‘ఆంధ్రజ్యోతి’ కథనంతో నిఘా నీడన రిజర్వాయర్లు.. వాళ్లు రంగంలోకి దిగారు..!

ABN , First Publish Date - 2021-12-10T12:01:14+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు ఔటర్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గల వాటర్‌బోర్డు....

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో నిఘా నీడన రిజర్వాయర్లు.. వాళ్లు రంగంలోకి దిగారు..!

  • స్పందించిన వాటర్‌బోర్డు
  • కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఏర్పాట్లు
  • రంగంలోకి వంద మంది ప్రైవేటు సెక్యూరిటీ
  • 600 సీసీ కెమెరాలు, 200 మందితో పర్యవేక్షణ.. 
  • తనిఖీలకు నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు ఔటర్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గల వాటర్‌బోర్డు రిజర్వాయర్లలోకి ఇకపై ఇతరులు అడుగు పెట్టే అవకాశం ఉండదు. హెచ్చరిక బోర్డులతోపాటు మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వాటర్‌బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. ఎలివేటెడ్‌ రిజర్వాయర్ల వద్ద పైకి వెళ్లే మెట్ల దగ్గర గేట్లు అమర్చి తాళం ఏర్పాటు చేసి బయటివారు రాకుండా చర్యలు చేపట్టనున్నారు. రిజర్వాయర్లలోకి దిగడానికి ఏర్పాటు చేసిన మూతలు, గేట్లకు తాళాలు వేయనున్నారు. ముషీరాబాద్‌ పరిధిలోని రిసాలగడ్డ వాటర్‌ట్యాంక్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్ర స్థాయి పరిశీలన చేసి ‘ట్యాంకులెంత శుభ్రం’ అనే శీర్షికతో గురువారం కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన వాటర్‌బోర్డు అధికారులు ఉన్నతస్థాయిలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇకపై నగరంలో రిసాలగడ్డ లాంటి ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తం కావాల్సిన అవసరముందని దానకిశోర్‌ అభిప్రాయపడ్డారు.


నిరంతర పర్యవేక్షణ..

రిజర్వాయర్ల వద్ద భద్రత కోసం మరో వంద మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను శుక్రవారం నియమిస్తున్నట్లు ఎండీ చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే ఎజైల్‌ సంస్థకు టెండర్‌ ఖరారైందని తెలిపారు. వాటర్‌బోర్డులోని వివిధ విభాగాల్లో సుమారు 200మంది అదనపు సిబ్బందిని గుర్తించి, వారికి కూడా 15రోజుల్లో రిజర్వాయర్ల ప్రాంగణాల్లో భద్రతా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు. రిజర్వాయర్ల తనిఖీకి నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ స్క్వాడ్లను చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ రవిచంద్రన్‌రెడ్డి పర్యవేక్షిస్తారన్నారు. 


నెల రోజుల్లో అన్ని రిజర్వాయర్ల ప్రాంగణాల్లో 600కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రానున్న మూడు రోజులపాటు సీజీఎంలు, జీఎంలు, విజిలెన్స్‌ అధికారుల ఆధ్వర్యంలో 21 బృందాలుగా ఏర్పడి అన్ని రిజర్వాయర్లు, వాటర్‌ ట్యాంకుల వద్ద సెక్యూరిటీ ఆడిట్‌ చేయనున్నట్లు తెలిపారు. వీరిచ్చే నివేదికల ఆధారంగా మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఈడీ డా.ఎం.సత్యనారాయణ, డైరెక్టర్లు, సీఈవో రవిచంద్రన్‌రెడ్డి, సీజీఎంలు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-10T12:01:14+05:30 IST