ఎప్పుడూ ప్రజల పక్షానే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

ABN , First Publish Date - 2021-10-15T03:17:31+05:30 IST

అవసరం వచ్చిన ప్రతిసారీ ప్రజల గొంతుక అవుతోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. సందర్భాన్ని బట్టి అసలైన ప్రతిపక్షం తానే ..

ఎప్పుడూ ప్రజల పక్షానే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

అవసరం వచ్చిన ప్రతిసారీ ప్రజల గొంతుక అవుతోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. సందర్భాన్ని బట్టి అసలైన ప్రతిపక్షం తానే అవుతోంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అయినా.. ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అయినా బాధ్యతలను భుజానికెత్తుకుంటోంది. ప్రజాస్వామ్యంలో మూడో మూల స్తంభం విధులు నెరవేరుస్తోంది. అధికారంలో ఎవరున్నా, ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నా.. ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. 


ఏబీఎన్‌ ఎవరికీ భయపడదు. ఎలాంటి కథనం ప్రసారం చేయడానికైనా వెనుకాడదు. ఎవరి గుట్టును బయట పెట్టడానికైనా జంకు చూపించదు. ఏ ఉన్నతాధికారి తప్పు చేసినా, ఏ వ్యవస్థల్లో పొరపాట్లు దొర్లినా ఉన్నది ఉన్నట్లు, నిజమైన, నిఖార్సైన కథనాలను ప్రసారం చేస్తుంది. ఆధారాలతో సహా బయటపెడుతుంది. అధికారంలో ఉన్నవాళ్ల తప్పులను ఎత్తిచూపుతుంది. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతుంది. అదే సమయంలో బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. 


ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొచ్చినా, ప్రభుత్వాల నిర్ణయాలతో ఏ సమయంలో ఎవరికి కష్టాలు ఎదురైనా, పాలసీల పేరుతో ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఏబీఎన్‌ ధైర్యంగా రిపోర్ట్‌ చేస్తుంది. ఉన్నది ఉన్నట్లు ప్రజల్లోకి తీసుకెళ్తుంది. నూటికి నూరుశాతం వాస్తవాలను ప్రసారం చేస్తుంది. సమస్యల పరిష్కారానికి బాధితుల తరపున వకాల్తా పుచ్చుకుంటుంది. బాధితులకు న్యాయం జరిగేదాకా అండగా నిలుస్తుంది. 


ఛానెల్‌ ఆవిర్భావం నుంచీ ఎన్నో, ఎన్నెన్నో కుంభకోణాలను వెలికి తీసింది. మరెన్నో స్టింగ్‌ ఆపరేషన్లు నిర్వహించి అనేక మంది అరాచకుల గుట్టును ప్రపంచానికి చూపించింది. అక్రమాలను దనుమాడింది. మోసాలను ఎండగట్టింది. నేరస్తులను చట్టానికి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టించింది. అది ప్రైవేటు సంస్థ అయినా.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా దేనికీ మినహాయింపు ఇవ్వలేదు. ఉన్నతాధికారి అయినా, ఉన్నతస్థాయిలో చక్రం తిప్పే వాళ్లయినా కూడా ఎవరినీ వదిలిపెట్టలేదు. అరాచకాలు, అక్రమాల గురించి ఉప్పందితే చాలు.. కెమెరా కన్నుతో వాలిపోయింది. కంత్రీగాళ్ల భరతం పట్టింది. ఇప్పటికీ ఆ ఒరవడిని వీడలేదు. నిరంతరం ఏబీఎన్‌ కెమెరా కన్ను తెరుచుకొనే ఉంటుంది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్‌ నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయిన సందర్భంలో, ఆ సంధికాలంలో జరిగిన పరిణామాలకు సాక్షీభూతం అయ్యింది. ఇటు.. తెలంగాణ ఉద్యమాన్ని, అటు.. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సమతూకంతో రిపోర్ట్‌ చేసింది. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయకుండా ఉన్నది ఉన్నట్లు.. తెలుగు వాళ్లందరి పక్షానా నిల్చుంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. తెలంగాణ జనం భావోద్వేగాలను ఓవైపు చూపిస్తూనే.. సమైక్యాంధ్ర నినాదంతో సాగించిన ఆంధ్రా ప్రజల ఆందోళనలకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితంగా ఇరు రాష్ట్రాల్లోనూ ప్రజల్లో, వీక్షకుల్లో విశ్వసనీయ స్థానాన్ని సంపాదించుకుంది ఏబీఎన్‌.


తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. స్వరాష్ట్ర ఆకాంక్షలను, ఆశయాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరిస్తున్నప్పుడు ఏబీఎన్‌ సర్కారు బాధ్యతలను గుర్తు చేసింది. విపక్షాలు, ప్రజాసంఘాలు, తెలంగాణ ఉద్యమ సంఘాల పక్షాన నిలబడి నిలదీసింది. ఆ క్రమంలో ప్రభుత్వం కక్షగట్టినా, కన్నెర్రజేసినా ఏబీఎన్‌ అదరలేదు, బెదరలేదు. ఫలితంగా కావాలని ఇబ్బందులకు గురిచేసినా ఏనాడూ వెన్ను చూపలేదు. ధైర్యంగా రొమ్ము విరుచుకొని నిలబడింది, తలపడింది. చివరకు గెలిచింది. 


ఇదే విధంగా అటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ మొదటినుంచీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తూనే ఉంది. తెలుగుదేశం హయాంలో పలు లోపాలను, ప్రభుత్వం పొరపాట్లను ఎత్తిచూపింది. బెజవాడ దుర్గమ్మ గుడిలో క్షుద్రపూజల బండారాన్ని మొట్టమొదటగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.. ప్రపంచానికి చెప్పింది. కోట్లాది మందికి ఇలవేల్పు అయిన కనకదుర్గమ్మ క్షేత్రంలో క్షుద్రపూజల పేరిట అపచారం చోటుచేసుకున్న వ్యవహారంపై వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలను ఎండగడుతోంది.


ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆర్భాటంగా శంకుస్థాపన చేసుకున్న రాజధాని నగరం అమరావతిని అనాథగా మారుస్తున్న వైసీపీ సర్కారు తీరును ఏబీఎన్‌ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తోంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడుతోంది. అమరావతి ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. కోట్లాది మంది కలల రాజధానిగా రూపుదిద్దుకోవాల్సిన దశలో ఉన్న అమరావతిని అసలు మనుగడలో లేకుండా చేస్తున్న వ్యూహాలను తిప్పికొడుతోంది. అమరావతి రైతులు ఉద్యమించిన ప్రతిసారీ ప్రజల గొంతుక అవుతోంది. అమరావతి రైతుల భరోసా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అని గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. 


పోరాటాల ఫలితమైన విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా కనుమరుగయ్యే ప్రమాదం పొంచిఉన్న నేపథ్యంలో ఉక్కు ఉద్యమానికీ ఏబీఎన్‌ అండగా నిలుస్తోంది. 'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అని మరోసారి నినదిస్తోంది. విశాఖ ఉక్కు పరిరక్షణకోసం పోరాడుతున్న రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ఉద్యమ సంఘాలకు, ఉద్యోగుల అసోసియేషన్లకు అనుకూలంగా వార్తా కథనాలు ప్రసారం చేస్తోంది. ప్రభుత్వ రంగంలో విజయవంతంగా కొనసాగుతున్న పరిశ్రమను ప్రైవేటుకు అప్పగిస్తే ఎలాంటి పరిణామాలుంటాయో ప్రత్యేక కథనాల ద్వారా చూపించడమే కాదు.. హెచ్చరిస్తోంది. ప్రత్యేక చర్చలు చేపడుతోంది. ద డిబేట్‌లో ప్రముఖంగా పలుసార్లు నిలదీసింది.


