అభిషేకం టికెట్‌ 10వేలు!

ABN , First Publish Date - 2022-07-23T10:19:00+05:30 IST

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం రోజున అభిషేకం టికెట్‌ ధరను రూ.10వేలకు పెంచాలని ఆలయ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు.

అభిషేకం టికెట్‌ 10వేలు!

  • ఏడాది ప్యాకేజీకైతే రూ.2.60లక్షలు
  • ‘సోమవారం’ రద్దీని తగ్గించేందుకేనట
  • వేములవాడ అధికారుల ప్రతిపాదనలు
  • ప్రస్తుతం టికెట్‌ ధర రూ.వెయ్యి మాత్రమే
  • పెంపు ప్రతిపాదనలపై భక్తుల మండిపాటు

వేములవాడ, జూలై 22: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(Rajarajeswara Swamy) దేవస్థానంలో సోమవారం రోజున అభిషేకం టికెట్‌ ధరను రూ.10వేలకు పెంచాలని ఆలయ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం రాజన్న క్షేత్రంలో ఏ రోజుకైనా అభిషేకం టికెట్‌ రూ.వెయ్యి మాత్రమే ఉంది. రూ.3వేలు చెల్లించి శాశ్వత అభిషేకం టికెట్‌ పొందిన వారికి ఏడాదికి ఒక సారి చొప్పున పదేళ్లపాటు గర్భాలయంలో అభిషేకానికి అనుమతిస్తున్నారు. అయితే, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోందన్న సాకుతో సోమ, శుక్ర, ఆదివారాల్లో గర్భాలయంలో ఆర్జిత పూజలకు సాధారణ భక్తులను అనుమతించడం లేదు. మంత్రులు(Ministers), ఎంపీలు(MPs), ఎమ్మెల్యేలు(MLAs), ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల(IPS Officers)తోపాటు సీఎం పేషీ సిఫారసు చేసిన వారిని మాత్రమే సోమవారం గర్భాలయంలోకి అనుమతిస్తున్నారు. అయితే, వరంగల్‌(Warangal)కు చెందిన ఓ విద్యా సంస్థ అధినేత ఏకంగా 52 శాశ్వత అభిషేకం టికెట్లు కొనుగోలు చేయడంతో ప్రతి సోమవారం గర్భాలయంలో అభిషేక పూజకు అనుమతివ్వడం వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రతి సోమవారం అభిషేక పూజ టికెట్‌ ధరను రూ.10వేలకు, ఏడాదిపాటు 52 వారాలకు రూ.2.60లక్షల ప్యాకేజీ నిర్ణయిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు అధికారులు ప్రతిపాదనలను పంపినట్లు తెలుస్తోంది. రాజన్న క్షేత్రంలో ఇష్టారాజ్యంగా టిక్కెట్ల ధరల పెంచుతూ ప్రతిపాదించడంపై భక్తులు మండిపడుతున్నారు.

Updated Date - 2022-07-23T10:19:00+05:30 IST