Chandrababu కంచుకోటను ఆక్రమించేపనిలో YSRCP.. కంగుతిన్న టీడీపీ.. రంగంలోకి దిగిన అధినేత.. స్పీడ్‌ పెంచిన Peddi Reddy..!?

ABN , First Publish Date - 2021-10-16T18:41:52+05:30 IST

సొంత ఇలాఖా. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఒక విధంగా చెప్పాలంటే అప్రకటిత రాచరిక హోదాకు పెట్టని కోట. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా ప్రత్యర్థులు జెండా రెపరెపలాడించి..

Chandrababu కంచుకోటను ఆక్రమించేపనిలో YSRCP.. కంగుతిన్న టీడీపీ.. రంగంలోకి దిగిన అధినేత.. స్పీడ్‌ పెంచిన Peddi Reddy..!?

సొంత ఇలాఖా. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఒక విధంగా చెప్పాలంటే అప్రకటిత రాచరిక హోదాకు పెట్టని కోట. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా ప్రత్యర్థులు జెండా రెపరెపలాడించి కాలర్‌ ఎగరేస్తారు. రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఓ ముఖ్యమైన నేత ఇప్పుడు సొంత ఇలాఖాపై పునర్‌ వైభవం కోసం వ్యూహాలు రచించాల్సి వస్తోంది. ఇంతకీ ఆ అపర చాణక్యుడు రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడలను ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో తుత్తునియలు చేయగలరా..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఫ్యాన్‌ స్పీడును పెంచే ప్రయత్నంలో పెద్దిరెడ్డి.. వైసీపీ అభ్యర్థిగా సుధీర్‌

కుప్పం మున్సిపాలిటీలో వైసీపీని గెలిపించి చంద్రబాబు ఇమేజ్‌ను తగ్గించేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలకు పదునుపెడుతున్నారు. సామధానభేదదండోపాయలు ప్రయోగించి ఇప్పటికే పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో వైసీపీ గెలవడం అనూహ్య పరిణామం. ఎలా గెలిచాం అన్నది ముఖ్యం కాదు గెలిచామా లేదా అనేది ముఖ్యమని చెప్పుకుంటోంది వైసీపీ. వైసీపీ తరఫున బ్రాహ్మణ సామాజికవర్గానికి డాక్టర్ సుదీర్‌ను మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించేశారు. సొంత ఇలాఖా కుప్పం కోటలో జరిగిన రాజకీయ మార్పులను ఆలస్యంగా తెలుసున్న చంద్రబాబు నాయుడు మున్సిపల్‌ ఎన్నికల్లో తేడా రాకుండా ఉండేందుకు ముందుగానే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన అనగానిపల్లె మాజీ సర్పంచ్ త్రిలోక్‌ను చైర్మన్ అభ్యర్థిగా తెలుగుదేశం ప్రకటించింది.


కుప్పంలో గెలిచి క్రెడిట్‌ కొట్టేసే పనిలో వైసీపీ.. 

అప్పుడో ఇప్పుడో  మున్సిపల్‌ ఎన్నికలు జరగడం ఖాయం. కుప్పాన్ని మున్సిపాలిటీగా చేసిన వైసీపీ అక్కడ గెలిచి  ఆ క్రేడిట్‌ను తమ ఖాతాలా వేసుకోవాలని చూస్తోంది. అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినప్పుడే కుప్పానికి కూడా ఎన్నికలు జరిగితే వేరేలా ప్రత్యేకత ఉండేది కాదేమో. కాని అనూహ్య పరిస్థితుల్లో కుప్పానికి ప్రత్యేకంగా ఎన్నికలు జరిగే పరిస్థితి వచ్చింది. కుప్పానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అటు వైసీసీ, ఇటు టీడీపీ తమతమ చైర్మన్‌ అభ్యర్థిని ప్రకటించి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి.


కోటను ఆక్రమించేపనిలో వైసీపీ.. రంగంలోకి చంద్రబాబు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కుప్పం కోటను ఆక్రమించే పనిలో నిమగ్నమైన విషయాన్ని పసిగట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు సమాచారం. కష్టపడి నిర్మించుకున్న కుప్పంలో స్థానిక ఎన్నికల్లో తేడా వచ్చింది. మున్ముందు జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టు జారకుండా ఉండేందుకు పసుపు జెండా ఎగిరేసేందుకు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగాల్సివస్తోంది.


