నాకు పిల్లనివ్వడానికి చాలా ఆలోచించారు!

ABN , First Publish Date - 2022-01-10T06:12:52+05:30 IST

ఆయన డైలాగ్‌లు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. థియేటర్‌లో

నాకు పిల్లనివ్వడానికి చాలా ఆలోచించారు!

ఆయన డైలాగ్‌లు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. థియేటర్‌లో ఈలలు వేయిస్తాయి. చేతిలో అరడజను సినిమాలతో ఇండస్ట్రీలో టాప్‌ డైలాగ్‌ రైటర్‌గా ఉన్నారు బుర్రా సాయిమాధవ్‌. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే కార్యక్రమంలో ఆయన తన సినిమా ప్రయాణాన్ని, జీవిత విశేషాలను పంచుకున్నారు. ఆ సంభాషణలు ఇవి... 


ఆర్కే: వెల్‌కం టు ఓపెన్‌హార్ట్‌. నమస్కారం సాయిమాధవ్‌ గారు...

బుర్రా సాయిమాధవ్‌: నమస్తే సర్‌!

ఆర్కే: ఎలా ఉన్నారు?

బుర్రా సాయిమాధవ్‌: ఫైన్‌ 

ఆర్కే: ఇండస్ట్రీలో సాయిమాధవ్‌ హవా నడుస్తోందట. నిజమేనా?

బుర్రా సాయిమాధవ్‌: అంటున్నారు. వింటుంటే నాకు ఆనందంగానే ఉంది. 

ఆర్కే: ఒక్క సినిమాకు ఎన్ని రోజులు తీసుకుంటారు?

బుర్రా సాయిమాధవ్‌: అది సబ్జెక్ట్‌ని బట్టి ఉంటుంది. ఒక సబ్జెక్ట్‌ 15 రోజుల్లో అయిపోతుంది. కొన్ని సబ్జెక్టులు రెండు, మూడు నెలలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఆర్కే: ఎందుకని?

బుర్రా సాయిమాధవ్‌: మహానటికి రాశాను. చాలా టైం పట్టింది. ఒక సీన్‌ రాశాక ఆ సీన్‌లో నుంచి బయటకు రావడానికి రెండు, మూడు రోజులు పట్టేది. ఒక సీన్‌ రాశాక ట్రాన్స్‌లో ఉండిపోయే వాణ్ణి. అంత ప్రభావం పడింది. 

ఆర్కే: ఇప్పుడంటే సాయిమాధవ్‌ అందరికీ తెలుసు. పదేళ్లు వెనక్కి వెళితే మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు?

బుర్రా సాయిమాధవ్‌: నేను రైటర్‌ అవ్వాలనే వచ్చాను. మాది తెనాలి. చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి. మాది కళాకారుల కుటుంబం. మా అమ్మానాన్న ఇద్దరూ స్టేజ్‌ ఆర్టిస్టులు. నేను అరేళ్ల వయసులోనే స్కూల్‌కు వెళుతూ నాటకాలు వేసే వాణ్ణి. ఆ తరువాత వామపక్ష భావజాలానికి ప్రభావితమయ్యాను. ప్రజానాట్యమండలిలో నాటకాలు వేసేవాణ్ణి. మద్యపాన నిషేదం పై గ్రామగ్రామానికి తిరిగి నాటకాలు వేశాం. సినిమా అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే హైదరాబాద్‌ వచ్చేశా. 

ఆర్కే: సినిమా కష్టాలు మీకూ ఎదురయ్యాయా?

