కనిపించని శత్రువు కరోనా

ABN , First Publish Date - 2020-03-30T11:32:40+05:30 IST

ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కనిపించని శత్రువు కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటు న్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు.

కనిపించని శత్రువు కరోనా

 కట్టడికి ప్రజలందరూ స్వీయ నిర్బంధం పాటించాలి

ఇటుక బట్టీల కార్మికుల బాగోగుల బాధ్యత యాజమాన్యాలదే

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి 


మహేశ్వరం : ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కనిపించని శత్రువు కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటు న్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపల్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి కరోనా కట్టడికి స్వీయ నిర్బంధం పాటించాలని అన్నారు. కరోనాను అరికట్టడంలో ప్రభుత్వ శాఖలైన వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, పంచాయితీరాజ్‌, రెవెన్యూ అధికారులతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 24 గంటలు సేవలందిస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా వ్యవహరించి ఇంటికే పరిమితం కావాలని, ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వం తక్షణం స్పందించి సహకరిస్తుందని వివరించారు. ముఖ్యంగా తుక్కుగూడ మున్సిపల్‌ పరిధిలోని ఇటుకబట్టీల్లో దాదాపు రెండు వేలకు పైగా వలస కార్మికులు ఉన్నారని అన్నారు. వారందరికీ ఇటుక బట్టీల యజమానులు కార్మికులకు కావాల్సిన భోజనవసతితోపాటు ఇతర సదుపాయాలను కల్పించాలని సూచించారు.


మహేశ్వరం సమీపంలో ఉన్న శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతి రోజు దేశ విదేశాలనుండి 500విమానాలు రావడంతో ఒక్క రంగారెడ్డి, హైదరాబాద్‌ ప్రాంతాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు మహేశ్వరం, తుక్కు గూడ ప్రాంతాల్లో కరోనాకు సంబంధించి ఎలాంటి పాజిటివ్‌ కేసులు లేవన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన ఉత్పత్తులు అదే గ్రామాల్లో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ కాంటేకార్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ భవాని వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, తహసీల్దార్‌ ఆర్‌పి.జ్యోతి, ఇటుకబట్టీల యజమానులు పాల్గొన్నారు.    

Updated Date - 2020-03-30T11:32:40+05:30 IST