Abn logo
Aug 24 2021 @ 12:37PM

Jagan కు షర్మిల ఎందుకు రాఖీ కట్టలేదు?.. ఇడుపులపాయలో అసలేం జరిగింది!?

అన్నా, చెల్లెళ్ల మ‌ధ్య రాజ‌కీయ వైరం రాఖీబంద‌న్ కు దూరం చేసిందా? ఏపీ సీఎం జ‌గ‌న్ చేతికి, చెల్లెలు రాఖీ ఎందుకు చేర‌లేదు? ఇడుపుల పాయ‌లో అన్న త‌ప్పించుకున్నందుకే.. రాఖీ క‌ట్టేందుకు చెల్లులు విముఖ‌త చూపారా? పార్టీ కార్యాల‌యంలో ఘ‌నంగా ఉత్సవాలు నిర్వహించిన షర్మిల.. అన్నకు కేవ‌లం ట్వీట్ తోనే ఎందుకు స‌రిపెట్టారు? జగన్, షర్మిల మధ్య పెరిగిన దూరానికి ఇది సంకేతమా..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.

అన్నాచెల్లెల మధ్య దూరం పెరిగిందా?

తెలంగాణలో పార్టీ పెట్టిన నాటి నుంచి షర్మిల, అన్న జగన్ ల మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా అన్నా, చెల్లెళ్ల మధ్య విభేదాలు ఉన్నట్టు వినిపిస్తున్నా.. వ్యక్తిగతంగా షర్మిలకు అన్నతో మంచి సంబంధాలే ఉన్నాయని అందరూ భావించారు. వైఎస్ జయంతి రోజున ఇడుపులపాయలో జరిగిన సంఘటనతో ఇద్దరి మధ్య దూరం పెరగడమే కాదు.. మాటలు కూడా లేవనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా రాక్షాబంధన్ రోజున షర్మిల, జగన్ కు రాఖీ కట్టకపోవడంతో ఇన్ని రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చకు బలం చేకురినట్టు అయ్యింది.

కోల్డ్ వార్ మ‌రింత ముదిరిందా?

అన్నాచెల్లెళ్ల మ‌ధ్య కోల్డ్ వార్ మ‌రింతగా ముదురుతున్నట్లు క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో షర్మిల పార్టీ పెట్టడం ఏమాత్రం ఇష్టంలేని జగన్ రోజురోజుకి చెల్లెలితో వైరం పెంచుకుంటున్నారని వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు అంటున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావానికి ముందు.. పార్టీ పెట్టడంపై షర్మిల తీవ్ర కసరత్తు చేశారు. అదే సమయంలో తెలంగాణలో పార్టీ అవసరం లేదని జగన్, షర్మిలకు చెప్పినట్టు వైసీపీకి చెందిన కొందరు నేతలే చెప్పారు. అయితే, రాజ‌న్న రాజ్యం త‌న‌తోనే సాధ్యమ‌ని.. అది ఎలా ఉంటుందో తెలంగాణ‌లో చూపిస్తానంటూ షర్మిల పార్టీని ప్రకటించారు. అప్పటి నుంచి ష‌ర్మిల‌తో జ‌గ‌న్ పూర్తిగా మాట‌లు సైతం బంద్ చేసిట్టు చ‌ర్చ జరుగుతోంది.

తోడ‌పుట్టిన అన్నే రాజ‌కీయంగా ఎద‌గనివ్వడం లేదా..?

