YS Jagan : బాబాయ్ కర్చీఫ్‌ వేశా.. త్వరగా వచ్చెయ్‌.. నేనుండగా టెన్షన్ ఎందుకు..!?

ABN , First Publish Date - 2021-08-03T19:55:53+05:30 IST

ప్రభుత్వం పిలిచి బొట్టుపెడుతుంటే పక్కకెళ్లి తూడ్చుకుంటున్నాడట....

YS Jagan : బాబాయ్ కర్చీఫ్‌ వేశా.. త్వరగా వచ్చెయ్‌.. నేనుండగా టెన్షన్ ఎందుకు..!?

ఏపీ సర్కార్‌కు ఆ నామినేటెడ్‌ పోస్టు భర్తీ చేయడం అంటే దేవుడు కనిపిస్తున్నాడట. ఓ పెద్దాయనను చైర్మన్‌ పదవిలో కూర్చోబెడుతామని ప్రభుత్వం పిలిచి బొట్టుపెడుతుంటే పక్కకెళ్లి తూడ్చుకుంటున్నాడట. మరోవైపు అక్కడ సభ్యులయ్యేందుకు దేశమంతా పోటీ పడుతోంటే టెన్షన్‌ తట్టుకోలేక వాయిదా పద్దతుంది దేనికైనా అనుకుంటోందట. పదవుల పందేరం పూర్తిచేయడంతో పోస్టుదక్కని వారందరి కన్నూ అక్కడే ఉండటంతో సర్కార్‌కు వస్తున్న కొత్త చిక్కులు ఏంటో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


జంబో టీమ్ రెడీ..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే క్రేజీ పోస్టు టీటీడీ చైర్మన్‌ పదవి. అందులో సభ్యులుగా ఉంటేచాలు అనుకునేవారు కోకొల్లలు. విపరీతమైన పోటీ ఉండటంతో ఇప్పటికే సభ్యుల సంఖ్యను విపరీతంగా పెంచిన జగన్‌ సర్కార్‌ టీటీడీని జంబో టీమ్‌గా తయారుచేసిపెట్టింది. ఇప్పుడు సభ్యుల సంఖ్యను మరింత పెంచితే భక్తుల నుంచి, విపక్షాల నుంచి విమర్శలు  వస్తాయని భయపడుతున్న ప్రభుత్వం మరింత కాలయాపన చేసేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.


అమెరికా నుంచి వచ్చే వరకూ ఖాళీనే!

చైర్మన్‌ ఎంపికలో సీఎం జగన్‌ క్లారిటీగా ఉన్నట్లు సమాచారం. తన బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డికే మరోసారి ఆ పదవి కన్‌ఫాం చేశారట సీఎం జగన్‌ రెడ్డి. అయితే పెద్దాయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు మొగ్గుచూపుతుండటంతో ఆయన్ని బుజ్జగించాల్సివస్తుందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కారణమేదైనా వైవీ సుబ్బారెడ్డి అమెరికా వెళ్లిపోవడంతో ఆయన వచ్చేవరకు టీటీడీ చైర్మన్‌ పదవి ఖాళీకానే ఉంటుందనే విషయం ఖాయమైపోయింది. వైవీ సుబ్బారెడ్డికి చైర్మన్‌ పదవి ఫిక్స్‌ అని నమ్ముతున్న లీడర్లు, క్యాడర్‌ 137 కార్పొరేషన్లకు చైర్మన్లు ప్రకటించినప్పుడే టీటీడీ చైర్మన్‌ గారికి శుభాకాంక్షలు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం ముమ్మరం చేశాయి.


ఇటు బాలినేని.. అటు విజయసాయి హవాతో..!

