Gorantla అసంతృప్తికి ఆ లేడీ ఎమ్మెల్యే కారణమా.. అసలేం జరిగింది.. అలక పోయినట్లేనా.. Butchaiah మనసులో ఏముంది.. TDP ఏమనుకుంటోంది..!?

ABN , First Publish Date - 2021-08-26T22:37:49+05:30 IST

ఆగస్ట్‌ నెల అంటేనే తెలుగుదేశానికి సంక్షోభ సమయమనే పేరు. దానికి తగ్గట్లుగానే ఈసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా అంశం...

Gorantla అసంతృప్తికి ఆ లేడీ ఎమ్మెల్యే కారణమా.. అసలేం జరిగింది.. అలక పోయినట్లేనా.. Butchaiah మనసులో ఏముంది.. TDP ఏమనుకుంటోంది..!?

  • గోరంట్లది అలకమాత్రమే, ఆగస్ట్‌ సంక్షోభం కాదు!
  • త్రీమెన్‌ కమిటీ ముందు గోరంట్ల పెట్టిన డిమాండ్స్‌ ఏంటి? 
  • చంద్రబాబు, అచ్చెన్న సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్లకు ఇచ్చిన హామీలేంటి?
  • రాజమండ్రి టీడీపీలో ఆధిపత్యపోరుకు తెరదించినట్లేనా? 
  • గోరంట్ల అసంతృప్తి.. టీ కప్పులో తుఫాన్‌ అనుకోవచ్చా?

ఆగస్ట్‌ నెల అంటేనే తెలుగుదేశానికి సంక్షోభ సమయమనే పేరు. దానికి తగ్గట్లుగానే ఈసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా అంశం టీడీపీలో హీట్‌ పుట్టించింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు మధ్యవర్తులతో మంత్రాంగం నడిపి గోరంట్లను చల్లబర్చగలిగారు. గోరంట్ల అసంతృప్తి ఎందుకు? ఎవరిపై? హైకమాండ్ ఆయనకు ఇచ్చిన ప్రామిస్‌ ఏంటి? రాజమండ్రి తెలుగుదేశంలో గోరంట్ల హవా మున్ముందు కొనసాగనుందా..? అనేది ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌‌సైడ్‌లో చూద్దాం.


సంక్షోభాన్ని నివారించిన చంద్రబాబు.. చల్లబడ్డ గోరంట్ల!

గోరంట్ల అసంతృప్తిని చల్లార్చేందుకు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. సీనియర్‌ ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు గద్దే రామ్మోహన్, చినరాజప్ప, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షుడు జవహర్‌లను త్రిసభ్య బృందంగా నియమించి రాయభారం నెరిపారు. త్రిసభ్య బృందం సభ్యులు గోరంట్ల చేసిన సూచనలు, పెట్టిన డిమాండ్లు హైకమాండ్‌కు అందించారు. గోరంట్ల అనుచురులను రాష్ట్ర, జిల్లా కమిటీల్లో నియమించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గోరంట్ల కొంత మంది పేర్లను త్రిసభ్య బృందం సభ్యులకు సిపార్సు చేసినట్టు తెలుస్తోంది. ఆదిరెడ్డి కుటుంబం విషయంలో ఉన్న అసంతృప్తి పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా గోరంట్లకు స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ మనుగడ కోసం గోరంట్ల బుచ్చయ్య చేసిన సూచనలు కూడా పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని త్రిసభ్య బృందం సభ్యులు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.


గోరంట్ల వాఖ్యలతో ఆగస్ట్‌ సంక్షోభం..! 

రాజమండ్రి అర్బన్‌లో తిరుగులేని నేతగా ఎదిగిన గోరంట్ల రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా 2014, 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబం అర్బన్ నియోజకవర్గంలో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తోంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్, భవానీ మామ అప్పారావుల ఆధ్వర్యంలో టీడీపీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అర్బన్ నియోజకవర్గంలో గోరంట్లతో పాటు ఆయన అనుచరులకు ఆదిరెడ్డి కుటుంబం ప్రాధాన్యత ఇవ్వటం లేదన్న అసంతృప్తి ఉంది. గత కొంతకాలంగా గోరంట్ల, ఆదిరెడ్డి కుటుంబం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాజమండ్రితో పాటు రాష్ట్రంలోనూ చోటుచేసుకున్న కొన్ని పరిణామాలపై గోరంట్ల చేస్తున్న సూచనలను పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ పట్టించుకోవడంలేదని సీనియర్‌ ఎమ్మెల్యే వాపోయారు. పార్టీలోని పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆగస్ట్‌ సంక్షోభానికి కారణమయ్యాయి. 


అర్బన్‌, రూరల్‌ ఏదైనా గోరంట్లదే పైచేయి!

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జెండా మోస్తూ వస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో పార్టీ సింబల్‌గా నిలిచారు. రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు చౌదరి. నాలుగు సార్లు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం నుంచి, వరుసగా రెండు సార్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు టీడీపీ విజయం సాధించటంలోనూ గోరంట్ల కీలక పాత్ర పోషించారు. గత రెండేళ్లుగా వైసీపీ ప్రభుత్వ అవినీతిపై, ముఖ్యమంత్రి జగన్‌పై  విమర్శల జడివాన కురిపిస్తూ  రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు గోరంట్ల. 


టీడీపీలో ఆగస్ట్ సంక్షోభాన్ని పుట్టించిన గోరంట్ల..!

తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజీనామా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, అధినేత తనయుడు లోకేష్‌తో పాటు రాజమండ్రి స్థానిక పార్టీలోని లోపాలపై  గోరంట్ల బుచ్చయ్య చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. గోరంట్ల టీడీపీలో ఇక ఇమడలేరా? రాజీనామా తర్వాత ఏ పార్టీలో చేరతారనే చర్చ జోరుగా సాగింది. మరికొందరు గోరంట్ల రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ గట్టిగా నమ్మారు.


గోరంట్ల మదిలో ఏముంది?

అయితే గోరంట్ల మాత్రం అసంతృప్తిపై మౌనం వీడటం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించటం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గోరంట్ల మున్ముందు ఏవిధంగా స్పందిస్తారు ? టీడీపీ నేతలు చెబుతున్నట్టుగా అసంతృప్తిని వీడి పార్టీలోనే కొనసాగుతారా? గోరంట్ల స్పందన ఏవిధంగా ఉండబోతుంది అనే ఉత్కంఠ మాత్రం తగ్గడం లేదు. గోరంట్ల మదిలో ఏముందో వేచిచూడాల్సిందే మరి.


టీ కప్పులో తుఫాన్‌గా భావిస్తున్న టీడీపీ..!

చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఫోన్‌లో మాట్లాడటం, త్రిసభ్య బృందం చర్చలు జరపడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన అసంతృప్తిని వీడినట్లు పార్టీ భావిస్తోంది. సమస్యలు సర్దుకున్నాయని గోరంట్ల రాజీనామా చేసే ప్రసక్తే లేదని పార్టీలోనే కొనసాగుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. గోరంట్ల అసంతృప్తి టీ కప్పులో తుపాన్‌గా టీడీపీ నేతలు చెబుతున్నారు.



Updated Date - 2021-08-26T22:37:49+05:30 IST