దోహా: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక సంఘ ఖతర్ వారు సామాజికంగా, వృత్తిపరంగా భారతీయ సమాజానికి విశేష కృషి చేసినందుకు అభియనంతరశ్రీ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. 2021 సంవత్సరానికి గాను తెలుగు ఇంజనీర్ కృష్ణ కుమార్ బంధకవికి ఈ విశిష్ట పురస్కారం దక్కింది. బుధవారం దోహాలోని ఇండియన్ కల్చరల్ సెంటర్లోని అశోక హాల్లో జరిగిన కార్యక్రమంలో ఐసీసీ అధ్యక్షుడు పీఎన్ బాబురాజన్, కేఎస్క్యూ ప్రెసిడెంట్ నగేష్ రావు చేతుల మీదగా కృష్ణ కుమార్ పురస్కారం అందుకున్నారు. తెలుగు కళా సమితి వ్యవస్థాపక సభ్యుడైన కృష్ణ కుమార్ బంధకవి ఖతర్‌లో ప్రస్తుతం ఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన ఆయన తణుకులో మెకానికల్‌లో డిప్లొమా చేశారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా ద్వారా మెకానికల్‌లో AMIE పూర్తి చేశారు. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రామగుండం, రిలయన్స్ ఇండస్ట్రీస్ బొంబాయి, ఖతర్ గ్యాస్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఖతర్ గ్యాస్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత ASTRON సర్టిఫికేషన్‌లో జనరల్ మేనేజర్ అసెట్ ఇంటెగ్రిటీ సర్వీసెస్‌లో చేరారు. కేకే మాట్లాడుతూ తన ఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించినవారిలో భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మోక్షగుండం విశ్వేశవరయ్య జయంతి సందర్భంగా జరిగే ఇంజనీర్స్ డే రోజున ఈ సత్కారం పొందినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.