కోలీవుడ్: వాణిజ్య ప్రకటనలో నటించి సినిమా ఛాన్స్ కొట్టేసిన నటి అభితా వెంకట్. ‘కేరాఫ్ కాదల్’ చిత్రంలో ఆమె తొలిసారి నటించింది. ఈ చిత్రంలోనే వేశ్య పాత్రలో బోల్డ్‌గా కనిపించింది. ఈ మూవీలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘కమలి ఫ్రమ్ నడుక్కావేరి’ చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. ఈ చిత్రంలో కూడా అభితా నటన బాగుందని సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకు నటించిన రెండు చిత్రాల్లో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించిన ఈమెకు పలు మూవీస్‌లో నటించే అవకాశాలు వస్తున్నాయట.
ఈ క్రమంలో తనకు తొలి అవకాశం ఎలా వచ్చిందన్న దానిపై అభిత స్పందిస్తూ.. కొన్నేళ్ళుగా వివిధ రకాల ప్రకటనల్లో నటిస్తూ వస్తున్నాను. సినిమాల్లో నటించాలన్న కోరిక ఉన్నప్పటికీ, ఎవరిని సంప్రదించాలో తెలియదు. అలా కొన్నేళ్ళు గడిచి పోయాయి. అయితే, ఓ ప్రకటన వీడియో చూసి ‘కేరాఫ్ కాదల్’ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. ఇది నా మొదటి చిత్రం. తొలి చిత్రంలోనే వేశ్య పాత్రలో నటించవద్దని చాలా మంది వారించారు. కానీ, నేను ధైర్యం చేసి ఆ పాత్ర చేసేందుకు ముందుకు వచ్చాను. ఆ తర్వాత ‘కమలి ఫ్రమ్ నడుక్కావేరి’ చిత్రంలో నటించే ఛాన్స్ దొరిగింది. ఇది విభిన్నమైన పాత్ర. రెండు చిత్రాల్లో రెండు వేర్వేరు పాత్రల్లో కనిపించడం, ఆ పాత్రలకు మంచి ప్రశంసలు దక్కడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోత్సాహం మున్ముందు మరిన్ని మంచి పాత్రల్లో నటించేందుకు, కెరీర్ ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని భావిస్తున్నాను.." అని అభితా వెంకట్ చెప్పుకొచ్చింది.