Osmania hospital మార్చురీ వద్ద ఘటన దురదృష్టకరం: నాగేందర్

ABN , First Publish Date - 2022-05-31T18:30:31+05:30 IST

రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలో మృతదేహాన్ని పెడతామంటూ ఓ కుటుంబం పట్ల ఉస్మానియా మార్చురీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సూపరింటెండెంట్ నాగేందర్ స్పందించారు.

Osmania hospital మార్చురీ వద్ద ఘటన దురదృష్టకరం: నాగేందర్

హైదరాబాద్: రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలో మృతదేహాన్ని పెడతామంటూ ఓ కుటుంబం పట్ల ఉస్మానియా మార్చురీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై సూపరింటెండెంట్ నాగేందర్ స్పందించారు.  ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ  వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. డబ్బులు డిమాండ్ చేసిన కాంట్రాక్టు ఉద్యోగి రాజును విచారించామని... అతడిని విధుల నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. మార్చురీ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న సమాచారం ఉందన్నారు. కిందిస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు అవగాహన తీసుకువస్తున్నామని సూపరింటెండెంట్ అన్నారు.


ఇంత పెద్ద హాస్పిటల్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఓ దగ్గర ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ఉస్మానియాకు చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్పిటల్‌లో కూడా సలహాలు, ఫిర్యాదుల బాక్స్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా ఇలాంటి అవినీతి జరుగుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూపరింటెండెంట్ నాగేందర్ తెలిపారు. 

Updated Date - 2022-05-31T18:30:31+05:30 IST