ఆంధ్రప్రదేశ్‌ను రుణాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్న వైసీపీ ప్రభుత్వం చర్యలు, నిర్ణయాలపై ఏబీఎన్‌ ఎప్పటికప్పుడు కథనాలను ప్రసారం చేస్తోంది. ఈ విషయంలో ఒకరకంగా ప్రతిపక్షాల కంటే ఓ అడుగు ముందే ఉంటోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ఆధారాలతో సహా వార్తా కథనాలు అందిస్తోంది. దీంతో, విపక్షాలే కాదు.. సొంత పార్టీ నేతలే వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలపై కన్నెర్ర జేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు జాప్యం కావడంపై కొద్దినెలలుగా నిరంతర వార్తా కథనాలను ప్రసారం చేస్తోంది. ఏపీలో ఆర్థిక ఇబ్బందులను, ఆర్థిక శాఖ పడుతున్న కష్టాలను ఎప్పటికప్పుడు ప్రజలముందుకు తీసుకువస్తోంది ఏబీఎన్‌. ఏపీ సర్కారు ఇబ్బడిముబ్బడిగా చేస్తున్న అప్పులతో రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారంటూ సామాజిక బాధ్యతగా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. దీనికి రాజకీయ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బాధ్యతలను గుర్తెరిగి రాష్ట్రప్రయోజనాలే లక్ష్యంగా కథనాలను వెలువరిస్తోందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం.


హైదరాబాద్‌లో యేళ్ల తరబడి రోడ్లమీద ట్రాఫిక్‌జామ్‌లకు కారణమవుతున్న ఫ్లై ఓవర్ల నిర్మాణాలు ఆలస్యం కావడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసంపూర్తిగా ఉన్న ఫ్లై ఓవర్ల చిట్టాను ప్రజల ముందుంచి.. ప్రభుత్వం అలసత్వాన్ని, అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎండగడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల కొండమీద ఆధ్యాత్మికత, భక్తి పేరిట జరుగుతున్న అన్యాయాలను కూడా బయటపెట్టింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్లు అల్లకల్లోలం చేసినప్పుడు, వరదలు ముంచెత్తినప్పుడు బాధితుల ఆర్తనాదాలను నిరంతరాయంగా వినిపించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టేలా, సర్వం కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా డ్రైవ్‌లు చేపట్టింది. అసవరం ఉన్నప్పుడల్లా చేపడుతూనే ఉంది. 


రాష్ట్రాల హక్కులు హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలు, కొత్త నిర్ణయాలను ప్రశ్నించింది ఏబీఎన్‌. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి పెద్దపీట వేసింది. దేశ రాజధానిని చుట్టుముట్టిన అన్నదాతల ఆక్రోశాన్ని  ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చూపించింది. అదే సమయంలో రైతుల డిమాండ్లు నెరవేర్చే విషయంలో అలసత్వం వహించస్తున్న కేంద్రప్రభుత్వం తీరును నిలదీసింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పడ్డ కష్టాలు, రోడ్లమీదే నెలల తరబడి జీవనం సాగించి ప్రభుత్వంపై తమ అసంతృప్తిని, నిరసనను వెల్లగక్కిన అన్నదాతల ఆవేదనను ప్రత్యక్షంగా చూపించింది.


ఇక, మొన్నటికి మొన్న అఫ్ఘానిస్తాన్‌ పరిణామాలను అనుక్షణం వీక్షకుల చెంతకు చేర్చింది. కెమెరాలకు చిక్కిన ఏ దృశ్యాన్నీ వదలకుండా అంతర్జాతీయ స్థాయి మీడియాతో పోటీ పడింది. తాలిబన్ల అరాచకాలనే కాదు.. అఫ్ఘానిస్తాన్‌ ప్రభుత్వం వైఫల్యాలు, ఆ దేశాన్ని, ఆ దేశ ప్రజలను నడిసంద్రంలో చుక్కాని లేకుండా వదిలేసిన అమెరికా వైఖరినీ తీవ్రస్థాయిలో ఎండగట్టింది. ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. విశ్లేషణలతో కూడిన స్పెషల్‌ ఫోకస్‌లను ప్రేక్షకుల దరికి చేర్చి.. జనంలో ఆలోచనను రేకెత్తించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. 


తన దృష్టికి వచ్చిన ఏ వార్త అయినా, తన నెట్‌వర్క్‌ చెంతకు చేరిన ఏ సమస్య అయినా, తనకు ఉప్పందిన ఏ కుంభకోణం అయినా ఏమాత్రం అలసత్వం వహించదు ఏబీఎన్‌. సామాజిక బాధ్యతే ఏకైక లక్ష్యంగా తన ప్రస్థానం సాగిస్తోంది. తెలుగు జర్నలిజం రంగంలో తనదైన ప్రత్యేకతను ఇలాగే కొనసాగిస్తూనే ఉంటుంది. 


సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-10-15T03:17:31+05:30 IST