వైవీ సుబ్బారెడ్డికి సిట్టింగ్‌ ఎంపీ సీటు ఇవ్వని జగన్‌.. చివరకు టీటీడీ చైర్మన్‌గా తిరుమలలో కూర్చోబెట్టారు. అయితే ఆయనకు అమరావతిలో కాని, హస్తినలో కాని చక్రం తిప్పాలనే కోరిక బలంగా ఉన్న విషయాన్ని బయటపెట్టారు. నేరుగా జగన్‌కు బహిరంగంగా కార్యకర్తలకు ఇప్పటికే  వైవీ చెప్పేశారు. తన జిల్లాలో జగన్‌ మరో బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవిలో ఉండటం, ఎంపీ హోదాలో ఢిల్లీ లెవల్లో విజయసాయిరెడ్డి హవా కొనసాగుతుండటంతో పార్టీలో తన పరిస్థితి ఏంటనే డైలామా వైవీ సుబ్బారెడ్డిలో వచ్చినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవిలో కూర్చుంటే మున్ముందు రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదని కలతతో ఆయన ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.


నేనుండగా టెన్షన్ ఎందుకు..!?

అయితే వైవీలోని ఆందోళనను గమనించిన సీఎం జగన్‌.. బాబాయ్‌ నేను నీకుండగా టెన్షన్‌ ఎందుకు? వేరొకరిని కొండపై కూర్చోబెట్టుడెందుకు అనేలా కన్విన్స్‌ చేసి మొత్తానికి టీటీడీ చైర్మన్‌గా ఆయన్నే మళ్లీ ఫిక్స్‌ చేశారట. వైవీ అమెరికా నుంచి వచ్చీ రావడంతో చైర్మన్‌ పోస్టును భర్తీ చేస్తారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది.


జంబో లెక్కలు ఇవీ..!

మొత్తానికి టీటీడీ చైర్మన్‌ పదవిపై సీఎం జగన్‌కు టెన్షన్‌ తప్పినా సభ్యుల విషయంలోనే తలనొప్పి తప్పడం లేదట. ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ నాయకులకే కాదు ఇటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చే సిఫార్సులను సర్దుబాటు చేయడానికి ఇబ్బంది పడాల్సివస్తోందట. కేంద్రమంత్రులు సైతం తమ మనుషులకు సభ్యులుగా అవకాశం కల్పించాలని సిఫార్సులు చేస్తున్నారట. ఒత్తిళ్లను తట్టుకునేందుకు గాను ఇప్పటికే గత పాలకవర్గంలో సభ్యుల సంఖ్యను 18 నుంచి 37కి పెంచి జంబో పాలకమండలిని తీసుకొచ్చారు. రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవులన్నీ పూర్తి చేయడంతో అక్కడ పదవులు దక్కనివారు టీటీడీలో చోటు కల్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారట. దీంతో మరోసారి పాలకమండలి సభ్యులను పెంచితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారట. భక్తుల నుంచి విపక్షాల నుంచి జంబో పాలకమండలిపై వస్తున్న విమర్శలు గుర్తుకువచ్చి వామ్మో ఎట్టి పరిస్థితుల్లో సభ్యుల సంఖ్య పెంచే పని చేయొద్దని అనుకుంటున్నారట.


ఎలాగోలా ట్యూన్ చేసి..!

వీలైతే మంత్రి పదవి లేదంటే రాజ్యసభ ఇవ్వాలని పట్టుబట్టిన వైవీ సుబ్బారెడ్డిని ఎలాగోలా ట్యూన్‌చేసి చైర్మన్‌గిరీపై కూర్చోబెడుతున్న జగన్‌ ముందుగా ఆ పోస్టు భర్తీ చేయాలనుకుంటున్నారట. ఆ తర్వాత వీలును బట్టి సభ్యుల నియామకం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తాడేపల్లి నుంచి లీకులు వస్తున్నాయట. పాలకమండలి సభ్యత్వం కోసం వస్తున్న లిస్టుల్ని ఎన్నిసార్లు వడపోస్తున్న 70 వరకు తగ్గడం లేదట. కొండపై కుర్చీలేమో 37 మాత్రమే ఉన్నాయి. దీంతో ఒత్తిళ్లు చేస్తున్నవారిపైనే పరిస్థితి వివరించి తప్పుకునేలా చేసి చివరికి మిగిలిన వారికి పదవులు కట్టబెట్టాలని చూస్తున్నారట సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.



Updated Date - 2021-08-03T19:55:53+05:30 IST