Greater Hyderabadలో ట్యాంకులెంత శుభ్రం.. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో సంచలన విషయాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2021-12-09T13:40:14+05:30 IST

భాగ్యనగరంలోని రాంనగర్‌ డివిజన్‌ పరిధిలోని పదికి పైగా బస్తీలకు నీళ్లందించే వాటర్‌ ట్యాంక్‌ అది...

Greater Hyderabadలో ట్యాంకులెంత శుభ్రం.. ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో సంచలన విషయాలు వెలుగులోకి..

  • రాంనగర్‌ ఘటనతో ఉలిక్కిపడ్డ నగరం
  • వాటర్‌బోర్డు నీటిపై భయాందోళన
  • 45 రోజులుగా ట్యాంకులో శవం
  • నీటి నాణ్యతలో నగరం ఉత్తమమే
  • నిర్వహణలో బయటపడుతున్న డొల్లతనం
  • పలు ప్రాంతాల్లో సెక్యూరిటీ కరువు
  • నిర్వహణలో ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ విఫలం


భాగ్యనగరంలోని రాంనగర్‌ డివిజన్‌ పరిధిలోని పదికి పైగా బస్తీలకు నీళ్లందించే వాటర్‌ ట్యాంక్‌ అది. అందులో మంగళవారం శవం బయటపడింది. ఆ వ్యక్తి మాయమై 45 రోజులు అవుతోంది. ఆ రోజే చనిపోయినట్లయితే.. అప్పటి నుంచీ అవే నీళ్లు బస్తీవాసులకు సరఫరా అవుతున్నాయి. బస్తీవాసులు ఆ నీటినే తాగారు. ఇంటి అవసరాలకూ వినియోగించారు. ఇప్పుడు శవం విషయం బయటపడడంతో వారంతా కలవరానికి గురి అవుతున్నారు. అంతకుముందు మరో రిజర్వాయర్‌లో క్షుద్రపూజల పేరుతో వివిధ రకాల పదార్థాలను కలిపారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని తాగునీటి రిజర్వాయర్లు ఎంత వరకు సురక్షితంగా ఉన్నాయనే దానిపై ‘ఆంధ్రజ్యోతి’ బృందం పరిశీలన చేసింది. పలు ప్రాంతాల్లో రిజర్వాయర్ల భద్రతలో డొల్లతనం బహిర్గతమైంది.


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ పరిధిలోని ప్రాంతాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వాటర్‌బోర్డు తాగునీటిని సరఫరా  చేస్తోంది. జలాశయాల నుంచి రోజూ 2,344 మిలియన్‌ లీటర్ల నీటిని నగరంలో ఉన్న సుమారు 300కు పైగా రిజర్వాయర్లకు తరలిస్తారు. శుద్ధి చేసిన నీళ్లే రిజర్వాయర్లలోకి చేరతాయి. అక్కడి నుంచి నగరవాసులకు సరఫరా అవుతాయి. అయితే కొన్ని రిజర్వాయర్ల వద్ద భద్రత లేకపోవడంతో నీళ్లు కలుషితంగా మారుతున్నాయి. తాగునీటి పైపులైన్లలోనే కాకుండా, రిజర్వాయర్లలో కూడా వ్యర్థాలు, విష పదార్థాలు చేరుతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో నీళ్లు నాణ్యమైనవంటూ ఇటీవల దేశవ్యాప్తంగా జరిపిన సర్వేలో ఓ సంస్థ వెల్లడించింది. కానీ ఆపరేషన్‌ మెయింటెనెన్స్‌ విభాగం నిర్లక్ష్యం నిర్వహణ గాడితప్పుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.


ఈతకొట్టి చనిపోయినా..?

సైదాబాద్‌ డివిజన్‌ వెంకటాద్రినగర్‌ రిజర్వాయర్‌ వద్ద సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో రాత్రి వేళలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఈ క్రమంలో రిజర్వాయర్‌ వద్ద ఆరేళ్ల క్రితం కొందరు యువకులు తాగిన మత్తులో నీళ్ల ట్యాంకులో  ఈత కొట్టేందుకు దిగారు. ఒకరు మృతి చెందాడు. అధికారులు స్పందించి ట్యాంకులోకి ఇతరులు వెళ్లకుండా తలుపులు ఏర్పాటు చేశారు. త ర్వాత రిజర్వాయర్‌ నిర్వాహణ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. 1.88 మిలియన్‌ గ్యాలన్ల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌ వద్ద భద్రతా చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రిజర్వాయర్‌ ద్వారా సైదాబాద్‌, అక్బర్‌బాగ్‌  డివిజన్‌ ప్రాంతాలు, దిల్‌సుఖ్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా జరుగుతోంది. ఇక్కడ ముగ్గురు లైన్‌మన్లు షిఫ్ట్‌ల వారీగా పని చేస్తున్నారు. సిబ్బంది కొరతతో వీరే పంపు ఆపరేటర్లుగా, ఫిట్టర్లుగా, లీకేజీని అరికట్టే కార్మికులుగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. దీంతో వారి పై పని భారం పెరిగింది. రిజర్వాయర్‌ వద్ద భద్రత కరువైంది.


పాతబస్తీలోనూ..

