HYD : నామ్‌కే వాస్తేగా ఎస్టీపీల నిర్వహణ.. ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలనలో బహిర్గతం

ABN , First Publish Date - 2021-10-25T18:34:16+05:30 IST

దేశంలోనే అత్యధికంగా మురుగునీరు శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్‌కు...

HYD : నామ్‌కే వాస్తేగా ఎస్టీపీల నిర్వహణ.. ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలనలో బహిర్గతం

  • మురుగు శుద్ధి అంతంత మాత్రమే
  • వర్షం వచ్చినా, నాలా పోటెత్తినా పక్కదారే

హైదరాబాద్‌ సిటీ : దేశంలోనే అత్యధికంగా మురుగునీరు శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు దక్కుతుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో 41శాతం నుంచి వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయగా, ఇప్పటికే నిర్వహణలో ఉన్న సివరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ)ల పనితీరు మాత్రం అధ్వానంగా మారింది. అధికారుల తనిఖీ సందర్భంలో మురుగునీటిని శుద్ధి చేస్తుండగా, మిగతా సమయాల్లో వచ్చిన నీరు వచ్చినట్లుగానే మూసీనదిలోకి వదులుతున్న పరిస్థితి ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో బహిర్గతమైంది.


అంబర్‌పేటలో ఇలా..

నగరంలోనే అతిపెద్ద  ఎస్టీపీ అంబర్‌పేటలోని అలీకేఫ్‌ చౌరస్తాకు సమీపంలో ఉంది. ఈ ఎస్టీపీని పదేళ్ల క్రితమే రూ.84.67కోట్లతో రోజుకు 339మిలియన్‌ గ్యాలన్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యంతో నిర్మించారు. అంబర్‌పేట తదితర ఎగువ ప్రాంతాలు, మూసీనది నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి మూసీనదిలో వదులుతున్నారు. శుద్ధి చేసిన నీరు మూసీలో కలువకుండా ప్రత్యేకమైన నాలా ఉన్నా, దాన్ని వాటర్‌బోర్డు వినియోగించడం లేదు. మూసీనదికి, ఎస్టీపీకి మధ్యలో ఉన్న ఈ నాలాను వినియోగించకపోవడంతో పూర్తిగా చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. ప్రవాహం లేకపోవడంతో నిర్మాణ వ్యర్థాలన్నీ నాలాలో పోసి పూడ్చేస్తున్నారు. ప్రైవేటు సంస్థకు లీజుకిచ్చిన తర్వాత అధికారుల తనిఖీ సందర్భంలోనే శుద్ధి ప్రక్రియ చేస్తున్నారు. మురుగునీరు అధికంగా వచ్చే సమయంలో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మూసీలోకి వదులుతున్నారు. ఇక వర్షాలు వచ్చిన సందర్భంలో శుద్ధి ప్రక్రియ నిలిపివేసి మూసీలోకి వదులుతున్నారు. జియాగూడలో, అత్తాపూర్‌లోని నందిముసలాయిగూడ, నాగోల్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది.


శుద్ధి చేసినా.. 

నాచారంలో మురుగు నీరు శుద్ధి చేసే ప్లాంట్‌లు బాబానగర్‌లో, హెచ్‌ఎంటీనగర్‌లో ఉన్నాయి. బాబానగర్‌లోని ఎస్టీపీ ప్లాంట్‌ సామర్థ్యం 2.5 ఎంఎల్‌డీలు, దీనికి పై నుంచి సఫిల్‌గూడ ఎగువ ప్రాంతాలు, కాలువల నుంచి మురుగు నీరు చేరుకుంటుంది. ఇక్కడ మురుగు నీరు శుద్ధి చేసి సమీపంలోని పటేల్‌కుంట చెరువులో వదులుతున్నారు. హెచ్‌ఎంటీనగర్‌లోని ఎస్టీపీ 10ఎంఎల్‌డీల సామర్థ్యం కాగా, అందులో మురుగునీరు శుద్ధి చేసిన తర్వాత హెచ్‌ఎంటీనగర్‌ చెరువులోకి వదులుతున్నారు. కానీ హెచ్‌ఎంటీనగర్‌ చెరువులో నీళ్లు కూడా మురుగ్గానే ఉంటున్నాయి.


స్థాయికి మించి మురుగునీరు..

కూకట్‌పల్లి ప్రాంతంలోని ఎస్టీపీలకు స్థాయికి మించి మురుగునీరు వస్తోంది. కూకట్‌పల్లి సర్కిల్‌ పరిధి ఖాజాకుంటలోని 12 ఎంఎల్‌డీ ప్లాంట్‌కు రోజూ 13మిలియన్‌ గ్యాలన్ల వరకు మురుగునీరు వస్తోంది. అందులో ఒక మిలియన్‌ గ్యాలన్లు మాత్రమేస్టోర్‌ చేసి శుద్ధి చేస్తున్నారు. అదేవిధంగా మూసాపేట రంగధాముని చెరువులో ఏర్పాటు చేసిన 5 ఎంఎల్‌డీ ప్లాంట్‌కు ఎక్కువ మురుగునీరు రావడంతో సామర్థ్యానికి మించి శుద్ధి చేసేలా చర్యలు చేపడుతున్నారు. 


