అప్పుడు జై కొట్టారు.. ఇప్పుడు ఎదురుతిరిగితే CM KCR కోపానికి బలైపోతామనే భయంలో ఎమ్మెల్యేలు!!

ABN , First Publish Date - 2021-08-06T18:23:07+05:30 IST

వారు ఆయనపై దుమ్మెత్తిపోశారు. ఆయన మాటలు నీటిమూటలు అన్నారు.

అప్పుడు జై కొట్టారు.. ఇప్పుడు ఎదురుతిరిగితే CM KCR కోపానికి బలైపోతామనే భయంలో ఎమ్మెల్యేలు!!

వారు ఆయనపై దుమ్మెత్తిపోశారు. ఆయన మాటలు నీటిమూటలు అన్నారు. మొత్తానికి జనాలు వాళ్ల మాటలు నమ్మి పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చాక వీళ్లూ ఊరుకిచ్చిన మాట తప్పారు. మాట తప్పిన మనిషన్న మనిషితోనే ముందు మాట కలిపారు. ఆ తర్వాత కండువా కలర్‌ కూడా చేంజ్‌ చేసుకున్నారు. ఇదేంటని అడిగితే మన పనులు కావాలంటే మనం మారక తప్పదు అన్నారు. మళ్లీ నమ్మారు జనం.  పొద్దులు గడుస్తున్నా పోడు భూములలెక్క తేలకపోవడానికి తోడు అధికారులు.. భూముల్లో గునపాలు గుచ్చుతుంటే జనం గుండెలు మండిపోతున్నాయి. ఇదేంటని అడిగితే చెప్పేందుకు సమాధానం లేక సదరు నేతలు ఊర్లు విడిచిపోతున్నారట. మళ్లీ ఎన్నికలు వస్తాయి అప్పుడు మీ సంగతి చెబుతామని జనం అనుకుంటున్నారట. ఇంతకీ ఎవరా నేతలు. మున్ముందు వారి పరిస్థితి ఏంటి? అనేది ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.




ఓ వైపు భయం.. మరోవైపు..!

సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఇచ్చిన  వాగ్దానం నెరవేర్చాలని పోరుబాట పడితే ఎక్కడ అధినేత కోపానికి బలయిపోతామనే భయం ఓ పక్క వేధిస్తుంటే క్షేత్రస్థాయిలో ఉద్యమానికి మద్దతు తెలుపకుంటే మున్ముందు ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయం పార్టీ మారిన నేతలకు పట్టుకుందట. గత ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ పై దుమ్మెత్తి పోసి ఎన్నికల్లో గెలిచి ఇపుడు అదే టీఆర్‌ఎస్‌లో ఉండి పోడు రైతులకు పట్టాలు ఇప్పించకపోతే ఏ మొహం పెట్టుకొని మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామనే బెంగ పట్టుకుందట ముగ్గురు ఎమ్మెల్యేలకు. పోడు రైతులకు పట్టాల వాగ్దానం అమలు కాకపొతే తమ రాజకీయ భవిష్యత్తు పై తామే మన్ను పోసుకున్నట్లు అవుతుందనే ఆందోళన పార్టీ మారిన ఎమ్మెల్యేలకు రోజురోజుకీ ఎక్కువవుతోందట.


హామీలు ఇచ్చినా..!

తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్‌ఎస్‌ అధినేత హోదాలో కేసీఆర్‌ పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని వారికి మద్దతుగా నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  గులాబీదళపతి కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే పట్టాలు ఇస్తామంటూ ప్రకటన చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ తొలి దశ పూర్తి చేసుకున్నా పట్టాలివ్వలేదు. ముందస్తు ఎన్నికలకు పోతుండటంతో పట్టాలివ్వలేకపోయామని, రెండోసారి అధికారంలోకి వస్తే తప్పక పట్టాలిస్తామని ఎన్నికల హామీలు ఇచ్చారు కేసీఆర్‌. అయితే కేసీఆర్‌ మాట నమ్మని జనం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ అభ్యర్థులను ఓడగొట్టారు.


తలలు పట్టుకుంటున్నారట..

పోడు రైతుల ఉద్యమ సెగలతో తలలు పట్టుకున్న ఎమ్మెల్యేలు ఎవరా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ. పోడు భూముల రగడ కార్చిచ్చులా వ్యాపించి వీరి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. ఇప్పటి వరకు దున్నుకునేందుకు పోడు రైతులకు భూములన్నా ఉండేవి. తాజాగా అటవీశాఖ అధికారులు వచ్చి భూముల్లో కంచెలు వేస్తూ కేసులు పెడుతుండటంతో రైతుల మాదిరే తమ భాదలు ఎవరికి చెప్పుకోవాలని తలలు పట్టుకుంటున్నారట పార్టీ మారిన ప్రజా ప్రతినిధులు.


చిన్నగా నిరసన స్వరం..!

భద్రాద్రి కొత్తగూడెంలోని 5 నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా టీఆర్‌ఎస్‌ గెలువలేకపోయింది. జనాగ్రహంతో టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. కాంగ్రెస్‌ గెలిచింది. దీంతో పోడుభూములపై మళ్లీ ఆశలుమొదలయ్యాయి గిరిజనుల్లో. అయితే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పినపాకలో రేగా కాంతారావు, ఇల్లందులో హరిప్రియ, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసి గులాబీగూటికి చేరారు. వారు పార్టీ మారినప్పుడు చెప్పిన మాటేంటంటే తాము ప్రతిపక్షంలో ఉంటే పట్టాలు రావని, అధికార పార్టీలో ఉంటేనే అన్ని పనులు అవుతాయని ప్రజలకు నమ్మబలికారు. అయితే ప్రతిపక్షపార్టీలో గెలిచినప్పుడు చేసిన ప్రమాణం, అధికార పార్టీలోకి మారినప్పుడు ఇచ్చిన హామీ బుట్టదాఖలవుతుండటంతో గులాబీగూటికి చేరిన ఎమ్మెల్యేల గుండెలు ఝల్లుమంటున్నాయట. క్షేత్రస్థాయిలో కార్చిచ్చులా కారు పార్టీకి అంటుకుంటున్న మంటలతో భవిష్యత్తుపై భయంపెట్టుకున్న పినపాక ఎమ్మెల్యే రాగా కాంతారావు చిన్నగా నిరసన స్వరం వినిపిస్తున్నారు.

Updated Date - 2021-08-06T18:23:07+05:30 IST