బుర్రా సాయిమాధవ్‌: చాలా! ఇంటి నుంచి అమ్మ వెయ్యి రూపాయలు పంపేది. అవి వారంరోజుల్లో అయిపోయేవి. మళ్లీ అడిగేవాణ్ణి కాదు. అడిగితే వెనక్కి వచ్చేయమని అంటారని! కష్టాలను అడ్వెంచర్స్‌గా ఫీలయ్యే వాణ్ణి. అనుభవాలుగా ఉపయోగపడ్డాయి. ప్రతీది సినిమాలతో పోల్చుకునే వాణ్ణి. ఫలానా సినిమాలో కమల్‌హాసన్‌ అన్నం లేకుండా ఉన్నాడు. మనం కూడా ఇవ్వాళ అన్నం లేకుండా ఉన్నాం. ఆ అవకాశం నాక్కూడా వచ్చింది అని అనుకునే వాణ్ణి. అవకాశాల కోసం ప్రయత్నించే వాణ్ణి కూడా కాదు. ఒకసారి సీరియల్స్‌ డైరెక్టర్‌ రాజాచంద్రవర్మ గారు పరిచయమయ్యారు. ఆయనకు ఎవ్వరూ రాసినా నచ్చేది కాదు. ఆయనే స్వయంగా తిరగరాసుకునే వాడు. అయనకు నేను రాసిన డైలాగ్స్‌ బాగా నచ్చాయి. దాంతో నన్ను రాయమన్నాడు. ‘అభినందన’ అని టెలీఫిల్మ్‌ అది. దానికి బాగా పేరొచ్చింది. తరువాత పుత్తడిబొమ్మ సీరియల్‌కు అవకాశం వచ్చింది. అది చూసిన క్రిష్‌ గారు ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమా అవకాశం ఇచ్చారు.



ఆర్కే: క్రిష్‌తో అన్ని సినిమాలకు పనిచేశారా?

బుర్రా సాయిమాధవ్‌: అన్ని సినిమాలకు రాశాను.

ఆర్కే: 3వేలతో మొదలుపెట్టిన మీరు కోటి తీసుకుంటున్నారా?

బుర్రా సాయిమాధవ్‌: కోటి ఎవరు ఇస్తున్నారు సర్‌. ఇస్తే అంతకంటే కావలసింది ఏముంది? ఇస్తే ఆనందంగా తీసుకుంటాను. కోటి రూపాయలు డైలాగ్‌ రైటర్‌కు ఇవ్వరు.

ఆర్కే: అందులో సగం ఇస్తారా?

బుర్రా సాయిమాధవ్‌: సగం ఇస్తారు.

ఆర్కే: ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేశారా?

బుర్రా సాయిమాధవ్‌: నేను ఎవ్వరి దగ్గరా ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేయలేదు. నాకూ ఘోస్ట్‌ రైటర్‌ లేడు. 

ఆర్కే: కథలు రాసే శక్తి ఉంది. స్ర్కీన్‌ప్లే రాసే శక్తి ఉంది. ఒకే సినిమాకు కోటి రూపాయలు సంపాదించే సామర్థ్యం ఉంది. మరి ఎందుకు చేయడం లేదు? 

బుర్రా సాయిమాధవ్‌: టైం లేదు. డైలాగ్‌ రైటర్‌గా చాలా బిజీగా ఉన్నాను. అయితే కొన్ని కథలు సిద్ధం చేసుకున్నాను. సమయం వచ్చినప్పుడు వస్తాయి.

ఆర్కే: దినచర్య ఎలా మొదలవుతుంది?

బుర్రా సాయిమాధవ్‌: పొద్దున లేచిన దగ్గరి నుంచి రాత్రి వరకు రాయడమే పని. మధ్యలో భోజనానికి కాసేపు విరామం. అంతే! కాఫీలు, టీలు, సిగరెట్‌ అన్నీ మానేశా. 

ఆర్కే: సిగరెట్‌ ఎలా మానేశారు?

బుర్రా సాయిమాధవ్‌: మానేద్దామనుకున్నాను. మానేశాను. 

ఆర్కే: సీతారామశాస్త్రిని చూశాక మానేయాలని అనిపించిదా?

బుర్రా సాయిమాధవ్‌: వాస్తవం అదే. ఇండస్ట్రీలో గురువు అంటే ఆయనే. ఆయనకు నివాళిగా సిగరెట్‌ వదిలేశా. 

ఆర్కే: రోజంతా రాసుకుంటూ కూర్చుంటే ఇంట్లో వాళ్లకు  విసుగుపుట్టదా?