అన్న జైల్లో ఉన్నప్పుడు షర్మిల వైసీపీకి కొండంత అండగా నిలిచారు. పాదయాత్ర నిర్వహించడంతో పాటు కార్యకర్తల్లో ఉత్సహం నింపారు. జగన్ జైలు నుంచి వచ్చే వరకు పార్టీ నేతల్లో భరోసా నింపారు. అయితే, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో షర్మిల, వైసీపీకి దూరమయ్యారనే ప్రచారం జరిగింది. తోడ‌పుట్టిన అన్నే న‌మ్మించి గొంతుకోశాడ‌ని.. రాజ‌కీయంగా ఎద‌నీయ‌కుండా చేశారని షర్మిల తన సన్నిహితుల దగ్గర చాలాసార్లు చెప్పారట. ఈసారి షర్మిల, అన్న జగన్ కు రాఖీ కట్టకపోవడంతో.. ఇద్దరి మ‌ద్య జ‌రుగుతున్న కోల్డ్ వార్ మరింత పెరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

షర్మిల రాఖీ కట్టకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ!

రాఖీ పండుగ అంటే అన్నాచెల్లిళ్ల మ‌ద్య అనుబంధానికి ప్రతీక‌. ఈసారి ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ కు చెల్లెలు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ష‌ర్మిల రాఖీ క‌ట్టకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఏటా అన్నకు రాఖీ కట్టే చెల్లెలు ఈసారి ఎందుకు కట్టలేదు? పార్టీ పెట్టిన ఏడాదే రాఖీ కట్టకపోవడానికి కారణమేంటి? ఇద్దరి మధ్య పెరిగిన వైరానికి నిదర్శనమా? ఇలా ఇరు రాష్ట్రాల్లోని పొలిటికల్ సర్కల్స్ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అన్నకు రాఖీ కట్టని షర్మిల.. త‌న పార్టీ కార్యాల‌యంలో మాత్రం రక్షాబంధన్ ఉత్సవాలను ఘ‌నంగా నిర్వహించారు. పార్టీ కార్యకర్తల‌కు రాఖీలు క‌ట్టి, శుభాకాంక్షలు తెలిపారు. అక్కడితో ఆగకుండా, ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల చేసిన ట్వీట్ ఆస‌క్తిని రేపుతోంది.

ఆసక్తిగా మారిన షర్మిల ట్వీట్..

రాఖీ పండగ సందర్భంగా షర్మిల చేసిన ట్వీట్ చూస్తుంటే.. అన్నాచెల్లెళ్ల మధ్య దూరం పెరిగిందని జరుగుతున్న ప్రచారం నిజమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తోడ పుట్టిన జగనన్నకు, తనకు అండగా నిలిచిన ప్రతి అన్నకు, తమ్ముడికి ఎప్పుడు సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నానని షర్మిల ట్వీట్ చేశారు. తెలంగాణ‌లో ఉన్న ప్రతి అన్న, త‌మ్ముడితో జ‌గ‌న్ స‌మాన‌మేన‌ని.. తోడ‌పుట్టడం త‌ప్ప, త‌న‌కు ప్రత్యేకత అంటూ ఏమిలేద‌నే అర్థం వచ్చేలా ట్వీట్ చేయడం ఇద్దరి మ‌ద్య మ‌రింత గ్యాప్ పెరిగింద‌నే సంకేతాలకు నిదర్శనమని రాజకీయ వర్గాలు లెక్కలేస్తున్నాయి.

అందుకే షర్మిల రాఖీ కట్టలేదా..?

వైఎస్ జ‌యంతి నాడు ఇడుపులపాయ వేదిక‌గా అన్న జ‌గ‌న్ ఆశీర్వాదం తీసుకోవాల‌ని ష‌ర్మిల ప్రయత్నం చేశారు. సోద‌రి వ‌స్తుంద‌ని తెలిసి, నివాళులు అర్పించే కార్యక్రమాన్ని జ‌గ‌న్ సాయంత్రానికి మార్చుకున్నారు. దీంతో పార్టీ కార్యక‌ర్తల‌తో కలిసి ష‌ర్మిల నివాళ్లు అర్పించి హైద‌రాబాద్ కు తిరిగి వెళ్లారు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచే అన్నా చెల్లెల మ‌ద్య దూరం మొదలైన.. ఇలాంటి ఘటనలతో ఇరువురి మధ్య వైరం మరింత పెరిగిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే అన్న చేతికి చెల్లెలి రాఖీ చేరలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.