Etela ఒంటరి పోరాటం.. BJPలో చేర్చిన నేతలు పట్టించుకోవట్లేదేం.. ఆ కీలక నేత ఎక్కడా కనిపించరేం.. huzurabad లో అసలేం జరుగుతోంది..!?

ABN , First Publish Date - 2021-08-27T01:29:16+05:30 IST

ఆ జాతీయ పార్టీలో ఈ నేత ఒంటరి అవుతున్నారా? సీనియర్ నేతలు అక్కడ అడుగు పెట్టకపోవటానికి కారణమేంటి?...

Etela ఒంటరి పోరాటం.. BJPలో చేర్చిన నేతలు పట్టించుకోవట్లేదేం.. ఆ కీలక నేత ఎక్కడా కనిపించరేం.. huzurabad లో అసలేం జరుగుతోంది..!?

ఆ జాతీయ పార్టీలో ఈ నేత ఒంటరి అవుతున్నారా? సీనియర్ నేతలు అక్కడ అడుగు పెట్టకపోవటానికి కారణమేంటి? పార్టీలోకి ఆహ్వానించిన వారే  ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారా? సొంత అజెండాతో ఆయన ముందుకెళ్తున్నారన్న అభిప్రాయం పార్టీ నేతలకు వస్తోందా? బాధ్యత తీసుకోవాల్సిన సొంత జిల్లాకు చెందిన జాతీయ నేతలు లైట్ తీసుకోవటానికి కారణమేంటి? కొత్త నేతకు ఆ పార్టీలో తలనొప్పులు మొదలయ్యాయా? తనకు తానుగా నిరూపించుకునేందుకు ఆయన ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాల్సివస్తోందా..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఈటలను బీజేపీలో చేర్చిన నేతలు సైలెంట్‌ అయ్యారా?

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్‌ను వీడిన తర్వాత బీజేపీలో చేరాలని ఒత్తిడి చేసిన నాయకులు  హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారం వైపు కన్నెత్తి చూడకపోవటం చర్చనీయాంశం అవుతోంది. కేంద్రంలో కీలక పదవిలో ఉన్ననేత ఈటలను బీజేపీలో తీసుకురావడంలో ప్రముఖపాత్ర పోషించారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఈటల బీజేపీలో చేరే వరకు తన సన్నిహితుల ద్వారా రాయభారం నడిపిన ఆ కీలక నేత ముఖం చాటేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటల పార్టీలో చేరిన తర్వాత  కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాను కలిసినపుడు మాత్రమే ఆయన ఈటలతో ఉన్నారట. ఆ తర్వాత ఆ ముఖ్యనేత ఈటల వ్యవహారంలో అంటీముట్టనట్లు ఉంటున్నారన్న చర్చ బీజేపీలో సాగుతోంది. దీంతో ఆ కీలక నాయకుడి తీరు ఈటల సన్నిహితులకు రుచించడం లేదని సమాచారం.


ఈటలకు మద్దతుగా నిలిచిందెవరు..!?

మరోవైపు తమ‌కు పోటీ అవుతాడన్న కారణంతో పార్టీలోని చాలా మంది సీనియర్లు ఈటలకు మద్దతుగా ప్రచారం చేయటానికి ఇష్టపడడం లేదని సమాచారం. పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రమే ఈటల పాదయాత్రకు మద్దతుగా నిలిచారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  ఈటల పాదయాత్రలో ఒక్క రోజు పాల్గొని వచ్చారు. పార్టీలో క్రియాశీలంగా ఉన్న లక్ష్మణ్, రాంచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి లాంటి నేతలు హుజూరాబాద్ వెళ్ళటానికి సుముఖత చూపడం లేదన్న చర్చ పార్టీలో సాగుతోంది.


మురళీధర్‌రావు హుజురాబాద్‌ వస్తారా? రారా? 

ఈటల ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి సొంత జిల్లాకు చెందిన జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు, జిల్లా స్థాయి నేతలు కూడా ప్రచారానికి దూరంగా ఉండటం పార్టీలో చర్చకు తావిస్తోంది. కరీంనగర్‌ జిల్లాకు చెందిన జాతీయ నేత, మధ్యప్రదేశ్‌ ఇంఛార్జ్‌ మురళీధరరావు హుజురాబాద్‌కు ఒక్కసారి కూడా ఎందుకు వెళ్లడం లేదన్న చర్చ మొదలైంది. సీనియర్ నేత రామకృష్ణారెడ్డి లాంటి నేతలు సైతం అక్కడ అడుగుపెట్టడం లేదని పార్టీలో విన్పిస్తోంది.


ఒంటరిపోరాటం చేస్తున్న ఈటల!

భారీ అంచనాలతో కమలం గూటికి చేరినప్పటికీ మాజీమంత్రి ఈటలకు పార్టీ నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లబించడంలేదన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. దీంతో హుజురాబాద్‌లో అన్నీ తానై ఈటల ఒంటరి పోరు సాగిస్తున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మరోవైపు ఈటల కాషాయ కండువా కప్పుకున్న నాటి నుంచి పార్టీ అజెండా కాకుండా సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని  బీజేపీలో ముందునుంచి ఉన్న పాత నేతలు అనుకుంటున్నారట.


ఈటలకు బాసటగా ఇద్దరే..! 

పార్టీలో అంతర్గత పరిణామాలు ఎలా ఉన్నా హుజూరాబాద్ బీజేపీ ఇంచార్జ్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఏ.చంద్రశేఖర్, యండల, ఎమ్మెల్యే రఘనందన్‌రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్ లాంటి నేతలు మాత్రం ఈటలకు మద్దతుగా టీఆర్ఎస్‌ను  ఓడించాలన్న పట్టుదలతో ఉన్నట్లు కన్పిస్తున్నారట. ఈటలను గెలిపించి సీఎం కేసీఆర్‌ను దెబ్బకొట్టాలని వీరంతా అనుకుంటున్నారట. ఒక ఉప ఎన్నిక బీజేపీ పార్టీలో అనేక చర్చలకు తెరలేపుతోంది.



Updated Date - 2021-08-27T01:29:16+05:30 IST