున్నాయి. కాసులు కోసం విచ్చలవిడిగా అబార్షన్స్‌ను చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో నిర్వహించిన ఏబీఎన్ స్ట్రింగ్ ఆపరేషన్‌లో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయి. 


ఎలాంటి అనుమతులు లేకుండా కడుపులో ఉన్న పిండాన్ని తీసేడాన్ని హత్యగానే చట్టం పరిగణిస్తుంది. కడుపులో ప్రాణాన్ని అక్రమంగా చిదిమేస్తే కఠిన చర్యలుంటాయి. అయితే అన్ని తెలిసి కూడా కొన్ని ఆస్పత్రులు కాసుల కోసం పాపాలకు ఒడిగడుతున్నాయి. కడుపులో పిండాలను సైతం చంపేస్తున్నాయి. హైదరాబాద్ అడ్డాగా ఈ అక్రమాల గుట్టు రట్టు చేసింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘా టీమ్. 


అంబర్‌పేట తిల‌నగర్‌లోని కృష్ణారావు ఆస్పత్రిలోకి ఎంటరైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిఘా టీమ్ అక్కడి నర్స్‌కు పలు ప్రశ్నలు సంధించింది. ఆ నర్సు ‘‘ రేపు ఉదయం మరోసారి రండి. ఫస్ట్ మీరొచ్చి మాట్లాడండి. తర్వాత పాపను తీసుకురావొచ్చు. మీది వేరే ఏరియా కాబట్టి.. ఈ ఏరియాలో మీ వాళ్లు ఎవ్వరూ ఉండరు. టెన్షన్ పడొద్దు. 24 గంటలు ఉంటే చాలు. 10 నుంచి 15 వేలు సిద్ధం చేసుకొండి.’’ అని చెప్పారు. 


ఇక నల్లకుంటలోని ఆస్పత్రిలో కూడా విచ్చలవిడిగా అబార్షన్ చేసేస్తున్నారు. సరిగ్గా కృష్ణారావు ఆస్పత్రి సిబ్బంది చెప్పినట్లే ఇక్కడి సిబ్బంది కూడా అదే మాట చెప్పారు. రూ. 25 వేలు ఖర్చు అవుతుందని, మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిందేనని అక్కడి ఆయా చెప్పుకొచ్చారు. 


రామంతపూర్ మ్యాట్రిక్స్ ఆస్పత్రిలోనూ ఇదే దందా నడుస్తోంది. అపాయింట్మెంట్ లేనిదే ఆస్పత్రిలోకి అనుమతించేది లేదని చెప్పిన సిబ్బంది..జనరల్ ఫిజీషియన్‌ను కలవండని ఓ ఉచిత సలహా ఇచ్చారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు అబార్షన్ చేయాలని చెప్పడంతో అక్కడ కూడా ఇది తప్పు అనే మాటే చెప్పకపోగా రూ. 30 వేలు ఖర్చు అవుతుందన్నారు. 


అనుమతులతో అబార్షన్ చేయాల్సిన వైద్యులు ఇదే అదునుగా భారీగా డబ్బులు వసూళ్లు చేసి గుట్టు చప్పుడు కాకుండా కడుపులోనే ప్రాణాన్ని చిదిమేస్తున్నారు. ఆస్పత్రులపై ప్రభుత్వ నిఘా కొరవడడం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. 


Updated Date - 2021-02-24T00:34:15+05:30 IST