కుప్పం అంటేనే చంద్రబాబు.. బాబు అంటేనే కుప్పం

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడి రాజకీయ ఎదుగుదలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది కుప్పం నియోజకవర్గం. కుప్పం అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటనే కుప్పం అనేది రాజకీయాలు తెలిసిన ప్రతీఒక్కరు చెప్పుకునే మాట, ఒప్పుకునే మాట. అలాంటి కుప్పం కోటలో  పంచాయతీ, జెడ్పీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరడం మామూలు విషయం కాదు. చంద్రబాబునాయుడిపైన గెలిచినంత సంతోషపడింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ.


కౌన్సిలర్‌ పదవికోసం పోటాపోటీ 

కుప్పంలో చైర్మన్‌ అభ్యర్థులను ప్రకటించిన అధికార, ప్రతిపక్షపార్టీలు వార్డు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కొత్తగా ఏర్పడ్డ కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు వున్నాయి. ఒక్కో వార్డు నుంచి కనీసం ముగ్గురు ..కొన్ని చోట్ల నలుగురు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. 25 వార్డుల్లో 10 మహిళలకు రిజర్వు అయ్యాయి. చైర్మన్‌ స్థానం జనరల్‌కు కేటాయించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పం టీడీపీకి కంచుకోట. బాగా వెనుకబడ్డ ప్రాంతంగా వున్న కుప్పాన్ని చంద్రబాబునాయుడు ఎంతగానో అభివృద్దిలోకి తీసుకొచ్చారు అనేది తెలుగుదేశం నేతలు చెప్పే మాట. చంద్రబాబు నాయుడు అక్కడ రంగంలో ఉన్నప్పటి నుంచి టీడీపీకి ఎదురే లేకుండాపోయింది. ఏఎన్నికల్లో అయినా సరే టీడీపీదే విజయం.కానీ అలాంటి కుప్పం కంచుకోటలో స్థానిక ఎన్నికల్లో అనుహ్యంగా వైసీపీ జెండా ఎగిరింది.


పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న టీడీపీ..

పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలు టీడీపీని ఖంగు తినిపించడంతో మున్సిపల్‌ ఎన్నికల కోసం చంద్రబాబునాయుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సి వస్తుందనే టాక్‌ వస్తోంది. స్థానిక ఎన్నికలు  నేర్పిన గుణపాఠంతో మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు చంద్రబాబు సైతం ముందస్తుగానే టీడీపీ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించేశారు. దీంతో టీడీపీ శ్రేణులు సైతం ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రతివార్డులోను ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ళకు మునుపు కుప్పం ఎలా ఉండేది చంద్రబాబు వచ్చాక ఎలా అభివృద్ది జరిగింది అనే అంశాలను ప్రజల్లోకి టీడీపీ శ్రేణులు బలంగా తీసుకెళ్ళి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.


వైసీపీ పవర్‌లోకి వచ్చాక టీడీపీకి ఇబ్బందులు..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో టీడీపీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. పార్టీ క్యాడర్‌లో మనోధైర్యం బాగా దెబ్బతింది. స్దానికంగా అక్కడ వున్న నియోజకవర్గం పెద్ద నాయకులు, చంద్రబాబు ముఖ్య అనుచరులు సైతం పార్టీపై పెద్దగా దృష్టిపెట్టక పోవడంతో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, నిశ్పృహలు అలుముకున్నట్లు విశ్లేషకులు చెప్పే మాట. సొంత ఇలాఖా కుప్పంలో పార్టీ బాగా వీక్ అయ్యిందని గుర్తించిన చంద్రబాబునాయుడు ప్రత్యేకించి ఆయనే స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్దితి వచ్చిందంటున్నారు. అందుకే ఆయన కుప్పంలో మూడు రోజుల పర్యటనకు సిద్దమయ్యారట. దసరాలోపు ఆయన కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి, పార్టీని బలోపేతం చేయడంతో పాటు, క్యాడర్‌లో మనోధైర్యాన్ని నింపే దిశగా చర్యలు చేపట్టినట్టుగా లోకల్‌ టాక్‌ వినిపిస్తోంది. చంద్రబాబు పర్యటన మున్సిపల్ ఎన్నికలపై సానుకూల ప్రభావం చూపిస్తుందని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి.



Updated Date - 2021-10-16T18:41:52+05:30 IST