బుర్రా సాయిమాధవ్‌: వాళ్లకు కూడా అలవాటై పోయింది. రాయకుండా కనిపిస్తే భయపడిపోతారు. 

ఆర్కే: పిల్లలెంతమంది?

బుర్రా సాయిమాధవ్‌: ఇద్దరు. పెద్దమ్మాయి ఎంబీఎ, చిన్నమ్మాయి బిబిఎ చదువుతోంది. 

ఆర్కే: బాహుబలి అవకాశం ఎలా మిస్సయింది?

బుర్రా సాయిమాధవ్‌: నేను మిస్‌ చేసుకోలేదు. ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. నేను వెళ్లడం కలవడం, రెమ్యునరేషన్‌ మాట్లాడుకోవడం జరిగింది. ఆ తరువాత ఫోన్‌ రాలేదు. కారణం ఏంటో తెలియదు. నేను ఎవ్వరినీ అడగలేదు. తరువాత రాజమౌళిగారే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అవకాశం ఇచ్చారు. 

ఆర్కే: రైటర్‌ కాకముందే తెనాలిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు కదా! ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నారు?

బుర్రా సాయిమాధవ్‌: నాకు పిల్లను ఇవ్వడానికి కూడా చాలా ఆలోచించారు.   నాటకాలోడని, సంపాదన లేదని! కాకపోతే మంచోడు, తరువాతైనా సెటిల్‌ అవుతాడులే అనే ఉద్దేశంతో పిల్లనిచ్చారు. 

ఆర్కే:  చిరంజీవిని ఎలా కన్విన్స్‌ చేశారు?

బుర్రా సాయిమాధవ్‌: నాగబాబు గారు నా గురించి చిరంజీవి గారికి చెప్పారు. 

ఆర్కే: నాగబాబు ఎలా పరిచయం?

బుర్రా సాయిమాధవ్‌: శిఖరం, సీతామహాలక్ష్మి సీరియల్స్‌కు పనిచేశాను. ఆ పరిచయంతో నా గురించి చిరంజీవి గారికి చెప్పారు. ఓరోజు నాగబాబుగారు సడెన్‌గా ఫోన్‌ చేసి అన్నయ్య నీకు  ఫోన్‌ చేస్తాడు అని చెప్పారు. నేను షాక్‌. చిరంజీవి గారు కూడా నా వర్క్‌ అంతకుముందు చూశారు. కంచె సినిమా సమయంలో అభినందించారు. తరువాత చిరంజీవి గారు ఫోన్‌ చేసి ఖైదీనంబర్‌ 150 సినిమాకు పనిచేయాలని అడిగారు. ఒక్క డైలాగ్‌ రాసే అవకాశం ఇచ్చినా  సంతోషం సార్‌ అని చెప్పా. ఆ సినిమాకు వేమారెడ్డి కొన్ని సీన్స్‌ రాశాడు. నేను కొన్ని రాశాను. 

ఆర్కే: రైటర్స్‌ డైరెక్టర్స్‌ అవుతున్నారు కదా! మరి మీరెప్పుడు?

బుర్రా సాయిమాధవ్‌: ఇంకా అనుకోలేదు. ముందు ముందు అనుకోవచ్చు. 

ఆర్కే: టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళి సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌కు పనిచేసే అవకాశం వచ్చినప్పుడు జంకు వచ్చిందా?

బుర్రా సాయిమాధవ్‌: ఏం లేదు. పైగా అలాంటి డైరెక్టర్‌తో పనిచేయడం తేలిక. ఆయనతో పనిచేయడం మొదలుపెట్టిన తరువాత చాలా హాయిగా ఉంది. చాలా క్లారిటీతో ఉంటారు. కన్‌ఫ్యూజన్‌ ఉండదు. ఎక్కడ మంచి డైలాగ్‌ పడాలో క్లారిటీతో ఉంటారు. మంచి విజువల్‌ ఉన్న చోట మంచి డైలాగ్‌ అవసరం లేదని చెబుతారు. 

