Abn logo
Sep 6 2021 @ 14:58PM

Telugudesam కు కీలక నేత రాజీనామా.. హైకమాండ్ సీరియస్.. కార్యకర్తల్లో కొత్త చర్చ.. సీనియర్ నేతల్లో ఆందోళన!

ఆ జిల్లాలో ప్రతిపక్ష నేతలంతా ఏకతాటిపై ముందుకు వెళ్తున్న వేళ.. సదరు పార్టీలో అలజడి రేగింది. పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఒక్క నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూడా హాజరు కాకపోవడం, ఓ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ రాజీనామా చేయడం జిల్లా పార్టీ శ్రేణులను కంగారెత్తించింది. పార్టీలో అసలేం జరుగుతుందో అర్థంకాక వారు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఇంతకీ ఆ జిల్లా ఏది? అక్కడ ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నది ఎవరు..? ఆ జిల్లాలో పార్టీని తిరిగి గాడిలో పెట్టే ట్రబుల్‌ షూటర్‌ ఎవరు..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.

పునర్వైభవ దిశగా వడివడిగా అడుగులు!

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ స్ధానాలుగా విభజించి ఇద్దరిని అధ్యక్షులుగా నియమించింది ఆ పార్టీ నాయకత్వం. బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులుగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులుగా నూకసాని బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల పార్లమెంట్ స్థానానికి సంబంధించిన నాలుగింటిలో అద్దంకి, పర్చూరు, చీరాల స్ధానాలను గెలుచుకోగలిగింది. అనూహ్యంగా చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం పార్టీని వీడినప్పటికీ నియోజకవర్గంలో కార్యకర్తలకు కొదవ లేకపోవటంతో ఆ నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు ఫుల్ స్పీడ్‌గా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం విభిన్న పరిస్ధితి నెలకొంది. ఏడింట ఒక్క కొండేపి నియోజకవర్గంలోనే ఆ పార్టీ విజయాన్ని సాధించగలిగింది. పశ్చిమాన ఉన్న నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినప్పటికీ తిరిగి పునర్వైభవ దిశగా వడివడిగా అడుగులు వేసేందుకు నేతలు పావులు కదపటం.. కార్యకర్తలు వారి అడుగులకు బాసటగా నిలవటంతో ఫుల్ స్పీడ్‌తో ముందుకు వెళ్తుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కార్యకర్తల్లో కొత్త చర్చ!

ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా దామచర్ల జనార్ధన్ నాలుగు పర్యాయాలు పనిచేసిన కాలంలో ఏకతాటిపై ఉన్న అన్నీ నియోజకవర్గాల నేతలు ప్రస్తుత ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ సారథ్యంలో ఆయనతో కలిసి అడుగులు వేయలేకపోతున్నారు. ఇతర నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినా ఒకరి నియోజకవర్గంలోకి మరొకరు వెళ్తూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ పార్టీకి స్పీడ్ పెంచిన నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు.. ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు ఏర్పాటుచేసిన పార్లమెంట్ నియోజకవర్గ తొలి కార్యకర్తల సమావేశానికి అందరూ ఒక్కసారిగా డుమ్మా కొట్టారు. కొత్త కమిటీలు ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం కావడం, నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు ప్రత్యేక ఆహ్వానాలు అందినా.. ఏ ఒక్కరూ సమావేశానికి హాజరు కాకపోవడంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త చర్చ మొదలైంది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నూకసాని బాలాజీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మధ్య సమన్వయం లోపం కారణంగానే పార్టీ పరిస్థితి గందరగోళంగా మారి ఉండవచ్చని భావిస్తున్నారు.

హుకుం జారీ చేయడంతో..!

ప్రస్తుతం జిల్లాకు ఓ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉండగా.. నూకసాని ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గానికి మరో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేశారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఒంగోలు, కొండెపి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి రెండు నియోజకవర్గాలకు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు మాజీ ఎమ్మెల్యేలు ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు. అయితే నూకసాని బాలాజీ ఇంతవరకూ ఆ స్ధాయి పదవిని చేపట్టలేదు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో జరిగే ప్రతీ కార్యక్రమాన్ని ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఆదేశానుసానం ఏర్పాటు చేశామని పత్రికా ప్రకటనలలో సైతం ఇవ్వాలని హుకుం జారీ చేయటం వివాదాస్పదంగా మారింది.

ఆయన రాజీనామా మరింత చర్చ!

దీనికితోడు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి పమిడి రమేష్ తన ఇన్‌ఛార్జ్‌ పదవికి రాజీనామా చేయటం మరింత చర్చనీయాంశం అయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఆయన తన రాజీనామాను అందజేశారు. తాను తన పదవికి న్యాయం చేయలేక పోతున్నట్లు పలువురు ఫిర్యాదులు చేస్తున్నారని, తన పనితీరు పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉండటంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేగాక ఒంగోలు పార్లమెంట్ అధ‌్యక్షుడు నూకసాని బాలాజీపై కూడా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది.

రాజీనామాలు సరికాదు..!

ఒకవైపు ఒంగోలు పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ వ్యవహారం, మరోవైపు దర్శి నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి పమిటి రమేష్‌ రాజీనామా అంశం టీడీపీ హైకమాండ్‌ను సీరియస్‌గా స్పందించేలా చేశాయి. ఏవైనా సమస్యలుంటే చెప్పుకోవాలే కానీ రాజీనామాలు చేయటం సరికాదన్న భావనను పార్టీ అధిష్టానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో అసలేం జరుగుతుందోనని ఆరా తీస్తోంది. ప్రకాశం జిల్లాలో మళ్లీ పుంజుకుంటున్న టీడీపీలో జరుగుతున్న ఇలాంటి పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తాయని సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీలో ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దేందుకు ఎవరు బాధ్యతలు తీసుకుంటారు..? పార్టీ ఇన్‌ఛార్జులతో నూకసానికి సయోధ్య కుదిర్చే ట్రబుల్‌ షూటర్‌ ఎవరు..? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.