‘స్వచ్ఛం’గా సత్తా!

ABN , First Publish Date - 2022-03-11T07:44:43+05:30 IST

రాజకీయ పార్టీలన్నీ కులం, మతం, ప్రాంతం, డబ్బు లెక్కలు

‘స్వచ్ఛం’గా సత్తా!

  • దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర
  •  ఢిల్లీలో మొదలైన ‘ఆప్‌’ ప్రయాణం
  •  పంజాబ్‌లో గెలుపుతో కొత్త ఉత్సాహం
  •  ఐదేళ్లలో బీజేపీకి ప్రత్యామ్నాయమా?
  •  రాజకీయ విశ్లేషకుల అంచనా


రాజకీయ పార్టీలన్నీ కులం, మతం, ప్రాంతం, డబ్బు లెక్కలు వేసుకుంటాయి! వ్యూహాలన్నీ దాని చుట్టూనే తిరుగుతాయి. కానీ... ‘ఆప్‌’ తీరే వేరు! అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన గురించి మాత్రమే చెబుతూ ఢిల్లీ కోటను గెలిచేసింది. ఇప్పుడు పక్కనే ఉన్న పంజాబ్‌నూ ‘చీపురు’తో ఊడ్చేసింది. మున్ముందు జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రధాన పోటీదారు అవుతుందనే అంచనా కూడా మొదలైంది.


ఒక్క అడుగుతో...

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఖరగ్‌పూర్‌ ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేశారు. ఐఆర్‌ఎస్‌ అధికారిగా సేవలందించారు. యూపీఏ-2లో అన్నా హజారేతో కలిసి ‘అవినీతి వ్యతిరేక’ పోరాటంలో పాల్గొన్నారు. తర్వాత... 2012లో కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. పేరు... ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ (ఆప్‌)! గుర్తు... చీపురు! ఈ రెండూ వినూత్నమే! 2013లో తొలిసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్‌’ పోటీచేసింది. కాంగ్రెస్‌, బీజేపీలకు మొదటిదెబ్బను రుచి చూపించింది. 70 స్థానాలకుగాను 28 చోట్ల ఆప్‌ ఎమ్మెల్యేలు గెలిచారు. ‘హంగ్‌’ నేపథ్యంలో కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ... ‘సంఖ్యాబలం’ కలిసిరాకపోవడంతో 49 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2015 ఎన్నికల్లో 70కి 67 సీట్లు గెలుచుకున్నారు. 2020లో మళ్లీ ఢిల్లీ కోటపై ఆప్‌ జెండా ఎగురవేశారు.


ఢిల్లీ రాష్ట్ర హోదా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం! ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలు పరిమితం. ఒకరకంగా చెప్పాలంటే ఢిల్లీ సీఎం అంటే మేయర్‌కు ఎక్కువ, ముఖ్యమంత్రికి తక్కువ! అయినా సరే... పాలనలో కేజ్రీవాల్‌ తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛమైన పాలనతో విద్యావంతులను, సంక్షేమ పథకాలతో పేదలనూ ఆకట్టుకున్నారు. ‘ఆప్‌’ను ఢిల్లీకే పరిమితం చేయాలని  కేజ్రీ ఎప్పుడూ అనుకోలేదు. దేశంలోని ఇతర రాష్ట్రాలకూ విస్తరించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అటు బీజేపీని, ఇటు కాంగ్రె్‌సను తనదైన శైలిలో పదునైన మాటలతో విమర్శిస్తూనే ఉన్నారు. నిజానికి ఆయన ఢిల్లీ సీఎంగా కుదురుకోకముందే మోదీని ఢీకొట్టారు.


2014 ఎన్నికల్లో  బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగిన మోదీపై వారాణసీలో కేజ్రీవాల్‌ పోటీ చేశారు. అక్కడ డిపాజిట్లు దక్కకున్నా కుంగిపోలేదు. ఆ తర్వాత ఆరు నెలలకే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. ఇప్పుడు.. చిన్నదే అయినప్పటికీ, పూర్తిస్థాయి రాష్ట్రమైన పంజాబ్‌లోనూ ఆప్‌ విజయకేతనం ఎగురవేసింది. గోవా, ఉత్తరాఖండ్‌లలోనూ ‘ఆప్‌’ పోటీ చేసింది. గోవాలో రెండు స్థానాలతో సరిపెట్టుకుంది.


ప్రస్తుతం బీజేపీ, కాంగ్రె్‌సలను మినహాయిస్తే... రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఏకైక పార్టీ ‘ఆప్‌’! ‘‘కేజ్రీవాల్‌ నింపాదిగా ముందుకు వెళ్తున్నారు. ఏడేళ్లుగా సీఎంగా ఉన్న ఆయన... తానేమిటో, తన విధానాలేమిటో ప్రజలకు తెలియచెప్పారు. విద్యా, వైద్య వ్యవస్థల రూపు రేఖలను మార్చేశారు. ఇతర రాష్ట్రాలనూ ఆకట్టుకున్నారు. ఇప్పుడు పొరుగున ఉన్న పంజాబ్‌ను గెలుచుకున్నారు. 


Updated Date - 2022-03-11T07:44:43+05:30 IST