ఆర్కే: ఈ డైలాగ్‌ బాగా పేలుతుందని అనుకున్నవి, రిలీజ్‌ అయ్యాక తుస్‌ మన్నవి ఉన్నాయా?

బుర్రా సాయిమాధవ్‌: సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాలో ఒక సీన్‌లో విలన్‌ నా కాళ్లు పట్టుకుని సారీ చెబితే నీ ఉద్యోగం నీకు వచ్చేలా చేస్తాను అని హీరోతో అంటాడు. దాంతో హీరో సారీ చెబుతాడా అని అందరిలో ఉత్కంఠ పెరుగుతుంది. నెమ్మదిగా హీరో విలన్‌ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. పవర్‌స్టార్‌ కాళ్లు పట్టుకుంటాడా? అని క్యూరియాసిటీ వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చాక కాళ్ల మీద కాలుస్తాడు. తరువాత ‘‘కాళ్లకు దండం పెట్టే సింహాన్ని ఎక్కడైనా చూశావా?’’ అంటాడు. ఈ డైలాగ్‌ విపరీతంగా పేలుతుందని అనుకున్నాను. కానీ ఈ డైలాగ్‌ సినిమాలో ఉందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఎందుకు డైలాగ్‌ పేలలేదో తెలియదు. థియేటర్‌ డైలాగ్‌ వచ్చినప్పుడు ఆడియన్స్‌ నుంచి స్పందన రాలేదు. 



ఆర్కే: మీరు రాసిన డైలాగుల్లో మీ ఆవిడకు నచ్చిన డైలాగ్‌ ఏది?

బుర్రా సాయిమాధవ్‌: ఏదీ చెప్పదు. లోపల అనుకుంటుందేమో గానీ బయటకు చెప్పదు. ‘ఆ బానే ఉన్నాయి’ అంటుంది అంతే! పిల్లలు చెబుతుంటారు డైలాగ్‌లు బాగున్నాయని. పిల్లలకు ‘మహానటి’ బాగా నచ్చింది. 

ఆర్కే: మహానటి, కథానాయకుడు వంటి బయోపిక్‌లు రాసేటప్పుడు భయం వేయలేదా?

బుర్రా సాయిమాధవ్‌: రామారావు గారంటే నాకు పిచ్చి. ఒకసారి ఆయన తెనాలికి వచ్చారు. నేను అప్పుడు చిన్న పిల్లాడ్ని. ఆయన కూర్చుంటే పక్కన నిలుచున్నా. నా భుజం మీద చెయ్యేసి వేరే వాళ్లతో మాట్లాడుతున్నారు. సపోర్టు కోసం చెయ్యేసారు. కదిలితే ఎక్కడ చెయ్యి తీస్తారో అని కదలకుండా నిలుచున్నా. నిజం చెప్పాలంటే ఆయన నావైపు కూడా చూడలేదు. తరువాత రామారావు గారు చెయ్యేసిన భుజం అని మూడునాలుగేళ్ల పాటు ఎవ్వరినీ నా భుజం మీద చెయ్యి వేయనీయలేదు. ఆయన ఊహల్లో బతకడం వల్ల తేలికయింది. సినిమా దెబ్బతిన్నప్పుడు పది రోజులు మామూలు మనిషి కాలేకపోయాను. ఆ బాధ ఇంకా ఉంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ రాసే అవకాశం వచ్చిందని గర్వపడ్డా. కానీ సినిమా పోయిందనే బాధ జీవితాంతం ఉంటుంది. 

ఆర్కే: ఏపీలో సినిమా టికెట్‌ రేట్లు తగ్గించారు కదా! దానిపై మీ అభిప్రాయం ఏంటి?

బుర్రా సాయిమాధవ్‌: రేట్లు తగ్గించాలి. సినిమాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన మంచిదే. కాకపోతే ముందు వేటికి తగ్గించాలని అనేది  ముఖ్యం. సినిమా చూడకపోతే చచ్చిపోరు. నిత్యావసరాలు ఉన్నాయి. వాటి ధరలు పెంచేసి సినిమా టికెట్‌ ధర తగ్గిస్తే ఏం లాభం? సులభ్‌ కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి, సినిమా థియేటర్‌లోకి వెళ్లడానికి ఒకే ధర  ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. టికెట్‌ ధరలు తగ్గించమని జనాలు అడగడం లేదు కదా! 

