Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాళ్ల చిల్లర చేష్టలతో Minister Seediri క్యారక్టర్‌కు డ్యామేజ్.. సొంత పార్టీలోనే సెటైర్లు.. అసలు సంగతి ఇదీ..!

ఆ జిల్లాలో ఆ మంత్రిగారి తీరు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆయన రాష్ట్రానికి మంత్రినా లేక నియోజకవర్గానికే మంత్రా అన్న అనుమానాలు జిల్లా వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఆయన చుట్టూ ఉన్న చోటా నాయకులు చేసే చిల్లర చేష్టలు వల్ల సదరు మంత్రిగారి క్యారెక్టర్‌కు డామేజ్ అవుతోంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఆ మంత్రిగారి విషయంలో జిల్లాలో వినిపిస్తున్న గుసగుసలు ఏంటి? మంత్రిగారిపై హైకమాండ్‌కు వెళ్తున్న రిపోర్టులేంటి? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.

2019లో అత్యధిక స్థానాల్లో విజయం..

పాలిటిక్స్‌ని పాలిట్రిక్స్‌గానే చూస్తున్నారు నేటి తరానికి చెందిన కొంతమంది నాయకులు. అయితే నాలుగు మంచి పనులు చేసే నాయకులు శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ప్రజల ఆశలపై నీళ్లు చల్లే నేతలకు రాజకీయ సమాధి చేసిన చరిత్రలూ అనేకమనే చెప్పాలి. శ్రీకాకుళం జిల్లా భౌగోళికంగా వెనుకబడినప్పటికీ ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ కైవసం చేసుకుంటే రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారం చేపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఇదే ఒరవడి 2019 ఎన్నికల్లోనూ కొనసాగింది. పది అసెంబ్లీ స్ధానాలున్న సిక్కోలులో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎనిమిది స్ధానాల్లో విజయం సాధించింది.

అనూహ్యంగా వరించిన మంత్రి పదవి..!

శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ  తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో సీదిరి అప్పలరాజు ఒకరు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అప్పలరాజుకు కలిసొచ్చే కాలమొస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు మంత్రి పదవి వరించింది. మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపడంతో అదే సామాజికవర్గానికి  చెందిన సీదిరి అప్పలరాజుకు సీఎం జగన్ తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. పశుసంవర్ధకశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సదరు మంత్రిగారికి తాను అసలు రాష్ట్ర మంత్రినన్న ఆలోచనే ఉండదనే మాట జిల్లాలో వినిపిస్తోంది. ఉంటే అమరావతి లేకుంటే పలాస అన్నట్టు మంత్రిగారి డైలీ షెడ్యూల్ నడుస్తోందట.

అప్పలరాజుపై సొంత పార్టీలో సెటైర్లు!

శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మంత్రులతో పాటు స్పీకర్ తమ్మినేని కీలక పదవుల్లో ఉన్నారు. డిప్యూటీ సి.ఎం కృష్ణదాసులే ఎక్కువగా జిల్లాలో కనిపిస్తారు. అప్పలరాజు మాత్రం ఉన్న ఒకటి రెండు రోజులు కూడా పలాసకే పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.కలెక్టరేట్‌లో జరిగే అతి ముఖ్యమైన కార్యక్రమాలతో పాటు జిల్లాలో జరిగే ఏ ఇతర కార్యక్రమాలకూ అప్పలరాజు అటెండ్ కావటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అసలు అప్పలరాజు రాష్ట్ర మంత్రా లేక పలాస మంత్రా అంటూ సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. మంత్రి అయిన యేడాది కాలంలో పలాస మినహా ఇతర నియోజకవర్గాల్లో మంత్రిగారి దర్శనమే లేదనే టాక్‌ వస్తోంది.

మంత్రి అయ్యాక డాక్టర్‌గారి శైలి మారిందా?

మంత్రి అప్పలరాజుకు రాజకీయాల్లోకి రాకముందు డాక్టర్‌గా మంచి పేరుంది. పలాస ప్రాంతంలో మంత్రి అప్పలరాజును నేటికీ డాక్టర్ గారూ అని సంబోధించే వారే ఎక్కువ. కానీ మంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహార శైలిని గమనిస్తున్న సన్నిహితులు ముక్కున వేలేసుకుంటున్నారట. పలాసలో పది కాలాల పాటు తానే అధికారంలో ఉండాలనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ప్రత్యర్ధి పార్టీ నేతలపై గతంలో ఎన్నడూ లేనంతగా కక్ష సాధింపులకు దిగుతున్నారనే విమర్శలు ఎక్కువైపోతున్నాయి. మంత్రిగారి అనుచరులు వ్యవహరిస్తున్న తీరు అమాత్యులవారికి చెడ్డపేరు తెస్తుందనే మాట వినిపిస్తోంది.

అసభ్యపోస్టుల వ్యవహారంలో చెడ్డపేరు

ఇటీవల పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు అనుచరులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగులు వివాదాస్పదంగా మారాయి. రాజకీయ ప్రత్యర్ధి అయిన గౌతు శిరీషపై మంత్రిగారికి అత్యంత సన్నిహితంగా మెలిగే కొంతమంది చోటా లీడర్లు అసభ్యకర పోస్టింగులు పెట్టారు. దీన్ని సీరియస్‌గా  తీసుకున్న మహిళా నేత శిరీష మంత్రి అప్పలరాజుపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. ఓ మహిళా నాయకురాలిపై ఇంత దిగజారుడు రాజకీయాలు చేయటంపై పలాస వాసులను  ఆశ్చర్యానికి గురిచేసింది. మంత్రి గారి ప్రోద్బలంతోనే అనుచరులు ఇలాంటి చర్యలకు దిగుతున్నారంటూ పలాస వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

హైకమాండ్ గమనిస్తుందంటున్న సీనియర్లు! 

ఇదిలా ఉంటే మంత్రి అప్పలరాజు వ్యవహారాన్ని గమనిస్తున్న జిల్లాకు చెందిన సీనియర్లు అధిష్టానం అంతా గమనిస్తుంది అంటూ రొటీన్ నినాదాన్ని ఆలపిస్తున్నారట. మొత్తానికి పలాసలో మంత్రిగారి వ్యవహార శైలి పార్టీకి కీడు చేస్తుందన్న భావన సొంత పార్టీలో వ్యక్తమౌతోందట. మంత్రిగారిపై వస్తున్న విమర్శలు, ఆరోపణలను వైసీపీ అధిష్టానం ఎలా డీల్‌ చేస్తుందో చూడాల్సి ఉంటుందని పలాసవాసులే కాదు జిల్లా ప్రజలందరూ అనుకుంటున్నారు.


Advertisement
Advertisement