పాతబస్తీలోని పలు రిజర్వాయర్ల వద్ద ఎలాంటి భద్రతా లేదు. రాత్రివేళల్లో రిజర్వాయర్ల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా పట్టించుకునేవారు లేరు. రియాసత్‌నగర్‌ రిజర్వాయర్‌ వద్ద కూడా అదే పరిస్థితి. బాలాపూర్‌ రిజర్వాయర్‌కు రెండు వైపులా ఎత్తైన చెట్లు ఉన్నాయి.  మెట్ల మార్గంలో పైకి ఎక్కడంతో పాటు చెట్ల ద్వారా పైకి వెళ్లేందుకు అవకాశాలున్నాయి. అలియాబాద్‌ రిజర్వాయర్‌ వద్ద భద్రతా సిబ్బంది లేరు. రిజర్వాయర్‌లోకి ఎవరు పడితే వారు రాకపోకలు సాగిస్తున్నారు. మలేషియన్‌ టౌన్‌షిప్‌ ఎదురుగా కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌ పేరుతో నిర్మించిన రెండు రిజర్వాయర్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. వాచ్‌మన్‌ లేడు. రిజర్వాయర్ల డోర్లు పగిలిపోయి ఉన్నాయి. కొత్తపేటలోని హుడా కాంప్లెక్స్‌ వాటర్‌ ట్యాంక్‌లోనూ భద్రత కరువైంది.


నారాయణగూడ డివిజన్‌లో..

జలమండలి నారాయణగూడ డివిజన్‌ పరిధిలోని ముషీరాబాద్‌, అంబర్‌పేట నియోజకవర్గాలలోని వాటర్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, పంపింగ్‌ హౌస్‌ల వద్ద రక్షణ చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. వాచ్‌మన్‌లు లేరు. గేట్లకు రక్షణ లేదు. గేట్లున్న చోట్ల తాళాలు లేవు. దీంతో ఆ పరిసరాలను అసాంఘిక శక్తులు అడ్డాగా చేసుకుంటున్నాయి.


ముందే ఫిర్యాదు.. అయినా

రిసాలగడ్డ వాటర్‌ట్యాంక్‌ నుంచి రోజూ లక్ష లీటర్ల నీటిని ఎస్‌ఆర్‌కేనగర్‌, శివస్థాన్‌పూర్‌, హరినగర్‌, పద్మశాలీ సంఘం, రిసాలగడ్డ తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. నీటిలో దుర్వాసన వస్తోందని, వెంట్రుకలు, ఇతర వ్యర్థాలు వస్తున్నాయని కొద్దిరోజులుగా వినియోగదారులు జలమండలి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. పట్టించుకోక పోవడంతో పదిహేను రోజుల క్రితం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ కె.రవిచారిలకు ఫిర్యాదు చేశారు. వారు సమస్యను జలమండలి డీజీఎం, మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 8, 9 తేదీల్లో నగరానికి నీటి సరఫరా లేకపోవడంతోఅధికారులు వాటర్‌ ట్యాంక్‌ను శుభ్రపరిచేందుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ట్యాంకులో కుళ్లిన శవం బయటపడింది. ఇప్పుడు మేల్కొన్న అధికారులు బస్తీలలో హెల్త్‌ క్యాంపులు, ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.


వాటర్‌ ట్యాంకులో శవం బయటపడడంతో అక్కడ లభించిన చెప్పుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్‌  19న తాగిన మైకంలో కిషోర్‌ స్నేహితుడు మధు ఇంటి నుంచి అతడి సోదరుడు శివ చెప్పులను వేసుకుని అంబేడ్కర్‌నగర్‌లోని ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు శివ తన చెప్పుల కోసం కిషోర్‌ ఇంటికి వచ్చాడు. చెప్పులు ఇవ్వాలని, లేకపోతే కొత్తవి కొనివ్వాలని కిషోర్‌ కుటుంబసభ్యులను ఒత్తిడి చేశాడు. ‘కిషోర్‌ కనిపించడం లేదు. రాగానే చెప్పులు ఇప్పిస్తాం. లేకపోతే కొత్తవి ఇస్తాం’ అని మృతుడి సోదరి కల్పన శివకు చెప్పింది. తాజా ఘటనలో పోలీసులు చూపించిన చెప్పులను శివవని తెలిపింది. దీంతో ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆ చెప్పులను తీసుకుని కృష్ణానగర్‌లో మధు, శివ ఉంటున్న ఇంటికి బుధవారం వెళ్లారు. చెప్పులను పరిశీలించిన శివ తనవేనని చెప్పాడు. దీంతో చనిపోయిన వ్యక్తి కిషోర్‌గా నిర్ధారించారు. మధును అదుపులోకి తీసుకుని సమగ్ర  విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కిషోర్‌ మృతదేహం ట్యాంకులో పడి దాదాపు 45 రోజులు కావస్తోందని పోలీసులు అంచనాకు వచ్చారు.


స్నేహితుడి చెప్పులతో..

వాటర్‌ ట్యాంకులో శవంగా తేలిన వ్యక్తి వివరాలను ఘటనాస్థలిలో దొరికిన చెప్పుల ఆధారంగా పోలీసులు గుర్తించారు. అంబేడ్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న పుష్ప పెద్ద కుమారుడు కిషోర్‌గా గుర్తించారు. ఆమెకు మరో కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కల్పన రాంగోపాల్‌పేట పీఎస్‌లో హోంగార్డుగా పని చేస్తోంది. కిషోర్‌ కొంత కాలంగా మద్యం, గంజాయిలకు బానిసగా మారాడు. అక్టోబర్‌ 19న మద్యం తాగి కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న మధుతో కలిసి ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులు అతడిని మందలించారు. కిషోర్‌ కోపంగా ఇంటి నుంచి  వెళ్లిపోయాడు. అప్పటి నుంచీ తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వెదికినా ఆచూకీ లభించలేదు. 23న చిక్కడపల్లి పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-12-09T13:40:14+05:30 IST