పలు ప్రాంతాల్లో ఇలా..

- సరూర్‌నగర్‌ చెరువు ఎగువన తపోవనం కాలనీలో 25మిలియన్‌ గ్యాలన్ల సామర్థ్యం కలిగిన ఎస్టీపీ ఉండగా, పరిమితికి మించి మురుగునీరు ప్రతిరోజూ వస్తోంది. శుద్ధి చేయకుండా సరూర్‌నగర్‌ చెరువులోకి వదులుతున్నారు. దీంతో శుద్ధి చేసిన నీరు సరూర్‌నగర్‌ చెరువులో చేరినా ప్రయోజనమేమీ లేకుండా పోతోంది.

- ఉప్పల్‌లో నల్ల చెరువు ప్రాంతంలో 30ఎంఎల్‌డీ సామర్థ్యం ఉన్న ఎస్టీపీ ఉంది. ఇక్కడికి మురుగు నీరు సుమారు 100 ఎంఎల్‌డీలు చేరుకుంటోంది. మిగిలిన 70ఎంఎల్‌డీ మురుగు నీటిని ఇతర మార్గం ద్వారా నేరుగా మూసీలోకి వదులుతున్నారు. వర్షానికి వచ్చి న నీటిని వచ్చినట్లుగానే బయటకు వదులుతున్నారు. సఫిల్‌గూడ  చెరువు వద్ద 0.6 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎస్టీపీ ఉండగా ఇక్కడ మురుగునీటి శుద్ధి జరుగుతోంది.

- గోపన్‌పల్లి, రాయదుర్గం చెరువు, వేముకుంట రోడామేస్ర్తీ ప్రాంతాల్లో ఎస్టీపీలు ఉండగా వాటి సామర్థ్యం 20 మిలియన్‌ గ్యాలన్ల లోపు మాత్రమే ఉంది. ఆయా ప్రాంతాల నుంచి అంతకుమించి మురుగునీరు అధికంగా వస్తుండడంతో శుద్ధి చేయకుండానే వదులుతున్నారు. దాంతో ఎస్టీపీ దిగువన గల చెరవులు, కుంటలన్నీ దుర్గంధంగా మారుతున్నాయి. 

- హుస్సేన్‌సాగర్‌లోకి బల్కాపూర్‌ నాలా నుంచి వచ్చే ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ పక్కన 20మిలియన్‌ గ్యాలన్ల సామర్థ్యం గల ఎస్టీపీని హెచ్‌ఎండీఏ నిర్వహిస్తోంది. బల్కాపూర్‌ నాలాతో పాటు సాగర్‌ పరివాహక ప్రాంతాల నుంచివర్షపునీరు భారీగా వస్తుండడంతో శుద్ధి చేయకుండా నేరుగా హుస్సేన్‌సాగర్‌లోకి వదులుతున్నారు. సాగర్‌లోకి చెత్త రాకుండా మెష్‌లను ఏర్పాటు చేయడంతో అక్కడే ఉన్న కుంటలో పెద్ద ఎత్తున చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు నిలిచిపోతున్నాయి. దీంతో దుర్వాసన వస్తోంది. 


ఎస్టీపీల నిర్వహణపై భారీగా ఖర్చు

నగరంలోని ఐదు ఎస్టీపీల నిర్వహణ కోసం ప్రైవేటు సంస్థకు యేటా వాటర్‌బోర్డు చెల్లింపులు చేస్తుండగా, ఇతర ఎస్టీపీలను వాటర్‌బోర్డే చేపడుతోంది. వివిధ ఎస్టీపీల వద్ద మేనేజర్లు, డీజీఎంలతో పాటు ప్రత్యేకంగా ఎస్టీపీ డివిజన్లను ఏర్పాటు చేశారు. ఆయా ఎస్టీపీ డివిజన్ల నిర్వహణకు ప్రతి నెలా భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం లేదు. శుద్ధి చేసిన నీటిని పలు కంపెనీలకు తరలించినా వాటర్‌బోర్డుకు భారం తగ్గే అవకాశముంది. శుద్ధి చేసిన నీటి విక్రయం ద్వారా ఆదాయం కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఆ దిశగా చర్యలు లేవు. ఉన్నతాధికారులు దృష్టిసారించి మురుగునీటిని మెరుగ్గా శుద్ధి చేయడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2021-10-25T18:34:16+05:30 IST