Advertisement
Advertisement
Abn logo
Advertisement

Hyderabad లో సంతలో సరుకుల్లా తుపాకులు.. పదివేలకు ఒకటి.. ఆధార్‌కార్డ్‌ ఉంటే ఎయిర్‌గన్‌.. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి పరిశీలనలో సంచలన విషయాలు వెలుగులోకి..!

  • బొమ్మ తుపాకులతో బెదిరింపులు
  • ప్రమాదకరంగా మారుతున్న విక్రయాలు
  • ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంటికే..

హైదరాబాద్‌ సిటీ : వారం రోజుల క్రితం తిరుమలగిరి పీఎస్‌ పరిధిలో వరసకు అన్నని కాల్చి చంపాడో ప్రబుద్ధుడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు గన్‌ సంపాదించిన తీరు చూసి అవాక్కయ్యారు. సోదరుడిని గన్‌తోనే కాల్చి చంపాలనుకున్న నిందితుడు కొన్ని నెలల క్రితమే రెండు కంట్రీమేడ్‌ సమకూర్చుకున్నాడు. ఒకటి పని చేయకున్నా మరొకటి ఉపయోగ పడుతుందని రెండు కొన్నట్లు చెప్పాడు. మధ్యప్రదేశ్‌, బుర్హాన్‌పూర్‌కు చెందిన వ్యక్తి నుంచి రెండు కంట్రీమేడ్‌ పిస్టల్స్‌, 6 లైవ్‌ రౌండ్లు రూ. 30 వేలకు కొన్నాడు. కొనే ముందు గాల్లో ఓ రౌండ్‌ కాల్చి చెక్‌ చేసుకున్నాడట. సోదరుడిని చంపే ముందు కూడా మరోసారి చెక్‌ చేసుకుని రంగంలోకి దిగాడు. ఇలా రెండు రౌండ్‌లు కాల్చేసిన నిందితుడు మూడో బుల్లెట్‌ను నేరుగా సోదరుడిని మెడలోనే కాల్చాడు. మిగతా మూడు లైవ్‌ రౌండ్‌లు, రెండు పిస్టళ్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో రూ. 10 వేలు వెచ్చిస్తే తుపాకీ దొరుకుతోందనే విషయం మరోసారి స్పష్టమైంది. అసలు తుపాకులు మాత్రమే కాకుండా, వాటిని పోలిన ఎయిర్‌ గన్స్‌ బజారులో ఈజీగా దొరకడం ప్రజలకు, పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ఎయిర్‌గన్స్‌ వ్యవహారంపై ఏబీన్‌-ఆంధ్రజ్యోతి క్రైం బృందం నిఘా పెట్టింది. సంతలో సరుకులా ఇవి దొరుకుతున్నాయనే విషయాన్ని గుర్తించింది. 


ఇంటికే డెలివరీ..

నగరంలో ఎయిర్‌గన్స్‌ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఇవి దొరుకుతున్నాయి. కేవలం రూ. వందలు వెచ్చిస్తే ఇంటికే డెలివరీ చేస్తున్నారు. ఎయిర్‌ గన్స్‌కు ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం, వాటిపై నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. కేవలం ఆధార్‌ కార్డు చూపిస్తే.. ఆయుధాలు విక్రయించే షాపుల్లో ఈజీగా అమ్ముతున్నారు. రేంజ్‌ను బట్టి ధరలు ఉంటున్నాయి. పలు ఆర్మరీ షాపులను సందర్శించిన ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి బృందం సునాయాసంగా లభిస్తున్న ఎయిర్‌గన్‌ల విక్రయ ప్రక్రియను స్పష్టంగా గుర్తించింది. ఆధార్‌ కార్డు ఉంటే చాలు కేవలం రూ. 4 వేల లోపే ఎయిర్‌ గన్‌లను విక్రయిస్తున్నారు. 10 మీటర్ల రేంజ్‌ వరకు ఫైర్‌ చేయగల ఎయిర్‌గన్స్‌ను బహిరంగంగా అమ్మేస్తున్నారు.

జంతువులను బెదిరించడానికంటూ..

పక్షులు, జంతువులను బెదిరించడానికి అంటూ ఎయిర్‌గన్స్‌ తీసుకుంటున్నప్పటికీ వాటిని ఇతర అవసరాలకు వాడుతున్నట్లు ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనలు చెబుతున్నాయి. ఎయిర్‌ గన్స్‌ అమ్మకాలకు అనుమతులు అక్కర్లేకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తోంది. ఎయిర్‌ గన్స్‌ కొనుగోలు చేసి వాటిని రియల్‌ గన్స్‌గా చూపి బెదిరించడం సాధారణంగా మారిపోయింది. 


అదీ అవసరం లేదు..

ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లలో కూడా ఎయిర్‌గన్స్‌ విక్రయాలకు పెట్టేశారు. ఆయుధాల షాప్‌లో ఆధార్‌ కార్డు చూపాలి, ఆన్‌లైన్‌లో అయితే అదీ అవసరం లేదు. ఆర్డర్‌ చేసిన రెండు మూడు రోజుల్లో డెలివరీ చేస్తున్నాయి. యువత ఎక్కువగా ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌లలో ఎయిర్‌ గన్స్‌ కొనుగోలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో ధర కూడా రూ. వెయ్యిలోపే ఉంటోంది.


కేసుల నమోదు

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఎయిర్‌ గన్‌తో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన జవహర్‌నగర్‌లో తీవ్ర కలకలం రేపింది. ప్రేమను నిరాకరించడంతో ఓ యువతిని ఎయిర్‌గన్‌తో బెదిరించాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాతనగరంలో మరో యువకుడు ఎయిర్‌గన్‌తో గతనెలలో హల్‌చల్‌ సృష్టించాడు. చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇంజనీరింగ్‌ విద్యార్థి అర్ధరాత్రి ఎయిర్‌గన్‌తో పలువురిని బెదిరించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఎయిర్‌గన్‌తో పాటు 12 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.


ప్రమాదకరం..

వాస్తవానికి ఎయిర్‌ గన్స్‌ కూడా ప్రమాదకరమే. దూరం నుంచి కాలిస్తే అంత సమస్య తలెత్తకున్నా దగ్గరి నుంచి ఫైర్‌ చేస్తే ప్రాణాలు పోయే అవకాశముంది. గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు వీటి అమ్మకాలపై నిఘాను పెంచాల్సిన అవసరముంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసే వారికి సరైన మార్గదర్శకాలు అందించాలి. లేకుంటే గన్‌ కల్చర్‌ విచ్చలవిడిగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఎయిర్‌గన్స్‌ మరింత ప్రమాదకర సమస్యగా మారకముందే వాటి అమ్మకాలపై నియంత్రణ విధిస్తే మేలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


Advertisement
Advertisement