ఆర్కే: సాధారణంగా ఎలాంటి సందర్భాల్లో రియాక్ట్‌ అవుతుంటారు?

బుర్రా సాయిమాధవ్‌: నచ్చకపోతే రియాక్ట్‌ అవుతుంటాను. నా స్పందన ఎక్కువ పెన్నుతో పేపర్‌ మీద పెడతాను. 

ఆర్కే: మీలో ఉన్న గొప్ప దర్శకుడు బయటకు రావాలని కోరుకుంటూ ఽథాంక్యూ వెరీ మచ్‌. 




వృత్తిలో హర్ట్‌ అవ్వడం కూడా ఒక భాగం. అది అలవాటయిపోయింది. ఇప్పుడు హర్ట్‌ అయినట్టు కూడా తెలియట్లేదు. అది సహజం.


తెనాలిలో సెంటర్‌లో స్నేహితులతో కలిసి  నిలుచున్నా. ఒక మతిస్థిమితం లేని ఒకావిడ కొడుకులను తిట్టుకుంటూ వెళుతోంది. ‘‘నేను కావాలంటే మళ్లీ బిడ్డను కనగలను రా! కానీ మీరు ఎప్పటికీ తల్లిని కనలేరు’’ అని అనుకుంటూ వెళుతోంది. ఆ మాట నాకు బాగా గుర్తుండిపోయింది. ఆ డైలాగ్‌ దొంగాట సినిమాలో వాడాను.


కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమాకు రాస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక సీన్‌లో హీరోయిన్‌ ఒకే డైలాగ్‌తో హీరోను మార్చేస్తుంది. ఆ డైలాగ్‌ ఎన్ని వెర్షన్లు రాసినా క్రిష్‌కు నచ్చట్లేదు. ప్రతీ వెర్షన్‌ నాకు నచ్చుతోంది. కానీ ఆయనకు నచ్చడం లేదు. ‘‘ఫరవాలేదు సమయం తీసుకో. ఆ సీన్‌ తరువాత తీద్దాం’’ అన్నారు క్రిష్‌. టైం గడిచిపోతోంది. గుమ్మడికాయ కొట్టడానికి మూడు రోజులే మిగిలింది. ఏంటి? ఎందుకు నచ్చడం లేదు? అని బాగా ఆలోచించా. ఆ సీన్‌లో రెండు నిజాలు కొట్టుకుంటున్నాయి. ఆ హీరోయిన్‌ చెప్పేది నిజమే. హీరో చెప్పేది నిజమే. కానీ హీరోయిన్‌ చెప్పేది గెలవాలి. ఆ మాటతో హీరో మారాలి. అప్పుడొక డైలాగ్‌ రాశా! ‘‘అమ్మ తొమ్మిది నెలలు కష్టపడితే మనం పుట్టాం అని అనుకుంటారు కొందరు. కాదు, నాన్న పక్కన పది నిమిషాలు సుఖపడితే పుట్టామని అనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కానీ పురిటి నొప్పులు చూసిన వాడు మనిషవుతాడు. పడక సుఖాన్ని చూసిన వాడు పశువవుతాడు.’’ అని. ఆ డైలాగ్‌ క్రిష్‌కు బాగా నచ్చింది.


డైలాగ్స్‌ రాసేటప్పుడు క్యారెక్టర్‌ను దృష్టిలో పెట్టుకుంటాను. ఆ హీరో స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుంటాను. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ రాస్తా. భాష విషయంలో పట్టింపుగా ఉంటాను. మహిళలను కించపరిచే డైలాగులు రాయను. బూత్‌ డైలాగ్‌ రాస్తే క్లాప్స్‌ కొడతారు అంటే రాయను. 


Updated Date - 2022-01-10T06:12:52+05:30 IST